మహారాష్ట్ర నుంచి గుజరాత్ వరకు వరుసగా సంభవించిన భూ ప్రకంపనలు ప్రజల్లో భయాందోళనలు రేపాయి. శనివారం రాత్రి నాసిక్ నుంచి సూరత్ వరకు పలు ప్రాంతాల్లో భూమి కంపించడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
జాతీయ భూకంప కేంద్రం, ఎన్‌సీఎస్ ప్రకారం.. శనివారం రాత్రి సుమారు 10 గంటల సమయంలో 4.3 తీవ్రతతో భూకంపం నమోదైంది. దీని భూకంప కేంద్రాన్ని మహారాష్ట్ర-గుజరాత్ సరిహద్దుకు సమీపంలోని హత్గడ్ పర్వత శ్రేణుల వద్ద భాన్‌వాడ్ ప్రాంతంలో గుర్తించారు. భూమికి సుమారు 5 కిలోమీటర్ల లోతులో ఈ కేంద్రం ఉన్నట్లు అధికారులు తెలిపారు.
నాసిక్ నగరంతో పాటు సుర్గాణ, కల్వాన్, దేవళ, చాంద్వాడ్, పేఠ్, దిండోరి, నిఫాడ్ ప్రాంతాల్లో ప్రకంపనలు తీవ్రంగా కనిపించాయి. గుజరాత్‌లోని సూరత్, డాంగ్ జిల్లాల్లోనూ భూమి కంపించింది. అహ్వా, సక్రపతాల్, గల్కుండ్, సపుతారా ప్రాంతాల్లో ప్రకంపనలు రావడంతో.. సపుతారాలోని హోటళ్లలో ఉన్న పర్యాటకులు భయంతో బయటకు వచ్చారు.
మరోవైపు ఆదివారం ఉదయం 5 గంటల 33 నిమిషాలకు మరోసారి 3.3 తీవ్రతతో భూమి కంపించింది. దీంతో స్థానికుల్లో మరింత ఆందోళన నెలకొంది. కొన్ని ప్రాంతాల్లో భవనాల గోడలకు స్వల్ప పగుళ్లు ఏర్పడినట్లు సమాచారం. అయితే ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు. జిల్లాలోని ఆనకట్టలను కూడా పరిశీలించిన అధికారులు.. ఎలాంటి నష్టం జరగలేదని గుర్తించారు.
ఇటీవల ఈ ప్రాంతంలో వరుసగా స్వల్ప తీవ్రతతో ప్రకంపనలు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. భారీ వర్షాల కారణంగా భూగర్భంలోని శిలల పగుళ్లలోకి నీరు చేరడం వల్ల ఒత్తిడి పెరిగి ప్రకంపనలు సంభవించి ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఈ క్రమంలో ప్రజలు ఆందోళన చెందవద్దని, వదంతులను నమ్మవద్దని నాసిక్ జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. అయితే భూకంపం సంభవించినప్పుడు అప్రమత్తంగా ఉండి, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు.












