రీల్స్ మోజులో పడిన కొందరు ప్రపంచాన్ని మైమరిచిపోతున్నారు. వ్యూస్, లైక్స్ కోసం బంధాలు, బంధుత్వాలు, వ్యక్తులను లెక్కచేయడం లేదు. రీల్స్‌లో ఫేమస్ అవ్వాలనే దానిమీద వారికి పెద్దగా ఆసక్తి ఉంటోందని నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. చుట్టుపక్కల ఏం జరుగుతోంది? ఎక్కడ ఉన్నాం? మన చేష్టల వలన ఎవరైనా ఇబ్బంది పడతున్నారా? అనే ఆలోచన సైతం వారికి రావడం లేదని సోషల్ మీడియా వేదికగా పలువురు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.
తాజాగా ఓ మహిళ రీల్స్ మోజులో పడి తన కుమారుడి జీవితాన్ని రిస్కులో పడేసింది. ఈ దృశ్యం వీడియాలో స్పష్టంగా కనిపిస్తోంది. ఓ ఫ్లై ఓవర్ మీద రీల్ చేయడం కోసం వివాహిత తన కొడుకుని రోడ్డు మీద వదిలేసింది. ఆపై కొడుకుని పట్టించుకోకుండా రీల్ చేసుకుంటూ ముందుకు వెళ్లిపోయింది. మొత్తం వీడియో మీదే నిమగ్నమైపోయింది.
అయితే, ఆ చిన్నారి పాకుతూ వంతెన అంచు దాకా వెళ్లాడు. అయినా ఆ తల్లి తిరిగి చూడలేదు.ఏమాత్రం పట్టించుకోకుండా రీల్స్ మత్తులో మునిగిపోయింది. వెనకాలే ఉన్న ఆమె భర్త గమనించి పిల్లాడిని వెంటనే పట్టుకోవడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో జరగగా.. ఆలస్యంగా వెలుగుచూసింది.
https://x.com/pulsenewsbreak/status/2086275773636219210?s=20
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. తండ్రి వెంటనే వచ్చి పిల్లాడిని పట్టుకోకపోతే చిన్నారి జీవితం ఏమై ఉండేదని ప్రశ్నిస్తున్నారు. బిడ్డ కన్నా రీల్ ఎక్కువైపోయిందా? అంటూ ఆ వివాహిత మీద నెటిజన్లు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.












