Spirituality

Spirituality: దేవుడిని అతిథిగా భావించి షోడశోపచార పూజ చేయడంలో అర్థం ఇదే!..

రచన: Venu4 నిమిషాల పఠనం

సనాతన ధర్మంలో పూజ అంటే కేవలం కొన్ని పుష్పాలు సమర్పించడం, దీపం వెలిగించడం మాత్రమే కాదు. పూజ వెనుక ఒక గొప్ప ఆధ్యాత్మిక భావన దాగి ఉంది. భగవంతుడిని మన ఇంటికి ఆహ్వానించి, అత్యంత గౌరవంతో అతిథిగా భావించి సేవించడమే షోడశోపచార పూజ.

మన సనాతన ధర్మంలో పూజ అంటే కేవలం కొన్ని పుష్పాలు సమర్పించడం, దీపం వెలిగించడం మాత్రమే కాదు. పూజ వెనుక ఒక గొప్ప ఆధ్యాత్మిక భావన దాగి ఉంది. భగవంతుడిని మన ఇంటికి ఆహ్వానించి, అత్యంత గౌరవంతో అతిథిగా భావించి సేవించడమే షోడశోపచార పూజ.

ఇక షోడశ అంటే పదహారు. మన శక్తి కొలదీ ఆ పరమేశ్వరునికి సమర్పించే పదహారు రకాల వినయపూర్వక సేవలే ఈ ఉపచారాలు. అందులో భగవంతుడిని మనస్ఫూర్తిగా మన హృదయ పీఠంపైకి ఆహ్వానించడం 'ఆవాహనం'. ఆయన వేంచేయడానికి శ్రద్ధతో పీఠాన్ని సమర్పించడం 'ఆసనం'.

అలాగే అలసి వచ్చిన స్వామి పాదాలను కడగడం 'పాద్యం', చేతులు కడుక్కోవడానికి జలాన్నివ్వడం 'అర్ఘ్యం', అంతరంగ శుద్ధి కోసం దాహ జలాన్ని అందించడం 'ఆచమనీయం'. అదేవిధంగా పవిత్ర తీర్థాలతో భగవంతునికి అభిషేకం చేయడం 'స్నానం'. ఆధ్యాత్మిక సంస్కారానికి ప్రతీకగా నూతన 'వస్త్రం', 'యజ్ఞోపవీతం' సమర్పించడం తదుపరి ఉపచారాలు.

శాంతికి, పరిమళానికి సంకేతంగా విభూతి లేదా చల్లని 'గంధం' పూసి, ప్రకృతి ప్రసాదించిన అందమైన 'పుష్పాలతో' స్వామిని అలంకరిస్తాం... చుట్టూ ఉన్న వాతావరణాన్ని దుష్టశక్తుల నుండి పవిత్రీకరించడానికి 'ధూపం', అజ్ఞానమనే చీకటిని తొలగించి జ్ఞానకాంతిని నింపడానికి 'దీపం' దర్శింపజేస్తాం.

ఇక మనకు లభించిన ఆహారాన్ని, ధాన్యాలను కృతజ్ఞతతో ఆయనకు సమర్పించడమే 'నైవేద్యం'. తదనంతరం జీర్ణక్రియకు, ముఖవాసనకు 'తాంబూలాన్ని' అందిస్తాం. చివరిగా మన భావాలలోని కాంతిని 'నీరాజనం'గా వెలిగించి.. "స్వామీ! నా సమస్త ఆలోచనలు, కర్మలు నీకే అర్పితం" అని చెప్పడమే 'మంత్రపుష్పం' ఇదే భగవంతునికి చేసే షోడశోపచార పూజలోని విధానం.. అర్థం..

ఇక భగవంతుడు మన భౌతిక పూజా ద్రవ్యాలను కోరడు.. ఈ ఉపచారాల వెనుక ఉన్న మన అపరిమితమైన ప్రేమను, నిశ్చలమైన భక్తినే స్వీకరిస్తాడు. దేవుడిని విగ్రహంగా కాక, ప్రాణమున్న ప్రత్యక్ష దైవంగా భావించి పూజించినప్పుడే ఈ షోడశోపచారాలకు పరిపూర్ణత లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి.

అందుకే షోడశోపచార పూజను కేవలం ఒక ఆచారంగా చూడకూడదు. దైవాన్ని అతిథిగా ఆహ్వానించడం నుంచి.. చివరకు మనల్ని మనమే దైవానికి సమర్పించుకోవడం వరకు సాగేది ఒక సంపూర్ణ ఆధ్యాత్మిక ప్రయాణంగా భావించాలని తెలుపుచున్నారు. భగవంతుడికి మనం ఇచ్చేది పదహారు ఉపచారాలు కావచ్చు.. కానీ వాటి వెనుక ఉండాల్సింది మాత్రం ఒక్కటే.. భక్తి, కృతజ్ఞత, సమర్పణ భావం..

గమనిక: ఇక్కడ అందించిన వివరాలు కేవలం సాంప్రదాయ పురాణ విశ్వాసాలు మరియు ఆధ్యాత్మిక భావనల ఆధారంగా ఇవ్వబడ్డాయి. వీటిని కేవలం మతపరమైన విశ్వాసాల కోణంలోనే చూడాలి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత రంగ నిపుణులను సంప్రదించడం మంచిది.

#Indian culture Spirituality#significance#performing#Shodashopachara Puja#God#guest
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి