National

South Central Railway: రైలు ప్రయాణికులకు అధికారుల హెచ్చరిక.. ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానా!..

రచన: Venu4 నిమిషాల పఠనం

ప్రయాణికులు రైలులో ఎక్కే ముందు తమ టికెట్ ఏ కోచ్‌కు సంబంధించినదో తప్పనిసరిగా పరిశీలించుకోవాలని, జనరల్ టికెట్ ఉన్నవారు జనరల్ కోచ్‌లోనే ప్రయాణించాలని, రిజర్వేషన్ లేని ప్రయాణికులు రిజర్వ్‌డ్ కోచ్‌లలోకి ప్రవేశించవద్దని దక్షిణ మధ్య రైల్వే సూచించింది.

రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీలక సూచనలు చేసింది. ముఖ్యంగా రిజర్వేషన్ ఉన్న కోచ్‌లలో సరైన టికెట్ లేదా అనుమతి లేకుండా ప్రయాణించవద్దని స్పష్టం చేసింది. ప్రయాణికుల భద్రత, సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని రైల్వే నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నట్లు తెలిపింది.

ప్రస్తుతం రద్దీగా ఉండే రైళ్లలో జనరల్ టికెట్ తీసుకున్న కొందరు ప్రయాణికులు రిజర్వేషన్ కోచ్‌లలోకి వెళ్లడం కనిపిస్తోంది. దీనివల్ల ముందుగానే సీట్లు, బెర్త్‌లు బుక్ చేసుకున్న ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా రాత్రి వేళల్లో ప్రయాణించే వృద్ధులు, మహిళలు, చిన్నారులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో రైల్వే అధికారులు ఈ నిబంధనలను కఠినతరం చేస్తున్నారు.

జనరల్ టికెట్‌తో రిజర్వ్‌డ్ కోచ్‌లో ప్రయాణించడం లేదా సరైన అనుమతి లేకుండా ఆ కోచ్‌లోకి ప్రవేశించడం నిబంధనల ఉల్లంఘనగా పరిగణిస్తారు. ఇలాంటి సందర్భాల్లో రూ.2,000 వరకు జరిమానా విధించే అవకాశం ఉందని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.

అంతేకాదు.. రిజర్వేషన్ టికెట్ ఉన్న ప్రయాణికుడిని అతని సీటులో కూర్చోకుండా అడ్డుకోవడం, సీటును ఖాళీ చేయకుండా ఇబ్బంది పెట్టడం కూడా నిబంధనల ఉల్లంఘనే. ఇలాంటి సందర్భాల్లో రూ.1,000 వరకు జరిమానా విధించే అవకాశం ఉంటుంది. టికెట్ ఉన్న ప్రయాణికుడికి అతనికి కేటాయించిన సీటు లేదా బెర్త్‌పై పూర్తి హక్కు ఉంటుంది.

ఇక అధికారులు విధించిన జరిమానాను చెల్లించకుండా తప్పించుకోవాలని ప్రయత్నిస్తే కేసు కోర్టుకు వెళ్లే అవకాశం ఉంది. అలాంటి సందర్భాల్లో కోర్టు ద్వారా రూ.3,000 వరకు జరిమానా విధించే అవకాశం ఉంటుందని రైల్వే అధికారులు హెచ్చరిస్తున్నారు.

అందుకే ప్రయాణికులు రైలులో ఎక్కే ముందు తమ టికెట్ ఏ కోచ్‌కు సంబంధించినదో తప్పనిసరిగా పరిశీలించుకోవాలని, జనరల్ టికెట్ ఉన్నవారు జనరల్ కోచ్‌లోనే ప్రయాణించాలని, రిజర్వేషన్ లేని ప్రయాణికులు రిజర్వ్‌డ్ కోచ్‌లలోకి ప్రవేశించవద్దని దక్షిణ మధ్య రైల్వే సూచించింది. నిబంధనలు పాటించి తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ప్రయాణించాలని అధికారులు కోరుతున్నారు.

#National News#South Central Railway#Warning#train passengers#Heavy fines
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి