అభిప్రాయం

25 ఏళ్లొచ్చినా ఇంకా సెటిల్ కాలేదా..? అయితే ఈ స్టోరీ మీ కోస‌మే..!

రచన: Kashi7 నిమిషాల పఠనం

ఒకప్పుడు 25 ఏళ్లు అంటే జీవితంలో చాలా విషయాలు క్లియర్ అయిపోయే వయసుగా భావించేవాళ్లు. చదువు పూర్తయ్యేది. ఉద్యోగం వచ్చేది. కొంతకాలానికి పెళ్లి చేసుకునేవాళ్లు. ఆ తర్వాత ఇల్లు, కుటుంబం అంటూ జీవితం ఒక ట్రాక్‌లోకి వెళ్లిపోయేది. కానీ ఇప్పుడు..?

25 ఏళ్లొచ్చినా సెటిల్ కాలేదా..?

జాబ్ ఎప్పుడు?.. జీతం ఎంత?

పెళ్లెప్పుడు?.. సొంత ఇల్లు కొనేదెన్న‌డు?

25 ఏళ్లు దాటగానే యువతను వెంటాడే ప్రశ్నలు ఇవే. చదువు పూర్తయింది.. ఉద్యోగం వచ్చింది.. ఇక జీవితం సెటిల్ అయిపోవాలి. కానీ అలా జరగడం లేదు. ఒకవైపు ఉద్యోగం కోసం పోటీ.. మరోవైపు పెరుగుతున్న ఖర్చులు.. ఇంకోవైపు సోషల్ మీడియాలో కనిపించే ఇతరుల సక్సెస్ స్టోరీలు. ఇవన్నీ కలిసి చాలామంది యువతలో ఒకే ఆలోచనను పెంచుతున్నాయి.. “నేను లైఫ్‌లో వెనుకబడిపోతున్నానా?”

ఒకప్పుడు 25 ఏళ్లు అంటే జీవితంలో చాలా విషయాలు క్లియర్ అయిపోయే వయసుగా భావించేవాళ్లు. చదువు పూర్తయ్యేది. ఉద్యోగం వచ్చేది. కొంతకాలానికి పెళ్లి చేసుకునేవాళ్లు. ఆ తర్వాత ఇల్లు, కుటుంబం అంటూ జీవితం ఒక ట్రాక్‌లోకి వెళ్లిపోయేది. కానీ ఇప్పుడు పరిస్థితులు అలా లేవు. ఒక డిగ్రీతో ఉద్యోగం గ్యారెంటీ కాదు. ఉద్యోగం వచ్చినా అది మనకు నచ్చినదే అవుతుందన్న గ్యారెంటీ లేదు. జాబ్ ఉన్నా జీతం మన అవసరాలకు సరిపోకపోవచ్చు. కెరీర్ నచ్చకపోతే మళ్లీ మొదటి నుంచి ప్రయత్నించాల్సి రావచ్చు.

ఇదంతా జరుగుతుండగానే ఇంట్లో నుంచి ఒక ప్రశ్న వస్తుంది.

“ఇంకా ఎప్పుడు సెటిల్ అవుతావ్?”

చాలామంది యువతకు ఈ ప్రశ్న ఇప్పుడు సరదా ప్రశ్న కాదు. ఒక రకమైన ప్రెజర్. ఎందుకంటే సెటిల్ అవ్వాలి అనే మాటకు మన సమాజం ఒక స్టాండర్డ్ పెట్టేసింది. మంచి ఉద్యోగం ఉండాలి. మంచి జీతం రావాలి. పెళ్లి కావాలి. సొంత ఇల్లు ఉండాలి. కారు ఉండాలి. బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి.

కానీ అసలు ప్రశ్న ఏంటంటే.. ఇవన్నీ 25 ఏళ్లకే సాధించాల్సిందేనా?

సోషల్ మీడియా ఈ ప్రెజర్‌ను మరింత పెంచుతోంది. మన వయసున్న ఒక వ్యక్తి విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నాడు. ఇంకొకరు స్టార్టప్ పెట్టారు. మరొకరు కొత్త కారు కొన్నారు. ఇంకొకరు పెళ్లి చేసుకున్నారు. ఇంకొకరు ఇంటి ఫొటోలు పెడుతున్నారు. ఇంకొకరు ట్రావెల్ చేస్తున్నారు.

మన ఫోన్ స్క్రీన్‌పై అందరి సక్సెస్ కనిపిస్తుంది. అప్పుడు మనలో తెలియకుండానే ఒక పోలిక మొదలవుతుంది. అందరూ ముందుకెళ్తున్నారు.. నేను మాత్రం ఎక్కడున్నాను..?

కానీ ఇక్కడ మనం మర్చిపోతున్న విషయం ఒక్కటే. సోషల్ మీడియాలో కనిపించేది ఒక మనిషి జీవితమంతా కాదు. అతను చూపించాలనుకున్న కొన్ని మంచి క్షణాలు మాత్రమే. వాళ్ల ఫెయిల్యూర్స్ కనిపించవు. వాళ్ల అప్పులు కనిపించవు. వాళ్ల భయాలు కనిపించవు. వాళ్లు ఎదుర్కొన్న కష్టాలు కనిపించవు.

అయితే మనం మాత్రం వాళ్ల హైలైట్స్‌ను తీసుకుని.. మన మొత్తం జీవితంతో పోల్చుకుంటున్నాం. అక్కడే అసలు సమస్య మొదలవుతోంది.

ఇప్పుడు మరోసారి “సెటిల్ అవ్వడం” అంటే ఏంటో ఆలోచించాలి. నెలకు లక్ష రూపాయల జీతం వస్తేనే సెటిల్ అయినట్టా? సొంత ఇల్లు ఉంటేనేనా? పెళ్లి అయితేనా? లేక‌ కారు కొంటేనేనా? సెటిల్‌మెంట్‌కు కొల‌మానం ఏంటి..?

మనకు నచ్చిన పని చేసుకుంటూ.. మన ఖర్చులను మనం చూసుకోగలుగుతూ.. భవిష్యత్తు కోసం కొంత సేవ్ చేసుకుంటూ.. మనకు నచ్చిన జీవితాన్ని మనం నిర్మించుకోవడమే సెటిల్ అవ్వడమా?

ప్రతి వ్యక్తికి ఈ సమాధానం వేరుగా ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు యూత్ కెరీర్ కూడా ఒకే దారిలో ఉండటం లేదు. ఒక‌రు ఉద్యోగం చేస్తున్నారు. ఇంకొకరు ఫ్రీలాన్సింగ్ చేస్తున్నారు. మరొకరు బిజినెస్ చేస్తున్నారు. ఇంకొకరు కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు. ఇంకొకరు ప్రభుత్వ ఉద్యోగం కోసం సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్నారు. మరొకరు ఒక కెరీర్ నుంచి ఇంకో కెరీర్‌కి మారుతున్నారు.

ఇవన్నీ ఫెయిల్యూర్స్ కావు. ఇవి మన జీవితాన్ని మనకు నచ్చిన విధంగా నిర్మించుకునే ప్రయత్నాలు.

అయితే ఒక విషయం మాత్రం గుర్తుంచుకోవాలి. 25కి సెటిల్ కాలేదు.. కాబట్టి ఏం కాదు అని చెప్పుకుంటూ లక్ష్యం లేకుండా ఉండటం కూడా సరైనది కాదు. 25కి ఇల్లు లేకపోవచ్చు. పెద్ద జీతం లేకపోవచ్చు. పెళ్లి కాకపోవచ్చు. కానీ ఏం సాధించాలి? ఏం నేర్చుకోవాలి? ఎటు వెళ్లాలి? అనే దానిపై క్లారిటీ తెచ్చుకోవాల్సిన సమయం మాత్రం ఇదే.

ఒక స్కిల్ నేర్చుకోవచ్చు. ఉద్యోగం మార్చుకోవచ్చు. కొత్త బిజినెస్ ప్రయత్నించవచ్చు. ఫెయిల్ అయితే మళ్లీ మొదలుపెట్టవచ్చు. అవసరమైతే మన ప్లాన్‌ను పూర్తిగా మార్చుకోవచ్చు.

ఎందుకంటే 25 అనేది డెడ్‌లైన్ కాదు. అది జీవితానికి వచ్చిన మొదటి పెద్ద మలుపు.

మీకు 25 వచ్చిందా? ఇంకా జాబ్ సెటిల్ కాలేదా? డబ్బు పెద్దగా సంపాదించలేకపోతున్నారా? పెళ్లి కాలేదా? సొంత ఇల్లు లేదా? పర్లేదు. మీ కథ ఇంకా పూర్తికాలేదు.

ఇప్పటివరకు ఏం సాధించలేదన్న దానికంటే.. ఇక నుంచి ఏం చేయబోతున్నారన్నదే ముఖ్యం. ఎందుకంటే ఒక పుస్తకంలో 25వ పేజీ దగ్గరికి వచ్చి.. కథ అయిపోయింది అని ఎవరూ అనుకోరు. మీ జీవితం కూడా అంతే. 25 ఏళ్లు వచ్చాయంటే.. ఆలస్యం కాలేదు. మీ అసలు కథ ఇప్పుడే మొదలవుతోంది. ఆల్ ది బెస్ట్ జెన్ జీ బ్యాచ్.

#Youth#Gen Z#Youngsters#Career#Life Goals#Success#Age 25#Career Pressure#Youth Problems#Self Growth#Motivation#Life Advice#Social Media#Telugu Youth#Lifestyle
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి