నల్సార్ స్నాతకోత్సవానికి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించడంపై విద్యార్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు. స్నాతకోత్సవ తేదీ ఇంకా ఖరారు కాలేదని, ముఖ్య అతిథి ఎంపికపై కూడా తుది నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్న విద్యార్థులు.. ముందుగానే తమ అభిప్రాయాలను విశ్వవిద్యాలయ యాజమాన్యం దృష్టికి తీసుకొచ్చారు.
2026 జూలై 20న జంతర్ మంతర్ వద్ద జరిగిన చలో పార్లమెంట్ నిరసనలో పోలీసుల చర్యలపై దాఖలైన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించిన అంశాన్ని విద్యార్థులు తమ లేఖలో ప్రస్తావించారు. అప్పటి విచారణ సందర్భంగా జస్టిస్ సూర్యకాంత్ చేసినట్లు నివేదికల్లో వచ్చిన కొన్ని వ్యాఖ్యలు తమకు ఆందోళన కలిగించాయని తెలిపారు.
రాజ్యాంగ హక్కుల కాపాడటం, న్యాయాన్ని, ప్రజల ఫిర్యాదులను గౌరవంగా వినడం వంటి విలువలను న్యాయ విద్యార్థులుగా తాము నేర్చుకున్నామని.. అలాంటి విలువలకు అనుగుణంగా స్నాతకోత్సవంలో ముఖ్య అతిథి ఎంపిక ఉండాలని కోరారు. అందువల్ల జస్టిస్ సూర్యకాంత్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించే నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని, తుది నిర్ణయానికి ముందు పట్టభద్రుల బ్యాచ్ అభిప్రాయాలను తీసుకోవాలని నల్సార్ విద్యార్థులు విశ్వవిద్యాలయానికి విన్నవించారు.












