మాట అనేది కత్తికంటే పదునైనది. బ్రతికి ఉండగా జీవచ్ఛవంలా మార్చేది.. అందుకే మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడమని అనుభవజ్ఞులు చెబుతారు. అలాగే మాటే మంత్రం అనే నానుడి ఉంది. ఈ మాట చెప్పడం వెనుక కేవలం లోకజ్ఞానమే కాదు, మహోన్నతమైన ఆధ్యాత్మిక రహస్యం కూడా దాగి ఉందని జ్ఞానవంతులు చెబుతారు. సృష్టి ఆరంభంలో మొదట వెలువడింది శబ్దమే అని, దీనినే శాస్త్రాలు "శబ్ద బ్రహ్మం" అని పిలిచాయని పేర్కొంటారు.
మనం నోటి నుంచి పలికే ప్రతి మాట ఒక నిర్దిష్టమైన శబ్ద తరంగాన్ని, కంపనాన్ని సృష్టిస్తుంది. మంత్రం అంటే ఏదో అపరిచితమైన శబ్దం కాదు.. "మననాత్ త్రాయతే ఇతి మంత్రః అంటే మనస్సును పవిత్రం చేసి, ఆపదలనుంచి రక్షించేది అని అర్థం. మనం మాట్లాడే ప్రతి పదం మనలోని, మన చుట్టూ ఉన్న పరిసరాలలోని శక్తిని ప్రభావితం చేస్తుంది కాబట్టే మాటను మంత్రంతో పోల్చారని పండితులు చెబుతారు..
ఆధ్యాత్మిక కోణంలో చూస్తే, బాధలో ఉన్న వారికి.. తోటి మనిషి నోటి నుంచి వచ్చే ప్రేమతో కూడిన ఓదార్పు మాటే ఒక దివ్యమైన మంత్రంలా పనిచేసి ధైర్యాన్ని, ప్రశాంతతను ఇస్తుంది. మనో బలాన్ని కలిగిస్తుంది. అదే సమయంలో క్రోధంతో, స్వార్థంతో అనే పరుషమైన మాట ఒక ఆయుధంలా మారి ఎదుటివారి హృదయాన్ని గాయపరుస్తుంది. మన మహర్షులు సత్యం, అహింస, ప్రియమైన సంభాషణను పరమ ధర్మాలుగా చెప్పారు.
భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ వాఙ్మయ తపస్సు గురించి చెబుతూ, ఎదుటివారికి ఉద్వేగం కలిగించనిది, సత్యమైనది, ప్రియమైనది, హితకరమైనది అయిన సంభాషణ తపస్సు అని స్పష్టం చేశారు. ఒక సాధకుడు తన నోటిని, నాలుకను ఎలా ఉపయోగిస్తున్నాడనే దానిపైనే అతని ఆధ్యాత్మిక ఎదుగుదల ఆధారపడి ఉంటుంది. నాలుక సరస్వతీ దేవి స్థానం. మనం పలికే మాట సత్యంతో, ప్రేమతో కూడుకున్నప్పుడు మన వాక్కు సిద్ధించి "వాక్ శుద్ధి" కలుగుతుంది.
అప్పుడు మనం పలికే ప్రతీ మాట పాజిటివ్ ఎనర్జీని కలిగి నిజమవుతుంది. వాక్కు శుద్ధిగా ఉన్నప్పుడు పలికిన మాటలకు శక్తి చేకూరుతుంది.. అందుకేప్రాచీన కాలంలో మహర్షుల, మహనీయుల వాక్కు మంత్రంలా సిద్ధించి, ఆశీర్వాదంలా ఫలించేదని శాస్త్రాలు చెబుతాయి. మనం మాట్లాడే మాట కేవలం గాలిలోకి వెళ్లిపోయే శబ్దం కాదు.. అది మన ఆత్మ యొక్క భావనకు అద్దం పడుతుంది. మధురమైన, నిస్వార్థమైన మాట భగవంతుడికి మనం అర్పించే అతి పెద్ద నైవేద్యం.
అందుకే మన మాటల ద్వారా ఇతరులకు ప్రశాంతతను, ఆనందాన్ని పంచినప్పుడు, ఆ ప్రశాంతతే మంత్రంలా మనల్ని రక్షిస్తుంది. అందుకే ప్రతి మానవుడు తన వాక్కును మంత్రంలా భావించి, పవిత్రంగా, హితవుగా, నిస్వార్థంగా ఉపయోగిస్తూ సమస్త జీవుల పట్ల ప్రేమను వ్యక్తపరచడమే నిజమైన ఆధ్యాత్మిక సాధనగా శాస్త్రాలు చెబుతున్నాయి..
గమనిక: ఇక్కడ అందించిన వివరాలు కేవలం సాంప్రదాయ పురాణ విశ్వాసాలు మరియు ఆధ్యాత్మిక భావనల ఆధారంగా ఇవ్వబడ్డాయి. వీటిని కేవలం మతపరమైన విశ్వాసాల కోణంలోనే చూడాలి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత రంగ నిపుణులను సంప్రదించడం మంచిది.


