రాజకీయాలు

రాజకీయాల్లో ర్యాలీలు తగ్గి.. రీల్స్ ఎందుకు పెరిగాయి?

రచన: Kashi9 నిమిషాల పఠనం

ముఖ్యంగా యువత రాజకీయాలను చూసే విధానం ఈ మార్పుకు ప్రధాన కారణం. ఈ రోజుల్లో ఒక యువ ఓటరు రాజకీయ నాయకుడి గంటసేపు ప్రసంగం వినకపోవచ్చు. కానీ అదే నాయకుడి 30 సెకన్ల వీడియోను రీల్‌గా చూస్తాడు. నచ్చితే షేర్ చేస్తాడు. నచ్చకపోతే కామెంట్ చేస్తాడు.

ఒక‌ప్పుడు భారీ ర్యాలీలు

ఇప్పుడేమో చిన్న చిన్న రీల్స్

ఇండియాలో మారుతున్న పొలిటిక‌ల్ ట్రెండ్స్

యూత్ ఓట‌ర్లే ల‌క్ష్యంగా పార్టీల అడుగులు

ఒకప్పుడు రాజకీయ నాయకుడు ప్రజల్లోకి వెళ్లాలంటే భారీ బహిరంగ సభ పెట్టాలి. వేల మందిని సమీకరించాలి. భారీ కటౌట్లు, ఫ్లెక్సీలు, మైకుల హోరు, గంటల తరబడి ప్రసంగాలు.. ఇదే ఎన్నికల ప్రచారానికి ప్రధాన ఆయుధం. కానీ ఇప్పుడు సీన్ క్రమంగా మారుతోంది. ఒక నాయకుడి గంట ప్రసంగం కంటే.. అదే ప్రసంగంలోని 20 సెకన్ల క్లిప్‌కు ఎక్కువ రీచ్ వస్తోంది. ఒక సభకు వచ్చిన జనాల కంటే.. ఆ సభలో తీసిన ఒక రీల్‌ను చూసే వాళ్లు లక్షల్లో ఉండొచ్చు. అందుకే రాజకీయ పార్టీల ప్రచార వ్యూహంలో రీల్స్, షార్ట్స్, మీమ్స్, ఇన్‌స్టాగ్రామ్ కంటెంట్‌కు ప్రాధాన్యం పెరుగుతోంది.

అయితే ర్యాలీలు పూర్తిగా తగ్గిపోయాయి అని చూడటం కరెక్ట్ కాదు. తెలంగాణలోనే బీఆర్‌ఎస్‌ ఇటీవల క్షేత్రస్థాయి పర్యటనలు, కార్యకర్తల సమావేశాలు, సమస్యలపై ఉద్యమాలను మళ్లీ పెంచుతోంది. అంటే గ్రౌండ్ పాలిటిక్స్ ఇంకా అవసరమే. కానీ ఆ గ్రౌండ్ యాక్షన్‌కు డిజిటల్ యాంప్లిఫికేషన్ జత అయింది. నాయకుడు ఒక జిల్లాలో పర్యటిస్తే.. అక్కడ జరిగిన సమావేశం కేవలం అక్కడి ప్రజలకే పరిమితం కాకుండా, కొన్ని గంటల్లోనే సోషల్ మీడియాలో రాష్ట్రవ్యాప్తంగా కనిపించాలి. ఇదే కొత్త రాజకీయ లెక్క.

శాసిస్తున్న యువ‌త‌

ముఖ్యంగా యువత రాజకీయాలను చూసే విధానం ఈ మార్పుకు ప్రధాన కారణం. ఈ రోజుల్లో ఒక యువ ఓటరు రాజకీయ నాయకుడి గంటసేపు ప్రసంగం వినకపోవచ్చు. కానీ అదే నాయకుడి 30 సెకన్ల వీడియోను రీల్‌గా చూస్తాడు. నచ్చితే షేర్ చేస్తాడు. నచ్చకపోతే కామెంట్ చేస్తాడు. కొన్నిసార్లు ఆ వీడియోపైనే మరో వీడియో చేస్తాడు. అంటే రాజకీయ ప్రచారం ఇక వన్‌వే కమ్యూనికేషన్ కాదు.. ప్రజలే దానికి కంటెంట్‌ను జోడించే ప్రక్రియగా మారుతోంది. ఇన్‌స్టాగ్రామ్‌ ఇప్పుడు యువతకు రాజకీయ చర్చ జరిగే ఒక కొత్త “పబ్లిక్ స్క్వేర్”గా మారుతోందని ఇటీవలి విశ్లేషణలు కూడా చెబుతున్నాయి.

పరీక్షల లీకులు, ఉద్యోగాలు, విద్య వంటి అంశాలపై యువతలో వచ్చిన ఆగ్రహం కాక్రోచ్ జనతా పార్టీ వంటి డిజిటల్-ఫస్ట్ ఉద్యమాలకు బలం ఇచ్చింది. ఈ ఉద్యమం సోషల్ మీడియా, ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వేగంగా విస్తరించింది. దీనికి స్పందనగా ప్రధాని నరేంద్ర మోదీ కూడా యువతను చేరుకునేలా ఇన్‌స్టాగ్రామ్‌లో మరింత రిలేటబుల్ కంటెంట్‌పై దృష్టి పెట్టారు. సెల్ఫీ తరహా వీడియోలు, హ్యూమర్, పాప్ కల్చర్ రిఫరెన్స్‌లను ఉపయోగించే ఈ కొత్త కమ్యూనికేషన్ స్టైల్‌పై అంతర్జాతీయంగానూ చర్చ జరిగింది.

ఇక్కడే అసలు రాజకీయ గేమ్ మొదలవుతోంది. ఒకప్పుడు నాయకులు ప్రజలకు ఏం చెప్పాలో నిర్ణయించేవారు. ఇప్పుడు ప్రజలు ఏం చూడాలనుకుంటున్నారో అర్థం చేసుకుని నాయకులు కంటెంట్ తయారు చేయాల్సి వస్తోంది. ఏ అంశం ట్రెండ్ అవుతోంది? ఏ మాట వైరల్ అవుతోంది? ఏ వీడియోకు స్పందన వస్తోంది? ఏ మీమ్‌కు యువత కనెక్ట్ అవుతోంది? వీటిని గమనించి పార్టీల డిజిటల్ టీమ్‌లు వెంటనే కంటెంట్ తయారు చేస్తున్నాయి. అంటే రాజకీయాల్లో ఇప్పుడు నాయకుడి పక్కనే కంటెంట్ స్ట్రాటజిస్ట్, వీడియో ఎడిటర్, సోషల్ మీడియా టీమ్, డిజిటల్ ఇన్‌ఫ్లుయెన్సర్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు.

తెలంగాణ‌లో సోష‌ల్ వార్

తెలంగాణలో కూడా ఈ డిజిటల్ పోటీ స్పష్టంగానే కనిపిస్తోంది. కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ మధ్య రాజకీయ విమర్శలు ఇప్పుడు సభలు, ప్రెస్‌మీట్లకే పరిమితం కావడం లేదు. ఒక పార్టీ చేసిన ఆరోపణకు మరో పార్టీ సోషల్ మీడియాలో వీడియోతో సమాధానం ఇవ్వడం, నాయకుల వ్యాఖ్యలను కట్ చేసి వైరల్ చేయడం, ఒకే అంశంపై ప్రత్యర్థి పార్టీని టార్గెట్ చేస్తూ డిజిటల్ నారేటివ్ తయారు చేయడం సాధారణమైపోయింది. రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ మధ్య రాజకీయ పోరు మరింత దూకుడుగా మారుతున్న నేపథ్యంలో ఈ సోషల్ మీడియా యుద్ధం కూడా కీలకంగా మారుతోంది.

అయితే రీల్ వైరల్ కావడం అంటే ఓటు వచ్చేసిందని కాదు. ఇది చాలా ముఖ్యమైన విషయం. సోషల్ మీడియాలో లక్షల వ్యూస్ వచ్చిన నాయకుడికి క్షేత్రస్థాయిలో అదే స్థాయిలో మద్దతు ఉండకపోవచ్చు. ఒక వీడియో చూసి నవ్విన వ్యక్తి తప్పనిసరిగా ఆ పార్టీకి ఓటు వేయాల్సిన అవసరం లేదు. అందుకే ర్యాలీలను పూర్తిగా పక్కన పెట్టి రీల్స్‌పై మాత్రమే ఆధారపడటం ఏ పార్టీకి సాధ్యం కాదు. గ్రౌండ్‌లో క్యాడర్.. ప్రజల్లో నమ్మకం.. డిజిటల్‌లో నారేటివ్.. ఈ మూడు కలిసినప్పుడే రాజకీయ ప్రచారం ప్రభావవంతంగా మారుతుంది.

భ‌విష్య‌త్ ఏంటి..?

ఇకముందు పరిస్థితి మరింత ఆసక్తికరంగా ఉండబోతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్‌ఫేక్‌లు, డిజిటల్ అవతార్లు, బహుభాషా వీడియోలు రాజకీయ ప్రచారాన్ని మరింత మార్చబోతున్నాయి. ఎన్నికల సంఘం కూడా 2026లో AIతో రూపొందించిన లేదా మార్చిన ప్రచార కంటెంట్‌పై లేబులింగ్, పారదర్శకతకు సంబంధించిన నిబంధనలను స్పష్టం చేసింది. అంటే టెక్నాలజీ రాజకీయాల్లోకి ఎంత వేగంగా వస్తోందో.. దాన్ని నియంత్రించాల్సిన అవసరం కూడా అంతే వేగంగా పెరుగుతోంది.

కాబట్టి భవిష్యత్ రాజకీయాల్లో ర్యాలీలు పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి లేదు. కానీ ర్యాలీ తర్వాత జరిగే అసలు పోరాటం మాత్రం మొబైల్ స్క్రీన్‌పైకి వచ్చేసింది. నిన్నటి రాజకీయాల్లో మైక్‌ ఎంత ముఖ్యమో.. నేటి రాజకీయాల్లో మొబైల్ అంతే ముఖ్యం. నిన్న నాయకుడు ప్రజల ముందుకు వెళ్లేవాడు. ఇప్పుడు నాయకుడి వీడియోనే నేరుగా ప్రజల చేతిలో ఉన్న ఫోన్‌లోకి వెళ్తోంది.

అందుకే రేపటి ఎన్నికల్లో అసలు ప్రశ్న ఎవరు పెద్ద సభ పెట్టారు? అనేది మాత్రమే కాదు.. ఎవరి నారేటివ్ ప్రజల మొబైల్‌లో ఎక్కువసేపు నిలిచింది? అనేదే కావచ్చు.

#political reels#political trends India#Indian politics#social media politics#political campaigns#Instagram reels#YouTube shorts#youth voters#Gen Z voters#digital politics#election campaign#political marketing#BJP#Congress#BRS#TDP#YSRCP#Telangana politics#Andhra Pradesh politics#AI politics#social media election campaigns
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి