టెక్నాలజీ పెరిగిన కొద్ది సైబర్ మోసాలు కూడా పెరగడం కనిపిస్తుంది. నిపుణులు ఎంత అవగాహన కల్పించిన గాని.. నిత్యం మోసపోయే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. ఇలా మోసపోయిన డబ్బును తిరిగి రాబట్టడం అనేది ఇప్పటి వరకు అందరి విషయంలో దాదాపు సాధ్యమయ్యేది కాదు..
అయితే ఇలాంటి బాధితులకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) తీపికబురు అందించింది. బాధితులు తమ డబ్బును మరింత సులభంగా తిరిగి పొందేందుకు మనీ రిస్టోరేషన్ మాడ్యూల్, అంటే MRM అనే కొత్త విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ విషయాన్ని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ ఐపీఎస్ అధికారి శిఖా గోయెల్ వెల్లడించారు.
కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నుంచి రీఫండ్‌కు సంబంధించిన ఎస్ఎంఎస్ లేదా నోటిఫికేషన్ అందుకున్న వారు ఇప్పుడు నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌లోకి వెళ్లి MRM మాడ్యూల్ ద్వారా రీఫండ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేశారు. అయితే చట్ట సంస్థలతో పాటు బ్యాంకులు సంయుక్తంగా సర్టిఫై చేసిన తర్వాత అర్హులైన బాధితుల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు జను కానున్నాయి.
ముందుగా సైబర్ నేర బాధితులు తమ ఫిర్యాదులో పేర్కొన్న మొబైల్ నంబర్ ఆధారంగా ఎంఆర్‌ఎం పోర్టల్‌లో లాగిన్ అయ్యి.. 14 అంకెల నంబర్‌తో ఫిర్యాదు వివరాలను ధ్రువీకరించాలి. తర్వాత సంబంధిత బ్యాంకు ఖాతాలను ఎంపిక చేసి, అవసరమైన పత్రాలు అప్‌లోడ్ చేసిన అనంతరం.. రిఫండ్ జమ చేయాల్సిన బ్యాంకు ఖాతా వివరాలు నమోదు చేసి దరఖాస్తు సమర్పించాలి.
అనంతరం ఎంఆర్‌తో ప్రత్యేక ట్రాకింగ్ నంబర్ వస్తుంది. బాధితులు ఆ నంబర్ ద్వారా తమ దరఖాస్తు పురోగతిని ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లోనే తెలుసుకోవచ్చు. కాగా ఈ సేవలు పూర్తిగా ఉచితంగా పొందవచ్చు.. అయితే మోసానికి గురయ్యామని తెలుసుకున్న వెంటనే బాధితులు.. ఫిర్యాదు చేయాలని పోలీసులు తెలిపారు.
కాగా, సైబర్ మోసాలకు గురైన బాధితులకు అవసరమైన సాయం అందించేందుకు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ గచ్చిబౌలిలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశామని సైబర్ క్రైమ్ పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. ఎంఆర్‌ఎంతో పాటు బ్యాంకు అకౌంట్‌లు ఫ్రీజ్ అయిన వాటిని ఆన్ ఫ్రీజ్ చేసేందుకు గ్రీవెన్స్ రీడ్రెస్సల్ పోర్టల్‌ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు.
సైబర్ మోసాలకు గురైన వారు ఆలస్యం చేయకుండా ఎస్ఎంఎస్ లేదా నోటిఫికేషన్ వచ్చిన వెంటనే ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. సరైన ప్రక్రియను అనుసరిస్తే పోగొట్టుకున్న డబ్బును తిరిగి పొందే అవకాశం ప్రస్తుతం మరింత సులభంగా మారిందని పేర్కొన్నారు..












