హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం, జేఎన్‌టీయూహెచ్‌లో సంచలన పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఆర్థిక విభాగానికి చెందిన అధికారి సురేందర్ దాదాపు 20 రోజులుగా విధులకు హాజరుకాకపోవడం, అదే సమయంలో కీలక ఫైళ్లు కనిపించకుండా పోవడంతో వర్సిటీ అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ వ్యవహారంపై అంతర్గత విచారణకు ఆదేశించారు.
అధికారి సురేందర్ మొబైల్ ఫోన్ స్విచ్డ్ ఆఫ్‌లో ఉండటంతో ఆయన ఆచూకీపై అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, భద్రతా సిబ్బంది సమాచారం ప్రకారం.. రెండు రోజుల క్రితం సురేందర్ కార్యాలయానికి వచ్చి కొన్ని ముఖ్యమైన ఫైళ్లను తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో ఆర్థిక విభాగం కార్యాలయాన్ని అధికారులు సీల్ చేశారు. ఈ నేపథ్యంలో జేఎన్‌టీయూహెచ్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ టి. కిషన్ కుమార్ రెడ్డి.. వివిధ విభాగాల డైరెక్టర్లతో అత్యవసర సమావేశం నిర్వహించారు.
ప్రస్తుతం ఆర్థిక విభాగం బాధ్యతలను తాత్కాలికంగా రిజిస్ట్రార్ ఏ. జయలక్ష్మికి అప్పగించారు. మరోవైపు 2023–24 ఆర్థిక సంవత్సరంలో పరీక్షల నిర్వహణ, యంత్రాల కొనుగోలు, మూల్యాంకన పారితోషికాలు తదితర అంశాలకు పరీక్షల విభాగం రూ.37.62 కోట్లు ఖర్చు చేసినట్లు ఆడిట్‌లో గుర్తించారు. అయితే, ఇందులో సుమారు రూ.30 కోట్లకు సంబంధించిన రసీదులు మాత్రమే అందుబాటులో ఉండటంతో మిగిలిన మొత్తంపై ఆడిట్ అభ్యంతరాలు నమోదయ్యాయి.
అదేవిధంగా.. రెండేళ్ల క్రితం 11 మంది సిబ్బందికి, పరీక్షల అధికారితో సహా, సుమారు రూ.10.11 లక్షలు అదనంగా పారితోషికంగా చెల్లించినట్లు కూడా గుర్తించినట్లు సమాచారం. రెండేళ్ల క్రితం జరిగిన కన్వొకేషన్ కార్యక్రమానికి సంబంధించిన ఖర్చుల లెక్కల్లోనూ తేడాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కాగా జేఎన్‌టీయూహెచ్ లో మూడేళ్ల క్రితం నుంచే ఆర్థిక అక్రమాలు జరిగి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ క్రమంలో పరీక్షల విభాగానికి చెందిన మాజీ సీనియర్ అధికారి పాత్రపై అధికారులు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇక ఈ అవకతవకాల పై వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ టి. కిషన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. తొలుత సురేందర్ వ్యక్తిగత కారణాలతో విధులకు హాజరుకావడం లేదని భావించినట్టు తెలిపారు. అయితే కీలక ఫైళ్లు కనిపించకపోవడంతో సమగ్ర విచారణకు ఆదేశించినట్లు పేర్కొన్నారు.
స్టేషన్ ఘన్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో ఆయనపై కేసు నమోదైనట్లు వెల్లడించారు. అక్రమాలు నిర్ధారణ అయితే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రస్తుతం జేఎన్‌టీయూహెచ్‌లో అంతర్గత విచారణ కొనసాగుతోంది. ఆడిట్ అభ్యంతరాలు, మాయమైన ఫైళ్లు, ఆర్థిక లావాదేవీలపై దర్యాప్తులో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.












