జీవితం అంటే ఆశ నిరాశల మధ్య సాగే ప్రయాణం.. ఒక్కో సారి కొందరి బ్రతుకులో వెలుగు వచ్చినట్టే అనిపిస్తుంది. కానీ చీకటి వెన్నంటే ఉంటుందని గుర్తించలేకపోతుంది.. అందులోనూ సినిమా ఇండస్ట్రీ అంటే ఎప్పుడు ఎవరి పరిస్థితి ఎలా మారుతుందో చెప్పలేం. ఒకప్పుడు శిఖరంపై ఉన్నవారు ఒక్కసారిగా కిందికి రావచ్చు.. అవకాశాల కోసం ఎదురుచూసినవారు అనూహ్యంగా స్టార్‌డమ్ కూడా అందుకోవచ్చు..
టైమ్ అంటారా.. డెస్టినీ అంటారా.. విధి రాత అంటారా.. ఏదైనా కావచ్చు. కానీ పరిస్థితులు ఎలా ఉన్నా కష్టపడుతూ ముందుకు సాగేవాడే అసలు విజేత.. అలాంటి వ్యక్తుల్లో నటుడు మారిముత్తు ఒకరు. 2008లో వచ్చిన తమిళ కల్ట్ క్లాసిక్ సుబ్రమణ్యపురం మూవీలో మారిముత్తు నటనకు మంచి గుర్తింపు వచ్చింది. కానీ అవకాశాలను మాత్రం అందివ్వలేక పోయింది.
ఇక పేద కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన మారిముత్తు.. చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయారు. మూడో తరగతిలోనే చదువుకు స్వస్తి చెప్పి.. లైట్లు, మైక్ సెట్లు రిపేర్ చేసే షాపులో పనిచేశారు. సినిమాపై ఉన్న మక్కువతో చెన్నైకి వెళ్లారు. అక్కడ పనిచేస్తున్న సమయంలో సహచరులు తీసిన ఓ ఫొటో ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది. సుబ్రమణ్యపురం సినిమాలో నటించడానికి అవకాశాన్ని తెచ్చింది..
ఈ క్రమంలో సుబ్రమణ్యపురం సినిమా హిట్ టాక్ అందుకోవడంతో తన కెరీర్ మలుపుతిరుగుతుందని మారిముత్తు ఆశించారు. కానీ పరిస్థితులు మరోలా ఉన్నాయి. అవకాశాలు రాకపోవడంతో కుటుంబాన్ని పోషించేందుకు రేడియో మెకానిక్‌గా పనిచేశారు. తరువాత ఓ డొక్కు ఆటో కొనుక్కుని, తనే రిపేర్లు చేసుకుంటూ దాన్ని తోలేవాడు.. ఆయన ఆటో రిపేర్లు, డ్రైవింగ్‌కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయినా.. వాటి ద్వారా పెద్దగా ఆదాయం మాత్రం రాలేదు.
అయినా మారిముత్తు ఎప్పుడు నిరాశపడలేదు. ఎప్పుడో ఒకరోజు సుబ్రమణ్యపురం-2 లో అవకాశం వస్తుంది అంటూ నవ్వుతూ ముందుకు సాగుతున్నారు.. ఎక్కడో ప్రయాణం మొదలై, ఏవేవో మలుపుల మధ్య కుదుపులతో సాగుతున్న మారిముత్తు.. తన జీవితంలో నిజమైన హీరో.. సినిమా అవకాశాలు లేక అడ్డదారులు తొక్కుతున్న నేటి సమాజంలో ఆయన కథ వారందరికీ ఆదర్శం..












