National

రాహుల్ నుంచి RSS వరకు.. Gen Zపై ఇంత ఫోకస్ ఎందుకు?

రచన: Kashi7 నిమిషాల పఠనం

Gen Zని కేవలం ఓటర్లుగా చూస్తే సరిపోదు. వాళ్లే ఇప్పుడు నేరుగా రాజకీయ కథనాలను తయారు చేసే శక్తిగా మారుతున్నారు. ఒక వీడియో వైరల్ చేస్తారు.. ఒక సమస్యపై సోషల్ మీడియాలో చర్చ మొదలుపెడతారు.. కొన్ని గంటల్లో అది జాతీయ స్థాయి అంశంగా మారుతుంది. అంటే గతంలో రాజకీయ పార్టీలు ప్రజలకు తమ అజెండాను చెప్పేవి. ఇప్పుడు పరిస్థితి కొంతవరకు రివర్స్ అయింది.

దేశ రాజకీయాల్లో కొత్త టర్న్‌

‘Gen Z’ జపం చేస్తున్న‌ అన్ని పార్టీలు

2029 ఎన్నిక‌ల్లో యువ‌త‌దే హ‌వా

ఎక్క‌డ చూసినా... జెన్ జీ చ‌ర్చే...

ఒకప్పుడు రాజకీయ పార్టీలకు యువత అంటే.. విద్యార్థి సంఘాలు, యూత్‌ వింగ్స్‌, కాలేజీ సభలు, భారీ ర్యాలీలు. కానీ ఇప్పుడు రాజకీయ భాషే మారిపోతోంది. ‘Gen Z’ అనే పదం దేశ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. అధికార పక్షం నుంచి ప్రతిపక్షం వరకు.. చివరికి రాష్ట్రీయ స్వ‌యం సేవ‌క్ సంఘ్ కూడా కొత్త తరాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందంటోంది. తాజాగా కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ ప్రయాగ్‌రాజ్‌లో విద్యార్థులతో సమావేశమై.. ఉద్యోగాలు, పరీక్షల అవకతవకలు, విద్య వంటి అంశాలపై మాట్లాడారు.

అసలు ఇంత హఠాత్తుగా రాజకీయ పార్టీలన్నీ Gen Z వైపు ఎందుకు చూస్తున్నాయి? ఇదే ఇప్పుడు ఆసక్తికరమైన ప్రశ్న.

Gen Z అంటే సాధారణంగా 1990ల చివరి నుంచి 2010ల ప్రారంభం మధ్య జన్మించిన తరాన్ని సూచిస్తారు. ఈ తరం రాజకీయాలను పాత తరాల మాదిరిగా చూడటం లేదు. ఒక నాయకుడు ఏం చెప్పాడన్నదానికంటే.. ఎందుకు చెప్పాడు? ఆధారం ఏంటి? నిజంగా ఏం జరుగుతోంది? అనే ప్రశ్నలు వేస్తోంది. ఇదే మార్పును RSS చీఫ్ మోహన్ భగవత్ కూడా ప్రస్తావించారు. పాత తరాల్లో ఉన్నట్లుగా కేవలం ఆదేశాలను అనుసరించే తత్వం ఇప్పుడు యువతలో లేదని.. వాళ్లు ప్రశ్నలకు సమాధానాలు కోరుతున్నారని ఆయన అన్నారు.

జెన్ జీ ని ఓట‌ర్లుగా చూస్తే స‌రిపోదు

ఇక్కడే రాజకీయ పార్టీలకు అసలు టెన్షన్ మొదలైంది. Gen Zని కేవలం ఓటర్లుగా చూస్తే సరిపోదు. వాళ్లే ఇప్పుడు నేరుగా రాజకీయ కథనాలను తయారు చేసే శక్తిగా మారుతున్నారు. ఒక వీడియో వైరల్ చేస్తారు.. ఒక సమస్యపై సోషల్ మీడియాలో చర్చ మొదలుపెడతారు.. కొన్ని గంటల్లో అది జాతీయ స్థాయి అంశంగా మారుతుంది. అంటే గతంలో రాజకీయ పార్టీలు ప్రజలకు తమ అజెండాను చెప్పేవి. ఇప్పుడు పరిస్థితి కొంతవరకు రివర్స్ అయింది. ప్రజలు, ముఖ్యంగా యువత.. ఏ అంశంపై రాజకీయ పార్టీలు మాట్లాడాలో కూడా ప్రభావితం చేయగలుగుతున్నారు.

ఇటీవల విద్యార్థులు, యువతకు సంబంధించిన ఆందోళనలు ఈ మార్పును మరింత స్పష్టంగా చూపించాయి. పేపర్ లీకులు, పరీక్షల నిర్వహణ, ఉద్యోగాలు, నియామకాల్లో ఆలస్యం వంటి అంశాలు యువతలో అసంతృప్తిని పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ఛ‌త్రోన్ కీ గూంజ్ వంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థులను నేరుగా కలుస్తోంది. దీని అర్థం విద్యార్థుల గ‌ళం. ప్రయాగ్‌రాజ్‌లో రాహుల్‌ గాంధీ నిర్వ‌హించిన ఈ సమావేశం కూడా అదే రాజకీయ వ్యూహంలో భాగంగా కనిపిస్తోంది.

అయితే ఇది కేవలం కాంగ్రెస్‌ వ్యూహం కాదు. మొత్తం రాజకీయ వ్యవస్థ ఎదుర్కొంటున్న కొత్త వాస్తవం. Gen Z ఒకే పార్టీకి చెందిన ఓటు బ్యాంక్ కాదు. ఒక విషయంలో ప్రభుత్వాన్ని ప్రశంసిస్తూ.. మరో విషయంలో అదే ప్రభుత్వాన్ని ప్రశ్నించవచ్చు. ఒక నాయకుడి వీడియోను వైరల్ చేస్తూనే.. మరో నాయకుడి విధానాన్ని తీవ్రంగా విమర్శించవచ్చు. అంటే ఈ తరాన్ని సంప్రదాయ రాజకీయ ‘ఓట్ బ్యాంక్’ ఫార్ములాతో అర్థం చేసుకోవడం చాలా కష్టం.

మారుతున్న రాజ‌కీయం

అందుకే రాజకీయ పార్టీల వ్యూహం కూడా మారుతోంది. వాళ్ల భాష మారుతోంది.. కమ్యూనికేషన్ మారుతోంది.. నాయకుల ఇమేజ్ మారుతోంది. యువతకు దగ్గరగా కనిపించేందుకు సోషల్ మీడియా, షార్ట్ వీడియోలు, డిజిటల్ క్యాంపెయిన్లు మాత్రమే కాదు.. యువతతో నేరుగా సంభాషించే కార్యక్రమాలకు కూడా ప్రాధాన్యం పెరుగుతోంది.

ఇక్కడ మరో కీలకమైన విషయం ఉంది. Gen Z కేవలం రాజకీయ పార్టీలకు ఓటు వేసే తరం కాదు. రాజకీయ పార్టీలను ప్రశ్నించే తరం. అందుకే ఈ తరం నుంచి దూరంగా ఉండటం రాజకీయంగా ప్రమాదకరమని అన్ని పార్టీలూ గుర్తిస్తున్నాయి. RSS చీఫ్ వ్యాఖ్యల్లోనూ ఇదే అంశం కనిపిస్తోంది. యువతను ఆదేశించడం కంటే వారితో మాట్లాడటం, వారి ప్రశ్నలకు సమాధానం చెప్పడం అవసరమని ఆయన స్పష్టం చేశారు.

మరి దీని అర్థం ఏమిటి? రేపటి భారత రాజకీయాల్లో యువతే పూర్తిగా నిర్ణయాత్మక శక్తిగా మారబోతుందా? ఇందుకు అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే భారతదేశ రాజకీయ చర్చ క్రమంగా సభల నుంచి స్క్రీన్‌లకు, మైకుల నుంచి మొబైల్‌లకు మారుతోంది. ఆ మార్పులో అత్యంత చురుకైన తరం Gen Z.

అందుకే ఇప్పుడు అసలు పోటీ Gen Z ఎవరి వైపు ఉంది? అన్నది కాదు. Gen Zని ఎవరు నిజంగా అర్థం చేసుకుంటారు? ఎవరు వాళ్ల ప్రశ్నలకు సమాధానం చెబుతారు? ఎవరు కేవలం ప్రచారం కోసం కాకుండా విధానాల్లో మార్పు తీసుకొస్తారు? అన్నదే.

రాజకీయ పార్టీలు Gen Z జపం చేయడం వెనుక అసలు కారణం ఇదే. యువతను ఆకట్టుకోవాలనే కోరిక కంటే.. యువతను కోల్పోతామనే భయం ఎక్కువైందా? రాబోయే ఎన్నికలు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పబోతున్నాయి.

#Gen Z#Indian Politics#Rahul Gandhi#RSS#Youth Politics#Indian Youth#Gen Z Politics#Congress#BJP#Mohan Bhagwat#Prayagraj#Youth Vote#Political Strategy#India Politics
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి