నీట్ పేపర్ లీక్ వివాదం, విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసిన బీజేపీ సీనియర్ నేత, సంబల్‌పూర్ ఎంపీ ధర్మేంద్ర ప్రధాన్ ఆ అంశంపై తొలిసారి నోరు విప్పారు. జూలై 25న రాజీనామా సమర్పించిన సరిగ్గా రెండు వారాల తర్వాత ఒడిశాలోని భువనేశ్వర్ జీఎం యూనివర్సిటీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దేశంలోని నవతరం విద్యార్థులను (జెన్-జీ) కొంతమంది తమ రాజకీయ ప్రయోజనాల కోసం తప్పుదోవ పట్టించారని, ఈ క్రమంలో వారి ఆకాంక్షలను కాపాడటానికే తాను మంత్రి పదవిని వదులుకున్నానని వెల్లడించారు.
తమ ప్రభుత్వానికి పదవుల కంటే యువత భవిష్యత్తే ముఖ్యమని స్పష్టం చేసిన ధర్మేంద్ర ప్రధాన్, ఈ విషయమై స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీని కలిసి తన రాజీనామా ప్రతిపాదనను ముందే ఉంచానని తెలిపారు. దేశంలో ఏటా రెండు కోట్ల మంది పిల్లలు పడుతున్నారని, గత పదేళ్లలో రూపుదిద్దుకున్న 20కోట్ల మంది యువత ఆశయాలే రాబోయే రోజుల్లో భారత్‌ను 'విశ్వగురువు'గా నిలబెడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. వ్యక్తిగత గౌరవం లేదా అధికార హోదా కంటే విద్యార్థుల ఆవేదనను గుర్తించడమే తమకు ప్రాధాన్యమని ఆయన చెప్పుకొచ్చారు.
మరోవైపు ఒడిశా పర్యటన సందర్భంలో బిజూ జనతా దళ్ (బీజేడీ) కార్యకర్తలు తనపై చేపట్టిన నిరసనలపై ప్రధాన్ ఘాటుగా స్పందించారు. భువనేశ్వర్ విమానాశ్రయం వద్ద 'ధర్మేంద్ర ప్రధాన్ గో బ్యాక్' అంటూ నినాదాలు చేయడం వెనుక మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కుట్ర ఉందంటూ ధ్వజమెత్తారు. తా నొక రైతు బిడ్డనని, ఎన్నిసార్లు వెనక్కి పంపినా మళ్లీ ప్రజల కోసమే తిరిగి వస్తానని వ్యాఖ్యానించారు. ఒడిశా రాష్ట్ర ప్రతిష్ఠను గానీ, ప్రజల ఆత్మగౌరవాన్ని గానీ దెబ్బతీసే ఎలాంటి పనిని తాను ఎప్పటికీ చేయనని సభాముఖంగా స్పష్టం చేశారు.
అయితే ధర్మేంద్ర ప్రధాన్ విమర్శలను బీజేడీ సంబల్‌పూర్ జిల్లా అధ్యక్షుడు రోహిత్ పూజారి తీవ్రంగా ఖండించారు. జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై లాఠీఛార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగించడం ద్వారా కేంద్ర ప్రభుత్వమే ఆయన పరువు తీసిందని ఎద్దేవా చేశారు. పోలీసుల చర్యలకు నవీన్ పట్నాయక్‌ను నిందించడం సరికాదని ఆయన వ్యాఖ్యానించారు. కాగా ప్రధాన్ పర్యటన సందర్భంగా ఎలాంటి ఘర్షణలు జరగకుండా భద్రతా చర్యల్లో భాగంగా సుమారు 30 మంది బీజేడీ కార్యకర్తలను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు.












