హైదరాబాద్ మహానగరంలో బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. లష్కర్, లాల్ దర్వాజ, ఉజ్జయిని, బల్కంపేట బోనాలు ముగియడంతో నేడు నగరంలోని గల్లీగల్లీలో బోనాలను ఎంతో వైభవంగా ప్రజలు జరుపుకుంటున్నారు.నిన్న సాయంత్రం నుంచే గల్లీల్లోని అమ్మవారి ఆలయాలను ముస్తాబు చేశారు.ఇక ఎక్కడ చూసినా బోనాల ఫ్లెక్సీలు నగరం నలుమూలలా దర్శనమిస్తున్నాయి. పొలిటికల్ లీడర్లు సైతం తమకు దగ్గరగా ఉండే ఆలయాలకు వెళ్లి అమ్మవార్లకు బోనాలు సమర్పించుకుంటున్నారు.
అయితే బోనాల ప్రభావం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంపై భారీగా పడినట్టు తెలుస్తోంది. యాదగిరి గుట్టలో భక్తుల రద్దీ తగ్గినట్టు సమాచారం. హైదరాబాద్‌లో బోనాల ఉత్సవాలు జరుగుతుండటం వల్లే భక్తులు తగ్గారని ఆలయ అధికారులు పేర్కొంటున్నారు.దీంతో స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులకు నేరుగా దర్శనం కల్పిస్తున్నారు.
ఎలాంటి క్యూ లైన్లు లేకపోవడం, గంటల తరబడి వేచి చూసే పరిస్థితి లేకపోవడంతో భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నేడు ఏకాదశి కావడంతో సాధారణంగా వైష్ణవ ఆలయాల్లో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. ఇలాంటి రోజుల వైష్ణవ ఆలయాలకు భక్తులు పోటెత్తారు. కానీ, ఏకాదశి రోజున యాదాద్రి ఆలయంలో భక్తులు లేకపోవడంతో ఆలయ పండితులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు.నగరంలో జరిగే బోనాల పండగ వల్లే భక్తులు తగ్గారని చెబుతున్నారు.
నగరంలో బోనాల పండుగకు ఎంత ప్రాధాన్యత, విశిష్టత ఉంటుందో ఈ ఘటన ద్వారా తేటతెల్లం అయ్యిందని మరికొందరు తమ అభిప్రాయం వెల్లడించారు. యాదాద్రిలో రద్దీ లేకపోవడంతో స్వామి వారి దర్శనం ఫ్రీగా జరుగుతోందని భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.












