తమపై అమెరికా ముమ్మరం చేసిన ఆర్థిక యుద్ధంలో ఏ దేశమైనా భాగస్వామ్యం అయితే, వాటిని కూడా తమ శత్రువుల జాబితాలోనే చేరుస్తామని ఇరాన్ హెచ్చరించింది. అమెరికాతో కలిసి తాలను ఒంటరి చేసేందుకు ప్రయత్నించే దేశాల ప్రయోజనాలే లక్ష్యంగా దాడులు నిర్వహిస్తామని తేల్చిచెప్పింది. ఒకవేళ పొరుగు దేశాలు కూడా ఈ దిగ్బంధనంలో భాగమైతే, ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హర్మూజ్ జలసంధి గుండా ఒక్క చుక్క నూనె కూడా బయటకు వెళ్లకుండా పూర్తిగా అడ్డుకుంటామని స్పష్టం చేసింది.
ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ మొహ్సెన్ రెజాయీ శనివారం ఒక ప్రభుత్వ టెలివిజన్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ హెచ్చరికలు చేశారు. అమెరికాకు మద్దతు ఇస్తున్న దేశాలతో ముందుగా దౌత్యపరమైన చర్చలు జరిపి ఈ వివాదానికి దూరంగా ఉండాలని కోరుతామని ఆయన తెలిపారు. అయినప్పటికీ వారు తమ మాట వినకపోతే, వారి దేశీయ ప్రయోజనాలపై దాడులు చేయడం మినహా తమకు వేరే ప్రత్యామ్నాయం ఉండదని హెచ్చరించారు. దశాబ్దాలుగా అమెరికా విధిస్తున్న కఠిన ఆంక్షలను ఎదుర్కొంటూ, అంతర్జాతీయంగా చమురు అమ్మకాలను ఎలా కొనసాగించాలో తమకు అనుభవం ఉందని రెజాయీ ధీమా వ్యక్తం చేశారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల చేసిన వ్యాఖ్యల నేపథ్యంలోనే ఇరాన్ నుంచి ఈ తీవ్ర స్పందన వెలువడింది. ఇరాన్‌కు ఆర్థికంగా జీవనాధారం కల్పించే ఏ దేశం పైనైనా చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో కఠిన ఆర్థిక చర్యలు తీసుకుంటామని ట్రంప్ ప్రకటించారు. ఈ పరిణామాన్ని 'ఎకనామిక్ వార్‌ఫేర్' మరియు 'ఎకనామిక్ డీ-డే'గా అభివర్ణిస్తూ ఆయన సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. ట్రంప్ ప్రకటనపై ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాఘ్చీ కూడా స్పందిస్తూ, అమెరికా అమలు చేస్తున్న ఈ తాజా ఆర్థిక ఆపరేషన్ కూడా గతంలోని వాటిలాగే పూర్తిగా విఫలమవుతుందని స్పష్టం చేశారు. గతంలో అమెరికా ప్రయోగించిన 'గరిష్ఠ ఒత్తిడి', 'కఠిన ఆంక్షల' వ్యూహాలు ఏమాత్రం ప్రభావం చూపలేదని ఆయన 'ఎక్స్' వేదికగా గుర్తుచేశారు.
గత ఏడాది జూన్‌లో ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలను తగ్గించే దిశగా అమెరికా-ఇరాన్ దేశాల మధ్య ఒక అవగాహన ఒప్పందం కుదిరినప్పటికీ, తాజా పరిణామాలతో ఇరు దేశాల మధ్య మళ్లీ దూరం పెరిగింది. ఈ తాజా ఘర్షణ వాతావరణం కారణంగా తుది ఒప్పందంపై జరగాల్సిన కీలక చర్చల భవితవ్యం ప్రస్తుతం పూర్తిగా అగమ్యగోచరంగా మారింది. మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఈ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తున్నాయి.


