తెలంగాణ

కృష్ణా బేసిన్‌లో తగ్గిన వరద ఉధృతి.. మూతపడిన జూరాల గేట్లు!

రచన: Mamatha puppala5 నిమిషాల పఠనం

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ప్రాజెక్టులకు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద ఉధృతి గణనీయంగా తగ్గింది. కర్ణాటక పరివాహక ప్రాంతాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల నిలిచిపోయింది. దీంతో దిగువన ఉన్న జూరాల ప్రాజెక్టు గేట్లను అధికారులు పూర్తిగా మూసివేశారు. కృష్ణా బేసిన్‌లో ప్రవాహం తగ్గడంతో శ్రీశైలం జలాశయానికి వరద నీటి ఇన్ ఫ్లో ఒక్కసారిగా పడిపోయింది.

  • ప్రాజెక్టుల్లో క్రమంగా తగ్గుతున్న ప్రవాహం!

  • శ్రీశైలానికి పడిపోయిన ఇన్ ఫ్లో!

  • ఆగిన అల్మట్టి నీటి విడుదల..

  • సాగర్ ఆయకట్టు రైతుల్లో ఆందోళన

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ప్రాజెక్టులకు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద ఉధృతి గణనీయంగా తగ్గింది. కర్ణాటక పరివాహక ప్రాంతాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల నిలిచిపోయింది. దీంతో దిగువన ఉన్న జూరాల ప్రాజెక్టు గేట్లను అధికారులు పూర్తిగా మూసివేశారు. కృష్ణా బేసిన్‌లో ప్రవాహం తగ్గడంతో శ్రీశైలం జలాశయానికి వరద నీటి ఇన్ ఫ్లో ఒక్కసారిగా పడిపోయింది.

శ్రీశైలం ప్రాజెక్టుకు కొన్ని రోజుల క్రితం వరకు సుమారు రెండున్నర లక్షల క్యూసెక్కులుగా ఉన్న ఇన్ ఫ్లో ప్రస్తుతం 36,233 క్యూసెక్కులకు పడిపోయింది. ప్రాజెక్టు అవుట్‌ఫ్లో 38,369 క్యూసెక్కులుగా నమోదైంది. శ్రీశైలం పూర్తి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 878.10 అడుగుల వద్ద నీరు నిల్వ ఉంది. అలాగే పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలకు గాను ప్రస్తుతం 178.74 టీఎంసీల నీరు ఉంది. జలాశయంలో ఉన్న నీటితో కుడి, ఎడమ గట్టు జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తిని కొనసాగిస్తున్నారు.

గోదావరి పరివాహక ప్రాంతంలోని మిడ్ మానేరు ప్రాజెక్టుకు 13,511 క్యూసెక్కుల సగటు ఇన్ ఫ్లో నమోదుకాగా, 4,877 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం మిడ్ మానేరులో 20.892 టీఎంసీల నీరు అందుబాటులో ఉంది. నీటి ఉధృతికి అనుగుణంగా అధికారులు 4 స్పిల్‌వే గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. అలాగే అప్పర్ మానేరు ప్రాజెక్టుకు 1,507 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండటంతో ప్రాజెక్టు నీటి నిల్వ 1.95 టీఎంసీలకు చేరి దాదాపు పూర్తి స్థాయి సామర్థ్యానికి (2.00 TMC) చేరువైంది.

నాగార్జునసాగర్ ఆయకట్టు రైతుల్లో ఆందోళన

కృష్ణమ్మ ప్రవాహం తగ్గడంతో నాగార్జునసాగర్ ఆయకట్టు రైతుల్లో ఆందోళన మొదలైంది. ఇన్ ఫ్లో తగ్గడంతో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌కు సాగర్ ఆయకట్టుకు నీటి విడుదల బంద్ అయ్యే పరిస్థితులు కనిపిస్తుండటంతో వ్యవసాయదారులు దిగులు చెందుతున్నారు. గోదావరి బేసిన్‌లోని శ్రీరాంసాగర్ (SRSP) ప్రాజెక్టుకు 17,127 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1091 అడుగులు (80.5 టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 1078.70 అడుగుల వద్ద 41.698 టీఎంసీల నీటి నిల్వ ఉంది.

మరోవైపు, సిరిసిల్ల పరిధిలోని అన్నపూర్ణ రిజర్వాయర్‌లో ప్రస్తుతం 1.510 టీఎంసీల నీటి నిల్వ ఉండగా, ఇన్ ఫ్లో కేవలం 22 క్యూసెక్కులుగా ఉంది. దీంతో అన్నపూర్ణ పంప్ హౌస్‌లో పంపింగ్ ప్రక్రియను పూర్తిగా నిలిపివేశారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ప్రాజెక్టుల్లో నీటిమట్టాలను, ఎగువ నుంచి వచ్చే ప్రవాహాలను జలవనరుల శాఖ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

 

#KrishnaBasin#SrisailamDam#WaterLevels#TelanganaProjects#SRSP#MidManair#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి