ఆదివారం వచ్చిందంటే చాలు మాంసాహార ప్రియులు చికెన్ షాపుల ముందు క్యూ కడుతుంటారు. గత కొన్ని వారాలుగా ఆకాశాన్నంటిన చికెన్ ధరలు ప్రస్తుతం గణనీయంగా దిగిరావడంతో తెలుగు రాష్ట్రాల్లోని చికెన్ లవర్స్‌కు భారీ ఊరట లభించింది. ముఖ్యంగా హైదరాబాద్, విజయవాడ నగరాల్లో కిలో చికెన్ ధరలు సామాన్యుడికి అందుబాటులోకి రావడంతో రిటైల్ మార్కెట్లలో కొనుగోళ్లు ఒక్కసారిగా పుంజుకున్నాయి.
హైదరాబాద్ మహానగరంలో కొన్ని రోజుల క్రితం వరకు రూ.280 నుంచి రూ.300 వరకు విక్రయించిన స్కిన్‌లెస్ చికెన్ ధర ప్రస్తుతం గణనీయంగా పడిపోయింది. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్‌లో లైవ్ బర్డ్ ధర రూ.120 నుంచి రూ.140 వరకు పలకగా, రిటైల్ షాపుల్లో విత్ స్కిన్ చికెన్ కిలో రూ.180 నుంచి రూ.200రేంజ్‌లో విక్రయిస్తున్నారు. అలాగే స్కిన్‌లెస్ చికెన్ కిలో రూ.220 నుంచి రూ.240 వద్ద కొనసాగుతోంది.
ఇటు ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతమైన విజయవాడలోనూ చికెన్ ధరల్లో భారీ తగ్గుదల కనిపిస్తోంది. విజయవాడ మార్కెట్‌లో స్కిన్‌లెస్ చికెన్ ధర కిలో రూ.210నుంచి రూ.230 మధ్య విక్రయమవుతుండగా, విత్ స్కిన్ ధర రూ.170నుంచి రూ.190 మధ్య నమోదైంది. పొరుగున ఉన్న ఫారమ్‌ల నుంచి కోళ్ల సరఫరా పెరగడం, ఉత్పాదక వ్యయం తగ్గడంతో విజయవాడ వ్యాపారులు రిటైల్ ధరలను తగ్గించి విక్రయిస్తున్నారు.
వర్షాకాలంలో ఉష్ణోగ్రతలు తగ్గి కోళ్ల పెంపకం మెరుగుపడటంతో పాటు పౌల్ట్రీ ఫారమ్‌ల నుంచి మార్కెట్‌కు సరఫరా పెరగడమే ఈ ధరల తగ్గుదలకు ప్రధాన కారణమని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. గతంలో ఎండల తీవ్రత వల్ల కోళ్ల దిగుబడి తగ్గి ధరలు విపరీతంగా పెరిగినప్పటికీ, ప్రస్తుతం సరఫరా సాధారణ స్థితికి చేరుకోవడంతో రాబోయే రోజుల్లో కూడా ధరలు స్థిరంగా ఉండే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
బోనాల పండుగ వేళ నాటుకోళ్లకు డిమాండ్..
బోనాల ఉత్సవాల సందడితో హైదరాబాద్ వ్యాప్తంగా ఆధ్యాత్మిక శోభ సంతరించుకోగా, పండుగ వేళ నాటు కోళ్లకు డిమాండ్ ఒక్కసారిగా ఆకాశాన్నంటింది. అమ్మవారికి నైవేద్యాలు సమర్పించిన అనంతరం విందు భోజనాల కోసం భక్తులు నాటు కోళ్ల కొనుగోలుకు అమితాసక్తి చూపుతుండటంతో కాళీమందిర్, నార్సింగి, బుద్వేల్ వంటి శివారు ప్రాంతాలలో వ్యాపారులు రోడ్ల పక్కనే ప్రత్యేక స్టాళ్లను ఏర్పాటు చేసి విక్రయాలు సాగిస్తున్నారు. సాధారణ రోజులతో పోలిస్తే గిరాకీ విపరీతంగా పెరగడంతో కిలో నాటు కోడి ధర ఏకంగా రూ. 400 నుండి రూ. 450 వరకు పలుకుతున్నప్పటికీ, పండుగ ఉత్సాహంలో కొనుగోలుదారులు వెనకడుగు వేయకుండా కొనుగోళ్లు జరుపుతుండటంతో నగరంలో నాటు కోళ్ల మార్కెట్ ఊహించని స్థాయిలో జోరందుకుంది.












