పశ్చిమబెంగాల్ లో పరిస్థితులు మరోసారి ఉద్రిక్తంగా మారాయి. మాజీ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ప్రయాణిస్తున్న కాన్వాయ్‌పై దాడి జరిగింది. పోలీసు కస్టడీలో మృతి చెందిన కార్యకర్త బిర్జు కోయెట్ కుటుంబాన్ని పరామర్శించేందుకు నేడు మమతా బెనర్జీ వెళ్తుండగా.. మార్గమధ్యంలో కొందరు నిరసనకారులు ఆమె కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నించారు.
మమతను లక్ష్యంగా చేసుకుని నినాదాలు చేస్తూ రాళ్లు, ఇటుకలు విసిరారు. బురద చల్లడంతో పాటు బాటిళ్లు, చెప్పులు కూడా కాన్వాయ్ వైపు విసిరినట్లు సమాచారం. అయితే కారు అద్దాలు మూసి ఉండకపోతే తన తలకు తీవ్ర గాయమయ్యేదని, ప్రాణాలు కూడా పోయే పరిస్థితి ఉండేదని మమతా మండిపడ్డారు.. తన రాజకీయ జీవితంలో ఇంతటి దాడిని ఎప్పుడూ చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
పోలీసుల సమక్షంలోనే సంఘవిద్రోహ శక్తులు దాడికి పాల్పడ్డాయని మమత ఆరోపించారు. నిరసనకారులను అదుపు చేయడంలో పోలీసులు విఫలమయ్యారని, బీజేపీ నేతలు, కార్యకర్తలకు రక్షణ కల్పించడంలో చూపుతున్న శ్రద్ధను ప్రతిపక్ష నేతల విషయంలో చూపడం లేదని విమర్శించారు. కాగా ఈ ఘటన సమయంలో మమతతో పాటు ఎంపీలు కళ్యాణ్ బెనర్జీ, దోలా సేన్ కూడా ఉన్నారు.
మరోవైపు మమతా బెనర్జీపై జరిగిన దాడిని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సమిక్ భట్టాచార్య ఖండించారు. హింసను తమ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించదని స్పష్టం చేశారు. ఈ ఘటనతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని చెబుతూ.. దాడికి పాల్పడిన వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇటీవలే మమత మేనల్లుడు, ఎంపీ అభిషేక్ బెనర్జీపై కూడా ఆయన సొంత నియోజకవర్గంలో దాడి జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు ఏకంగా మాజీ సీఎం మమతా బెనర్జీ కాన్వాయ్‌పైనే దాడి జరగడంతో బెంగాల్ రాజకీయాల్లో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.
ఈ ఘటనపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక అధికారం కోల్పోయిన తర్వాత కూడా బెంగాల్‌లో మమత వర్సెస్ బీజేపీ పోరు మాత్రం కొనసాగుతూ ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి..












