Cinema: సినిమా అంటే ఫక్తు వినోదం. చిన్నా, పెద్దా అందరూ కాసేపు సేద తీరడానికి ఒక ప్రత్యామ్నయం. కానీ, గత కొంతకాలంగా సినిమా అంటే అర్థమే మారిపోయింది. ఒకప్పుడు సినిమా అంటే కామెడీ, ఎమోషన్స్, ఫ్యామిలీ ఎలిమెంట్స్ ఉండేవి. కంప్లీట్ కామెడీ చిత్రాలతో మన వాళ్ళు భారీ సక్సెస్‌లను చూశారు కూడా. హనుమాన్ జంక్షన్, సందడే సందడి, పెళ్ళాం ఊరెళితే, క్షేమంగా వెళ్ళి లాభంగా రండి..ఆ తర్వాత వచ్చిన అల్లరి నరేష్ సినిమాలు మంచి వినోదాన్ని అందించాయి.
మెగాస్టార్ లాంటి వారు కూడా కామెడీ ప్రధానంగా శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్ లాంటి సినిమాలు చేశారు. నాగార్జున, వెంకటేష్ లాంటి సీనియర్ హీరోలు కామెడీ జానర్ లో సినిమాలు చేసి హిట్ కొట్టారు. రవితేజ సినిమాలలో ఎక్కువగా ఉండేది మంచి కామెడీ. ఇలా ఎక్కువగా ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్ కి వచ్చి రెండున్నర గంటల పాటు హాయిగా ఎంజాయ్ వెళ్ళేవారు.

కానీ, పాన్ ఇండియా సినిమా కల్చర్ వచ్చాక సినిమాలలో వయెలెన్స్ బాగా ఎక్కువైపోయింది. ఇలాంటి సినిమాలకి ఒక వర్గం ప్రేక్షకులు మాత్రమే థియేటర్స్ కి వస్తున్నారు. 18 ఏళ్ళ లోపు పిల్లలు, వయసు పైబడిన వారు ఇంత వయెలెన్స్ చూడాలంటే ఇష్టపడం లేదు. పైగా ఫ్యామిలీ ఆడియన్స్ అంతా కలిసి పిల్లా జల్లాతో వెళ్ళాలంటే రక్తపాతం, హింస, మితి మీరిన రొమాన్స్ ఉండటం వల్ల సినిమాలు అంతగా ఆకట్టుకోవడం లేదు.
ఈ మధ్య కాలంలో వచ్చిన కేజీఎఫ్ సిరీస్, సలార్, అనిమల్ లాంటి సినిమాలు ఈ కోవలోకి చెందినవే. ఇక, ఇప్పుడు రాబోతున్న సినిమాలలో టాక్సిక్ ట్రైలర్ చూసిన తర్వాత ఏ ఆడియన్స్ కోసం సినిమా తీశారో అర్థం చేసుకోవచ్చు. అలాగే, నాని నటించిన ది ప్యారడైజ్ కూడా హింస, రక్తపాతం బాగా ఉన్న కంటెంట్‌తో తీశారు. ట్రైలర్ లో నానీ, వందలమందిని చంపేసి ఆ గుట్ట మీద కూచొని బ్లేడ్స్ తో దిష్టి తీసుకునే సీన్స్ ఎవరి కోసం..సమాజానికి, ఇలాంటి సినిమాలు ఎంతవరకూ అవసరం..ఇలాంటి ప్రశ్నలు బాగానే వినిపిస్తున్నాయి. మరి, మన మేకర్స్ ఈ విషయంలో ఎప్పుడు మారతారు?












