International

India: భారత్‌పై పశ్చిమాసియా సెగ.. భారీగా పెరిగిన చమురు బిల్లు!..

రచన: Venu4 నిమిషాల పఠనం

గత ఏడాది ఏప్రిల్‌-జూన్‌ మధ్య 73 మిలియన్‌ టన్నుల ముడి చమురును భారత్‌ దిగుమతి చేసుకోగా.. ఈసారి 59.7 మిలియన్‌ టన్నులకు పరిమితమైంది. అయినప్పటికీ దిగుమతి బిల్లు పెరగడానికి ప్రధాన కారణం అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు భారీగా పెరగడమే అని నిపుణులు అంటున్నారు.

పశ్చిమాసియాలో చెలరేగిన ఘర్షణలు భారత్‌కు ఆర్థిక భారాన్ని మోపుతున్నాయి. ముఖ్యంగా ముడి చమురు ధరలు పెరగడంతో దేశం చెల్లిస్తున్న దిగుమతి బిల్లు భారీగా పెరిగింది. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి జూన్‌ మధ్య తొలి త్రైమాసికంలో భారత్‌ ముడి చమురు దిగుమతుల కోసం ఏకంగా 49 బిలియన్‌ డాలర్లు.. అంటే దాదాపు 4 లక్షల 11 వేల 600 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఈ మొత్తం ఏకంగా 26 శాతం పెరిగింది.

మరోవైపు చమురు దిగుమతి 18 శాతం పైగా తగ్గింది. గత ఏడాది ఏప్రిల్‌-జూన్‌ మధ్య 73 మిలియన్‌ టన్నుల ముడి చమురును భారత్‌ దిగుమతి చేసుకోగా.. ఈసారి 59.7 మిలియన్‌ టన్నులకు పరిమితమైంది. అయినప్పటికీ దిగుమతి బిల్లు పెరగడానికి ప్రధాన కారణం అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు భారీగా పెరగడమే అని నిపుణులు అంటున్నారు.

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరగడంతో అంతర్జాతీయ చమురు మార్కెట్‌లో ఒక్కసారిగా అనిశ్చితి నెలకొంది. ముఖ్యంగా హార్మూజ్‌ జలసంధి వద్ద రవాణాకు అంతరాయం ఏర్పడుతుందనే ఆందోళనలు ప్రపంచ దేశాలను కలవరపెట్టాయి. ప్రపంచ చమురు సరఫరాలో కీలకమైన ఈ మార్గంలో ఏ చిన్న అంతరాయం వచ్చినా.. ధరలు మరింత పెరిగే అవకాశం ఉంటుంది.

దీంతో చమురు దిగుమతులపై ఆధారపడే భారత్‌ లాంటి దేశాలపై నేరుగా ప్రభావం పడుతుంది. దిగుమతి ఖర్చులు పెరిగితే.. అది కేవలం ప్రభుత్వ ఖజానాపైనే కాదు.. రూపాయి విలువ, ద్రవ్యోల్బణం, రవాణా ఖర్చులు, చివరకు పెట్రోల్‌, డీజిల్‌ ధరలపైనా ప్రభావం చూపే అవకాశం ఉంది.

ఇక సరఫరా దేశాల విషయానికి వస్తే.. ఈ త్రైమాసికంలో రష్యా భారత్‌కు అతిపెద్ద ముడి చమురు సరఫరాదారుగా నిలిచింది. భారత్‌ దిగుమతి చేసుకున్న చమురులో 40 శాతానికి పైగా రష్యా నుంచే వచ్చింది. ఆ తర్వాత యూఏఈ, సౌదీ అరేబియా దేశాలు ఉన్నాయి.

మరోవైపు పశ్చిమాసియా పరిస్థితులు ఇంకా ఇలాగే కొనసాగితే.. రానున్న రోజుల్లో భారత్‌ ముడి చమురు దిగుమతి బిల్లు మరింత పెరిగే అవకాశం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అందుకే ఇప్పుడు ప్రపంచ దేశాల చూపంతా పశ్చిమాసియాపైనే ఉంది. అక్కడి పరిస్థితులు ఎప్పుడు సాధారణ స్థితికి వస్తాయో.. చమురు ధరలు ఎప్పుడు దిగివస్తాయో.. అన్నది కీలక ప్రశ్నగా మారింది.

#International News#india#oil-import-bill#risen#war#west-asia
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి