తిరుమల తిరుపతి దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. ఎక్కడ చూసినా గోవింద నామస్మరణలతో మారుమోగుతున్నాయి. వర్షాలు పెద్దగా లేకపోవడంతో భక్తులు తిరుమలకు వెళ్తున్నట్టు సమాచారం.ఇప్పటికే అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోయినట్టు సమాచారం. విపరీతంగా భక్తులు వస్తుండటంతో అధికారులు సైతం ఏర్పాట్లు చేయలేక ఇబ్బందులు పడుతున్నట్టు తెలుస్తోంది. ఇక భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని వీవీఐపీ దర్శనాలకు టీటీడీ బ్రేక్ ఇచ్చినట్టు సమాచారం.
శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనం కోసం పలు రాష్ట్రాల నుంచి భక్తులు తిరుమలకు వెళ్తున్నారు. దీంతో తిరుమల కొండ మీద విపరీతంగా భక్తుల రద్దీ నెలకొంది. ఉచిత దర్శనం కోసం ఎదురుచూస్తున్న భక్తుల కారణంగా అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. ఆక్టోపస్ బిల్డింగ్ వరకు లైన్‌లో భక్తులు వేచి చూస్తున్నట్టు సమాచారం. విడతల వారీగా గేట్లు తెరిచి దర్శనం కోసం పంపిస్తున్నట్టు తెలుస్తోంది.
ఉదయం 8 గంటల తరువాత సర్వదర్శనం కోసం వెళ్లే భక్తులకు 20 నుంచి 24 గంటల సమయం పడుతోందని తెలుస్తోంది.ఇక రూ.300 శీఘ్రదర్శనానికి 3 నుంచి 5 గంటల సమయం పడుతోందని సమాచారం.ఇక సర్వ దర్శనమ్ టోకెన్ పొందిన భక్తులకు 5 నుండి 7 గంటల సమయం పడుతోందని టీటీడీ వెల్లడించింది.నిన్న శ్రీవారిని 87,658 భక్తులు దర్శించుకోగా.. 40,606 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. ఇక స్వామి వారి హుండీ ఆదాయం నిన్న ఒక్కరోజే రూ.4.13 కోట్లు వచ్చినట్టు ఆలయ అధికారులు వెల్లడించారు.












