తెలంగాణ బీజేపీకి ఎన్డీయే మిత్రపక్షమైన జనసేన పార్టీ బిగ్‌షాక్ ఇచ్చింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తాము ఒంటరిగానే పోటీ చేస్తామని ఇటీవల బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావు ప్రకటించిన విషయం తెలిసిందే.తాజాగా దీనికి జనసేన స్టేట్ చీఫ్ శంకర్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు.జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పొత్తు అంశం రాంచందర్ రావు పరిధిలోని అంశం కాదని.. జనసేన చీఫ్ పవన్ కల్యాణ్, బీజేపీ జాతీయ నాయకత్వం చూసుకుంటుందని కీలక వ్యాఖ్యలు చేశారు.
దీనికి తోడు బీజేపీ నుంచి పలువురు కీలక నేతలు జనసేన పార్టీ కండువా కప్పుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి చేరికలు ఉంటాయని ఆ పార్టీ నాయకత్వం భావిస్తుంటే.. కమలం పార్టీ నేతలే ఇతర పార్టీలోకి వెళ్లడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపింది. వీరంతా క్షేత్రస్థాయిలో ఇంతకాలం బీజేపీ కోసం సీరియస్‌గా పనిచేసిన నేతలు అని తెలుస్తోంది.జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆహ్వానం మేరకు బీజేపీ నేతలు జనసేనలోకి వెళ్లినట్టు సమాచారం.
ఏపీ ప్రభుత్వంలో జనసేన పార్టీ కీ రోల్ పోషిస్తున్నది.. ఇటీవల కొండగట్టు పర్యటనలో భాగంగా ఇకమీదట తెలంగాణలోనూ పార్టీ మీద ఫోకస్ చేస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా కృషి చేస్తామన్నారు. ఇక్కడి సమస్యలపైనా దృష్టి పెట్టి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామన్నారు. ఈ క్రమంలోనే సంస్థాగతంగా పార్టీ బలోపేతంపై జనసేన సీరియస్‌గా దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ఓ వైపు జిల్లాల్లో కార్యకర్తల ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తూనే మరోవైపు చేరికలపై ఫోకస్ పెట్టింది.
ఈ క్రమంలోనే నిన్న పవన్ కళ్యాణ్ సమక్షంలో 16 మంది నేతలు జనసేన పార్టీ కండువా కప్పుకున్నారు. అందులో నలుగురు బీజేపీ, దాని అనుబంధ సంస్థలకు పనిచేసిన వారుండటం గమనార్హం. మహేశ్వరం సెగ్మెంటులో బీజేపీ నేత హైందవి రెడ్డి పాండెం, సనత్ నగర్‍కు చెందిన అనిల్ గీడికపల్లి, రవి టెండూల్కర్, బీజేపీ యువజన మోర్చాకు చెందిన ఇల్లందు సెగ్మెంట్ నేత గొగ్గల నాగ శ్రావంతి జనసేనలో చేరారు.
వీరితో పాటే మరికొందరు వివిధ పార్టీలకు నేతలు, వివిధ సామాజిక ఉద్యమకారులు పవన్ ఆహ్వానం మేరకు ఆ పార్టీలో చేరారు. అయితే, మరికొద్దిరోజుల్లో బడా నేతలు బీజేపీలో చేరుతారని జాతీయనాయకత్వం హింట్ ఇవ్వగా..రాష్ట్రంలో ఇందుకు రివర్స్‌గా జరగడంతో కమలం పార్టీ శ్రేణులు షాక్‌లో ఉన్నట్టు సమాచారం.












