సీపీ సజ్జనార్‌పై కస్టడీ, ఎన్‌కౌంటర్ ఆరోపణలు
ఆరు సెక్షన్లు, నిబంధనల ఉల్లంఘనపై ప్రశ్నలు
కేసును సీబీ-సీఐడీకి బదిలీ చేయాలని డిమాండ్
ఐపీఎస్ ప్రొబేషనర్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్ వ్యవహారంలో హైదరాబాద్ పోలీసుల తీరుపై సీబీఐ మాజీ డైరెక్టర్ ఎం.నాగేశ్వరరావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసు దర్యాప్తు నిష్పాక్షికంగా జరగడం లేదని ఆరోపిస్తూ తెలంగాణ రాష్ట్ర డెవలప్‌మెంట్ అండ్ లా అండ్ ఆర్డర్ డీజీపీకి ఓ సుదీర్ఘమైన లేఖ రాశారు. ఈకేసులో విచారణాధికారులు చట్టబద్ధమైన అరెస్ట్ నిబంధనలను పాటించలేదని, అత్యంత తొందరపాటుతో వ్యవహరించారని పేర్కొన్నారు. ఈ మొత్తం వ్యవహారాన్ని స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారింపజేయాలని ఆయన కోరారు.
లేఖలో పేర్కొన్న వివరాల ప్రకారం.. ఫిర్యాదు చేసిన మహిళా అధికారిణి (2024 బ్యాచ్ IPS), ఉదయ్ కృష్ణా రెడ్డి (2025 బ్యాచ్ IPS)ల మధ్య ఉన్నది సమ్మతితో కూడిన వ్యక్తిగత ప్రేమ సంబంధమని తెలిపారు. సదరు అధికారిణి తమిళనాడు కేడర్‌కు చెందిన ఒక ఐఏఎస్(IAS) అధికారిని వివాహం చేసుకున్న తర్వాత, ఆమె తన కేడర్ బదిలీ కోసం ఈపాత సంబంధాన్ని సమ్మతి లేనిదిగా(non-consensual) చిత్రీకరించారని ఆరోపించారు. ప్రాథమిక ఫిర్యాదులలో లేని లైంగికదాడి, హత్యాయత్నం వంటి తీవ్రమైన సెక్షన్లను రిమాండ్ నివేదికలో ఆ తర్వాత చేర్చడంపై అనుమానాలు వ్యక్తం చేశారు.
ఈ కేసులో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ ప్రత్యక్ష జోక్యం చేసుకోవడంపై నాగేశ్వరరావు తీవ్ర ఆరోపణలు చేశారు. కోర్టు ముందు ఉదయ్ కృష్ణారెడ్డి విలపిస్తూ చెప్పిన వివరాల ప్రకారం.. సీసీటీవీ కెమెరాలు లేని ప్రాంతాల్లో తనను విచారించారని, సీపీ సజ్జనార్ స్వయంగా వచ్చి బెదిరింపులకు దిగడమే కాకుండా ఎన్‌కౌంటర్ చేస్తామని హెచ్చరించారని లేఖలో ప్రస్తావించారు. గతంలో వరంగల్, సైబరాబాద్‌లలో సజ్జనార్ హయాంలో జరిగిన ఎన్‌కౌంటర్ల నేపథ్యాన్ని గుర్తుచేస్తూ, ఈ బెదిరింపులను తేలికగా తీసిపారేయలేమని స్పష్టం చేశారు.
ఇటీవల ప్రశాసన్ నగర్‌లో జరిగిన రిటైర్డ్ IPS అధికారి భార్య దారుణ హత్య కేసును ఛేదించడంలో చూపని అత్యుత్సాహాన్ని, నగర పోలీస్ కమిషనర్ ఈ వ్యక్తిగత వివాదాల కేసులో ఎందుకు చూపిస్తున్నారని నాగేశ్వరరావు ప్రశ్నించారు. ఫిర్యాదుదారు, సీపీ ఇద్దరూ ఒకే రాష్ట్రానికి చెందినవారు కావడంతో ఏవైనా ప్రభావాలు పనిచేస్తున్నాయా అనే కోణంలోనూ విచారణ జరగాలని విజ్ఞప్తి చేశారు. అరెస్ట్ వెనుక ఉన్న అసలు కారణాలను, పోలీసుల ప్రవర్తనను సమగ్రంగా తనిఖీ చేయాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ నేపథ్యంలో, కేసు దర్యాప్తును తక్షణమే సీబీ-సీఐడీ (CB-CID) లేదా మరొక స్వతంత్ర సంస్థకు బదిలీ చేయాలని నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. దర్యాప్తుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్, ఎలక్ట్రానిక్ ఆధారాలు డిలీట్ కాకుండా భద్రపరచాలని, సీపీ సజ్జనార్ వైఖరిపై శాఖాపరమైన విచారణకు ఆదేశించాలని కోరారు. చట్టానికి ఎవరూ అతీతులు కారని, న్యాయస్థానాలు మాత్రమే నేర నిర్ధారణ చేయాలని పేర్కొంటూ లేఖ ప్రతిని సోషల్ మీడియా వేదికగానూ విడుదల చేశారు.












