UPI Charges: యూపీఐ ద్వారా చేసే చెల్లింపులపై త్వరలోనే ఛార్జీలు విధించనున్నారనే వార్తలు అటు యూజర్లను, ఇటు వ్యాపారులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. యూపీఐ ఛార్జీల గురించి విస్తృతంగా చర్చ జరుగుతోంది. సర్వత్రా ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో కేంద్రం కీలక ప్రకటన చేసింది. యూపీఐ యూజర్లకు బిగ్ రిలీఫ్ ఇచ్చింది. యూజర్లు, వ్యాపారులపై యూపీఐ ఛార్జీల భారం ఉండదని కేంద్రం స్పష్టం చేసింది. ఇటీవల కేంద్రం లోక్ సభలో పేమెంట్ అండ్ సెటిల్ మెంట్ 2007 సవరణ బిల్లును ఆమోదించింది. దీంతో యూజర్లు లేదా వ్యాపారులపై ఛార్జీలు ఉంటాయనే ప్రచారం జోరందుకుంది. ఈ ప్రచారానికి తెరదించుతూ కేంద్రం స్పష్టతనిచ్చింది.
బ్యాంకులు వ్యాపారుల నుండి ఛార్జీలు వసూలు చేయడానికి అనుమతించే బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందినప్పటి నుండి యూపీఐ వినియోగదారుల మదిలో ఒక ప్రశ్న మెదులుతోంది. త్వరలో UPI లావాదేవీలకు ఛార్జీలు వసూలు చేస్తారనే ఆందోళన వారిలో నెలకొంది. అయితే, వినియోగదారులకు 'యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్' (UPI) లావాదేవీలు ఉచితంగానే కొనసాగుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. UPI చెల్లింపులు జరిపినందుకు వినియోగదారుల నుండి ఎటువంటి రుసుము వసూలు చేయబడదని, అలాగే అన్ని 'పర్సన్-టు-పర్సన్' (P2P) లావాదేవీలు ఉచితంగానే కొనసాగుతాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది.
భవిష్యత్తులో ఒకవేళ 'మర్చంట్ డిస్కౌంట్ రేట్' (MDR)ను ప్రవేశపెడితే, అది నిర్దిష్ట పరిమితిని మించిన పరిమిత వర్గపు వ్యాపార లావాదేవీలకు మాత్రమే వర్తిస్తుందని కేంద్రం పేర్కొంది. అలాగే, దీనిని నామమాత్రపు రేటుతో విధిస్తారని.. ఈ రేటు డెబిట్, క్రెడిట్ కార్డ్ లావాదేవీలపై వర్తించే MDR కంటే చాలా తక్కువగా ఉంటుందని వెల్లడించింది. వ్యాపార సంస్థలకు జరిపే రూ. 2,000 కంటే ఎక్కువ విలువైన UPI చెల్లింపులపై 0.25% నుండి 0.4% వరకు MDR విధించడానికి బ్యాంకులు, చెల్లింపు సేవా సంస్థలకు ప్రభుత్వం అనుమతినిచ్చే అవకాశం ఉందని నివేదికలు సూచిస్తున్నాయి. అంటే కూరగాయలు, సరుకులు, ఆటో-రిక్షా ప్రయాణాలు, టాక్సీ ఛార్జీల వంటి నిత్య చెల్లింపులపై ఎలాంటి ప్రభావం ఉండకపోవచ్చని భావిస్తున్నారు.
'పేమెంట్ అండ్ సెటిల్‌మెంట్ సిస్టమ్స్ యాక్ట్' (PSS చట్టం)కు చేసిన సవరణను.. సాధారణ వినియోగదారులపై ఛార్జీలు విధించే ప్రతిపాదనగా కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారని ప్రభుత్వం పేర్కొంది. ఈ సవరణ ఒక అనుకూల నిబంధన అని వివరించింది. ఇది UPI సాంకేతిక సామర్థ్యాలను, రాబోయే ముప్పులను తట్టుకునే శక్తిని బలోపేతం చేస్తూనే, దాని దీర్ఘకాలిక సుస్థిరతకు మద్దతిచ్చేలా రూపొందించబడిందని వెల్లడించింది.












