తెలంగాణ

హైదరాబాద్‌లో ‘సర్’ ఎఫెక్ట్.. ఏకంగా 40 లక్షల ఓట్లు గల్లంతు?

రచన: Mamatha puppala5 నిమిషాల పఠనం

రాజధాని హైదరాబాద్‌ నగరం పరిధిలో ఓటర్ల సంఖ్యలో భారీ మార్పులు చోటుచేసుకోనున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సర్వే (SIR) ముగింపు దశకు చేరుకోవడంతో గ్రేటర్ పరిధిలో దాదాపు 40 లక్షల ఓట్లు జాబితా నుంచి తొలగిపోయే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు.

రాజధాని హైదరాబాద్‌ నగరం పరిధిలో ఓటర్ల సంఖ్యలో భారీ మార్పులు చోటుచేసుకోనున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సర్వే (SIR) ముగింపు దశకు చేరుకోవడంతో గ్రేటర్ పరిధిలో దాదాపు 40 లక్షల ఓట్లు జాబితా నుంచి తొలగిపోయే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. రాజధాని పరిధిలోని మూడు జిల్లాల పరిధిలో గల 28 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 1.14 కోట్ల మంది ఓటర్లు ఉండగా, అందులో సగానికి దగ్గరగా ఉన్న ఓట్లు చెల్లుబాటు కాకుండాపోయే సూచనలు కనిపిస్తుండటం రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.

క్షేత్రస్థాయిలో బూత్ స్థాయి అధికారులు (బీఎల్ఓలు) నిర్వహించిన ఇంటింటి సర్వే డేటాను విశ్లేషించి, ఆగస్టు 17న ముసాయిదా ఓటరు జాబితాను విడుదల చేసేందుకు జీహెచ్‌ఎంసీ యంత్రాంగం వేగంగా ఏర్పాట్లు చేస్తోంది. ప్రభుత్వ సెలవు దినాలు ఉన్నప్పటికీ బీఎల్ఓల నుంచి ఉన్నతాధికారుల వరకు అందరూ విధుల్లోనే ఉంటారని జీహెచ్‌ఎంసీ కమిషనర్ స్పష్టం చేశారు. ఇప్పటివరకు ఎన్యుమరేషన్ ఫారాలను సమర్పించని అర్హులైన ఓటర్లు తక్షణమే అధికారులకు అందజేయాలని లేదా ఆన్‌లైన్ విధానం ద్వారా నమోదు చేసుకోవాలని సూచించారు.

సనత్‌నగర్‌లో గరిష్ఠంగా 45.68% ఓట్లు తొలగింపు..

ఈ ఓట్ల తొలగింపు ప్రభావం ప్రధాన నగరంతో పాటు నగర శివారు నియోజకవర్గాల్లోనూ స్పష్టంగా కనిపించనుంది. ముఖ్యంగా సనత్‌నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 2.54 లక్షల ఓట్లకు గాను ఏకంగా 1.16 లక్షల ఓట్లు (45.68%) రద్దయ్యే అవకాశం ఉంది. అలాగే జూబ్లీహిల్స్‌లో 44.21%, ఎల్బీనగర్‌లో 42.19%, ఉప్పల్‌లో 40.05%, మహేశ్వరంలో 40.03% ఓట్లు జాబితా నుంచి తొలగిపోయే జాబితాలో ఉన్నాయి. అత్యల్పంగా ఇబ్రహీంపట్నంలో 21.43%, బహదూర్‌పురలో 22.38% ఓట్లు మాత్రమే రద్దు కానున్నాయి.

సొంతూళ్లలోనే ఓటు హక్కుకు మొగ్గు..

ఈ స్థాయిలో ఓట్ల సంఖ్య తగ్గడానికి ప్రధానంగా వలస విధానాలే కారణమని తెలుస్తోంది. ఉపాధి, వ్యాపార రీత్యా నగరానికి వచ్చి స్థిరపడిన చాలామందికి సొంత ఊళ్లతో పాటు హైదరాబాద్‌లోనూ ఓటు హక్కు ఉంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సర్వే జరుగుతుండటంతో రెండు చోట్లా ఓటు ఉన్నవారు తమ సొంత గ్రామాలు లేదా పట్టణాల్లోనే ఓటును కొనసాగించేందుకు ప్రాధాన్యం ఇస్తూ, ఇక్కడ ఎన్యుమరేషన్ ఫారాలను తిరస్కరించడం లేదా సమర్పించకపోవడం వల్ల ఈ భారీ కోత పడుతోంది.

ఆగస్టు 17న ముసాయిదా జాబితా విడుదల

మరోవైపు సర్వే ఫారాలు అందలేదని ఫిర్యాదు చేస్తున్న ఓటర్ల కోసం ఆన్‌లైన్ దరఖాస్తు అవకాశాన్ని అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు. ముసాయిదా జాబితా ప్రచురణ అనంతరం అభ్యంతరాలు, చేర్పులు, మార్పులకు ఎన్నికల సంఘం గడువు ఇవ్వనుంది. ఆగస్టు 17న వెలువడనున్న తాత్కాలిక జాబితాతో నగర రాజకీయ స్వరూపంపై స్పష్టత రానుంది.

 

#HyderabadVoters#ElectionCommission#GHMCVoterList#SIRSurvey#TelanganaPolitics#HyderabadNews#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి