వామాచారం అనే పదం వినగానే చాలామందికి తంత్రం, మంత్రాలు, రహస్య సాధనలు గుర్తుకు వస్తాయి. అయితే వామాచారాన్ని కేవలం భయపెట్టే కథలుగా.. మంత్రతంత్రాలతో మాత్రమే చూడటం సరైన అవగాహన కాదు. ఇది భారతీయ తాంత్రిక సంప్రదాయాల్లో కనిపించే ఒక ప్రత్యేకమైన సాధనా మార్గం అని శాస్త్రాలు చెబుతున్నాయి.
వామ అనే సంస్కృత పదానికి ఎడమ, విరుద్ధమైనది, ప్రత్యేకమైనది వంటి అర్థాలు ఉన్నాయి. శాక్త, తాంత్రిక సంప్రదాయాల్లో సాధారణ సామాజిక నియమాలకు భిన్నమైన కొన్ని ప్రతీకాత్మక లేదా ఆచరణాత్మక విధానాలను అనుసరించే మార్గాన్ని వామాచారం అని పిలుస్తారు. ముఖ్యంగా శక్తి ఆరాధనలో వామాచారానికి ప్రత్యేక స్థానం ఉంది.
ఈ మార్గంలో భయం, కోరిక, ద్వంద్వ భావనలు వంటి మనస్సులోని పరిమితులను అధిగమించి ఆధ్యాత్మిక చైతన్యాన్ని అనుభవించడమే ప్రధాన లక్ష్యంగా చెప్పబడుతుంది. కొన్ని తాంత్రిక సంప్రదాయాల్లో సాధారణంగా నిషిద్ధంగా భావించే అంశాలను కూడా సాధనలో ప్రతీకలుగా ఉపయోగించినట్లు గ్రంథాలు, సంప్రదాయాలు చెబుతాయి.
అయితే వీటిని చూసి వామాచారం అంటే తప్పనిసరిగా అఘోర లేదా క్షుద్ర విద్య అని భావించడం అపోహ అని పండితులు అంటున్నారు.. వామాచారానికి అనేక శాఖలు, సంప్రదాయాలు ఉన్నాయి. ప్రతి సంప్రదాయంలోని ఆచరణ ఒకేలా ఉండదని తెలుపుచున్నారు..
వామాచారానికి వ్యతిరేకంగా చెప్పబడే దక్షిణాచారంలో మాత్రం శాస్త్రబద్ధమైన పూజలు, జపం, ధ్యానం, నియమాలు, సాత్విక ఆరాధనకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. ఇక ఆధ్యాత్మిక దృష్టిలో చూస్తే.. వామాచారం యొక్క అసలు ఉద్దేశ్యం బయట ప్రపంచాన్ని మార్చడం కంటే మనిషి అంతరంగాన్ని మార్చడం... భయం, అహంకారం, కోరిక, ద్వేషం వంటి భావాలను అధిగమించి చైతన్యాన్ని ఉన్నత స్థితికి తీసుకెళ్లడమే తాంత్రిక సాధనల అంతరార్థంగా అనేక సంప్రదాయాలు వివరిస్తాయి.
అందుకే వామాచారాన్ని కేవలం మంత్రతంత్రాల మార్గంగా కాకుండా, భారతీయ తాంత్రిక సంప్రదాయాల్లోని ఒక సంక్లిష్టమైన ఆధ్యాత్మిక సాధనా విధానంగా అర్థం చేసుకోవాలని గురువులు సూచిస్తున్నారు.. అయితే ఇలాంటి సాధనలు గురువు మార్గదర్శకత్వం లేకుండా చేయడం ప్రమాదకరమని సంప్రదాయాలే హెచ్చరిస్తాయి. ఎందుకంటే ఇందులోని అనేక అంశాలు ప్రతీకాత్మకమైనవి, గూఢమైనవి, సంప్రదాయానుసారంగా మారుతూ ఉంటాయి.
మొత్తానికి.. వామాచారం అంటే భయపెట్టే రహస్య విద్య మాత్రమే కాదు. మనిషి తనలోని భయాలు, బంధాలు, పరిమితులను అధిగమించి ఆధ్యాత్మిక చైతన్యాన్ని అన్వేషించే తాంత్రిక మార్గాల్లో ఒకటి. దీన్ని అర్థం చేసుకోవాలంటే అపోహల కంటే శాస్త్రాలు, సంప్రదాయాలు, చారిత్రక నేపథ్యాన్ని పరిశీలించడం అవసరం.
గమనిక: ఇక్కడ అందించిన వివరాలు కేవలం సాంప్రదాయ పురాణ విశ్వాసాలు మరియు ఆధ్యాత్మిక భావనల ఆధారంగా ఇవ్వబడ్డాయి. వీటిని కేవలం మతపరమైన విశ్వాసాల కోణంలోనే చూడాలి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత రంగ నిపుణులను సంప్రదించడం మంచిది.












