* టీపీసీసీ క్రమశిక్షణ కమిటీకి మంత్రి కొండా సురేఖ మరో లేఖ
* నన్ను, నా కుటుంబసభ్యులను టార్గెట్ చేస్తున్నారు
* వారి వెనుకన్న వ్యక్తులను గుర్తించి చర్యలు తీసుకోండి
* కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ మల్లు రవికి మంత్రి విజ్ఞప్తి
Konda Surekha: మంత్రి కొండా సురేఖ తగ్గేదేలే అంటున్నారు. సై అంటే సై అంటూ దూకుడుగా ముందుకెళ్తున్నారు. సీఎం రేవంత్ పై తన కూతురు సుస్మిత చేసిన వ్యాఖ్యలతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెబుతూ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీకి లేఖ రాసిన కొండా సురేఖ.. ఇప్పుడు మరో లేఖాస్త్రం సంధించారు. తనను టార్గెట్ చేసిన వారి వెనుకున్నది ఎవరో తేల్చి వారిపై చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు.
నన్ను, నా కుటుంబాన్ని టార్గెట్ చేశారు
టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ తనకు జారీ చేసిన నోటీసుకు ఇప్పటికే వివరణ సమర్పించినప్పటికీ.. తనను, తన కుటుంబసభ్యులను లక్ష్యంగా చేసుకుని కొందరు కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు బహిరంగంగా అవమానకరంగా మాట్లాడుతున్నారని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖల మంత్రి కొండా సురేఖ ఆవేదన వ్యక్తం చేశారు. వారి వ్యాఖ్యల వెనుక అదృశ్య హస్తం ఉందని ఆరోపించారు. వారి వెనుక ఉండి ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్న అసలు వ్యక్తులు ఎవరో నిష్పాక్షికంగా గుర్తించి, వారిపై కఠినమైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవిని కోరారు మంత్రి సురేఖ. అలాగే తనకు జారీ చేసిన షోకాజ్ నోటీసును వెనక్కి తీసుకోవాలన్నారు.
క్రమశిక్షణ కమిటీ నిర్ణయాన్ని ప్రభావితం చేసే ప్రయత్నం!
పార్టీ క్రమశిక్షణ కమిటీ విచారణ కొనసాగుతున్న సమయంలోనే తనపై బహిరంగంగా విమర్శలు చేయడం, రాజకీయ భవిష్యత్తుపై తీర్పులు ఇవ్వడం, తనపై చర్యలు తీసుకోవాలని మీడియా ముందు డిమాండ్ చేయడం ద్వారా క్రమశిక్షణ కమిటీ స్వతంత్ర నిర్ణయాన్ని ప్రభావితం చేసే ప్రయత్నం జరిగిందా అనే అంశాన్ని కూడా కమిటీ పరిశీలించాలని మంత్రి సురేఖ కోరారు.
పార్టీ నాయకత్వం మౌనం ఆందోళనకరం
“పార్టీ క్రమశిక్షణపై నాకు పూర్తి గౌరవం ఉంది. అదే సమయంలో, ఒక సీనియర్ బీసీ మహిళా నాయకురాలైన నాపై తీవ్ర మాటలతో సామూహిక దాడులు జరుగుతున్నప్పుడు పార్టీ నాయకత్వం మౌనం వహించడం ఆందోళన కలిగిస్తోంది. నా రాజకీయ భవిష్యత్తుపై తీర్పులు ఇస్తూ, చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మీడియా ముందుకు రావడం వెనుకున్న ఉద్దేశాలను కూడా పార్టీ నాయకత్వం పరిశీలించాలి” అని మంత్రి కొండా సురేఖ కోరారు.
కాంగ్రెస్.. ప్రజాస్వామ్య విలువలు, సామాజిక న్యాయం, మహిళా సాధికారత, బలహీన వర్గాల ఆత్మగౌరవానికి కట్టుబడి ఉన్న పార్టీ అని, ఆ విలువలకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై పార్టీ క్రమశిక్షణ నియమావళి ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి సురేఖ కోరారు.


