వైరల్ న్యూస్

రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పిన ఐఆర్‌సీటీసీ!..

రచన: Venu4 నిమిషాల పఠనం

భారతీయ రైల్వే ప్రయాణికులకు.. ఐఆర్‌సీటీసీ శుభవార్త చెప్పింది. ఇందులో భాగంగా రైల్వే టికెట్‌ బుకింగ్‌ కోసం కొత్త వెబ్‌సైట్‌ ను లాంచ్‌ చేసింది.

భారతీయ రైల్వే ప్రయాణికులకు.. ఐఆర్‌సీటీసీ శుభవార్త చెప్పింది. వారికి మెరుగైన, వేగవంతమైన డిజిటల్‌ సర్వీసులు అందించేందు చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా రైల్వే టికెట్‌ బుకింగ్‌ కోసం కొత్త వెబ్‌సైట్‌ https://www.irctc.co.in/eticket/train-searchను లాంచ్‌ చేసింది.

ఈ మేరకు బుధవారం రాత్రి బీటా వెర్షన్‌ను అందుబాటులోకి తీసుకు రావడమే కాకుండా.. ప్రయాణికులకు కొత్త డిజైన్‌, మెరుగైన ఫీచర్లు అందించడంతో పాటు టికెట్‌ బుకింగ్‌ సామర్థ్యం పెంచింది. తత్కాల్‌ టికెట్ల బుకింగ్‌లో ఎదురయ్యే ఇబ్బందులకు చెక్‌ పెట్టేలా క్యాప్చా కోడ్‌, పాపప్స్‌ను కూడా తొలగించింది.

అదేవిధంగా ఈ వెబ్‌సైట్‌ను ఉపయోగించి తమ అభిప్రాయాలను తెలియజేయాలని ఐఆర్‌సీటీసీ కోరుతోంది. ఇక ఈ బీటా వెర్షన్‌ను ఐఆర్‌సీటీసీ ఈ-టికెటింగ్ పోర్టల్ ద్వారా యాక్సెస్ చేయవచ్చు. అలాగే ప్రస్తుతం ఉన్న ఐఆర్‌సీటీసీ హోమ్‌పేజీలో కూడా బీటా వెర్షన్‌కు ప్రత్యేక లింక్ అందుబాటులో ఉంది.

కొత్త వెబ్‌సైట్ రూపకల్పనలో మాలవీయ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఎంఎన్‌ఐటీ విద్యార్థులు కూడా భాగస్వాములయ్యారు. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌తో జరిగిన సమావేశంలో వారు ఇచ్చిన సూచనలను పరిగణనలోకి తీసుకుని ఈ వెబ్‌సైట్‌ను మరింత మెరుగుపరిచారు.

ఇందులో భాగంగా కొత్త బీటా వెర్షన్‌లో నాలుగు కీలక మార్పులు చేశారు. అందులో మొదటిది... సులభమైన క్యాప్చా విధానం. ఇకపై చికాకు కలిగించే క్యాప్చాలు, అనవసర పాప్‌అప్స్ ఉండవు. రెండోది.. అన్ని క్లాసులకు సంబంధించిన సీట్ల వివరాలు ఒకే స్క్రీన్‌లో స్పష్టంగా కనిపించేలా రూపొందించారు.

మూడోది... టికెట్ బుకింగ్‌లో ఉండే దశల సంఖ్యను తగ్గించడం వల్ల చెల్లింపు, బుకింగ్ ప్రక్రియ మరింత వేగంగా పూర్తవుతుంది. నాలుగోది.. ఒకసారి ప్రయాణికుల వివరాలు సేవ్ చేస్తే, మళ్లీ మళ్లీ టైప్ చేయాల్సిన అవసరం లేకుండా త్వరగా టికెట్ బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది.

మరోవైపు ఈ వెబ్‌సైట్‌ను కొత్త ప్యాసింజర్ రిజర్వేషన్ ఇంజిన్‌తో త్వరలోనే అనుసంధానం చేయనున్నారు. ప్రస్తుతం దశాబ్దాలుగా ఉపయోగిస్తున్న రిజర్వేషన్ వ్యవస్థను కూడా ఆధునీకరిస్తున్నారు. ఈ ప్రక్రియలో బుకింగ్ సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా పనులు కొనసాగుతున్నాయని అధికారులు పేర్కొన్నారు.

ఇక 2002లో ప్రారంభమైన ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ ద్వారా ప్రతిరోజూ సగటున 14 లక్షల 50 వేల టికెట్లు బుక్ అవుతున్నాయి. మొత్తం రైల్వే టికెట్ బుకింగ్‌లలో దాదాపు 88 శాతం ఆన్‌లైన్ ద్వారానే జరుగుతున్నాయి. అందుకే కొత్త పోర్టల్‌లో.. క్లీన్ యూజర్ ఇంటర్‌ఫేస్, మెరుగైన యూజర్ ఎక్స్‌పీరియెన్స్‌కు ప్రాధాన్యం ఇచ్చారు. దీంతో భవిష్యత్తులో టికెట్ బుకింగ్ మరింత వేగంగా, సులభంగా మారనుంది.

#india#beta-version#irctc-website#Captcha Code#CRIS
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి