రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న భూభారతి పోర్టల్‌లో విధులు నిర్వహిస్తున్న ఆపరేటర్లు, ఫీల్డ్ టెక్నికల్ స్టాఫ్‌కు 15 నెలలుగా వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కారం కాకపోవడంతో వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జిల్లా కేంద్రాల్లో కలెక్టర్ కార్యాలయాలతో పాటు మండల కేంద్రాల్లోని తహసీల్దార్ కార్యాలయాల్లో భూభారతి సేవలను అందిస్తున్న ఆపరేటర్లు.. ప్రతిరోజూ భూముల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ సహా వివిధ రెవెన్యూ కార్యకలాపాల్లో కీలకంగా పనిచేస్తున్నారు. అయితే నెలనెలా వేతనాలు అందకపోవడంతో కుటుంబాలను పోషించుకోవడం కూడా కష్టంగా మారిందని వారు చెబుతున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలో ఆపరేటర్లకు వేతనాలు సకాలంలో చెల్లించినప్పటికీ.. చివరిసారిగా 2024 జూలై నుంచి 2025 ఫిబ్రవరి వరకు బకాయి ఉన్న వేతనాలను చెల్లించింది. ఆ తర్వాత 2025 మార్చి నుంచి ఇప్పటివరకు వేతనాలు అందలేదని ఆపరేటర్లు చెబుతున్నారు. సుమారు 15 నెలలుగా వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వేతనాల కోసం జిల్లా రెవెన్యూ అధికారులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇన్‌చార్జి మంత్రులను కలిసి పలుమార్లు వినతిపత్రాలు సమర్పించినా ఫలితం లేకపోయిందని అంటున్నారు. చెల్లింపులు తమ పరిధిలో లేవని, సీసీఎల్‌ఏ నుంచే వేతనాలు విడుదల కావాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నట్టు ఆపరేటర్లు పేర్కొంటున్నారు. సీసీఎల్‌ఏకు కూడా పలుమార్లు విన్నవించినా స్పందన లేదని వారు అంటున్నారు.
ఇదిలా ఉంటే.. పాత ఏజెన్సీని రద్దు చేసి భూభారతి ఆపరేటర్లను తెలంగాణ టెక్నికల్ సర్వీసెస్ సెంటర్ పరిధిలోకి బదిలీ చేసినప్పటికీ, ఇప్పటివరకు రెన్యువల్ ఉత్తర్వులు జారీ కాలేదని వారు చెబుతున్నారు. దీంతో తమ ఉద్యోగాల భవిష్యత్తుపై కూడా అనిశ్చితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా ఆపరేటర్ల స్థానంలో జూనియర్ అసిస్టెంట్లకు బాధ్యతలు అప్పగించేందుకు చర్యలు జరుగుతున్నాయనే సమాచారంతో తమ పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారిందని అంటున్నారు. జూనియర్ అసిస్టెంట్లకు శిక్షణ కూడా ఇస్తున్నారని చెబుతూ.. ఎన్నో ఏళ్లుగా భూభారతి సేవల్లో అనుభవం ఉన్న తమనే కొనసాగించాలని కోరుతున్నారు.
మరోవైపు భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో భూభారతి ఆపరేటర్ల పాత్ర కీలకంగా ఉంది. 2020 నవంబర్‌లో ధరణి ఆపరేటర్లుగా నియమించబడిన వీరు.. రిజిస్ట్రేషన్ అనంతరం మ్యుటేషన్ ప్రక్రియను పూర్తి చేయడంలో ముఖ్యమైన బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
రైతులు స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత మొదటగా ఆపరేటర్లను సంప్రదిస్తారు. పత్రాలను పరిశీలించడం, రైతుల సంతకాలు తీసుకోవడం, ఫోటో, వేలిముద్ర, ఆధార్ తదితర వివరాలను నమోదు చేయడం నుంచి.. డాక్యుమెంట్లను తహసీల్దార్ పరిశీలనకు పంపడం వరకు అనేక దశలను ఆపరేటర్లు నిర్వహిస్తున్నారు.
తహసీల్దార్ ఆమోదం అనంతరం డాక్యుమెంట్లను ఎండార్స్ చేయడం, స్కాన్ చేసి ఆన్‌లైన్‌లో నమోదు చేయడం, డ్రాఫ్ట్ ప్రక్రియను పూర్తి చేయడం, లాగ్ రిజిస్టర్‌లో సంతకాలు తీసుకోవడం వంటి పనులు కూడా వారి బాధ్యతల్లోనే ఉన్నాయి. అంతేకాకుండా సర్వేలు, ఇతర అత్యవసర రెవెన్యూ పనుల్లోనూ వారు సేవలు అందిస్తున్నారు.
ఇంత కీలకమైన బాధ్యతలు నిర్వహిస్తున్న తమకు 15 నెలలుగా వేతనాలు చెల్లించకపోవడం అన్యాయమని భూభారతి ఆపరేటర్లు అంటున్నారు. ప్రభుత్వం వెంటనే పెండింగ్ వేతనాలను విడుదల చేయడంతో పాటు రెన్యువల్ ఉత్తర్వులు జారీ చేసి, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతున్నారు. ఆపరేటర్ల స్థానంలో ఇతరులను నియమించకుండా.. తమ సేవలను, అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని తమనే కొనసాగిస్తూ న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.












