తెలంగాణ

Kamareddy: కామారెడ్డిలో వర్షం బీభత్సం.. కౌన్సిలర్ వినూత్న నిరసన!..

రచన: Venu4 నిమిషాల పఠనం

రోడ్డుపై పెద్ద ఎత్తున నీరు నిలవడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాహనాలు రాకపోకలు సాగించేందుకు ఇబ్బంది పడటంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. దీంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కామారెడ్డి జిల్లా కేంద్రంలో శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. ముఖ్యంగా కామారెడ్డి–కరీంనగర్ జాతీయ రహదారిలోని స్టేషన్ రోడ్డులో పోలీస్ స్టేషన్ ఎదుట భారీగా వర్షపు నీరు నిలిచిపోయింది. దీంతో ఆ ప్రాంతం రహదారిలా కాకుండా ఏకంగా కుంటను, చెరువును తలపిస్తోంది.

రోడ్డుపై పెద్ద ఎత్తున నీరు నిలవడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాహనాలు రాకపోకలు సాగించేందుకు ఇబ్బంది పడటంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. దీంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ సమస్యపై 46, 47వ వార్డు కౌన్సిలర్ గెరిగంటి లక్ష్మీనారాయణ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. రోడ్డుపై నిలిచిన వర్షపు నీటిలోనే కూర్చొని అధికారుల తీరుపై నిరసన వ్యక్తం చేశారు. వర్షపు నీరు వెళ్లేందుకు సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో ప్రతి వర్షాకాలంలో ఇదే పరిస్థితి పునరావృతమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

ముఖ్యంగా ఇదే మార్గంలో జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి ఉండటంతో సమస్య మరింత తీవ్రంగా మారింది. అత్యవసర పరిస్థితుల్లో రోగులు, క్షతగాత్రులను తరలించే 108 అంబులెన్సులతో పాటు ఆస్పత్రికి వచ్చే ఇతర వాహనాలు కూడా వరద నీటిలో చిక్కుకుంటున్నాయని కౌన్సిలర్ తెలిపారు.

అత్యవసర సమయంలో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడితే సకాలంలో వైద్యం అందక ప్రాణనష్టం జరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కామారెడ్డి–కరీంనగర్‌ను అనుసంధానించే ప్రధాన రహదారి కావడంతో సమస్యను అధికారులు యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

రహదారిపై వర్షపు నీరు నిలవకుండా శాశ్వత పరిష్కారం చూపాలని, డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని కోరారు. అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించకపోతే ఇదే ప్రాంతంలో దీక్ష చేపడతామని కౌన్సిలర్ గెరిగంటి లక్ష్మీనారాయణ హెచ్చరించారు.

#Telangana#Kamareddy#Torrential rain#Councilor#innovative protest
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి