Mallu Ravi: కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ సమావేశంలో మూడు విషయాల మీద సుదీర్ఘంగా చర్చించినట్లు కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి తెలిపారు. సీఎం రేవంత్ పై కొండా సుస్మిత వ్యాఖ్యల విషయంలో మంత్రి కొండా సురేఖ ఇచ్చిన వివరణ చూశామన్నారు. కొండా సురేఖ కూతురు కొండా సుస్మిత మాట్లాడిన మాటల వీడియోలు కూడా చూశామన్నారు. ముఖ్యమంత్రిని మామూలు వ్యక్తిగా అనుచిత వాఖ్యలు చేసిందని మల్లు రవి అన్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు క్రమశిక్షణ కమిటీకి రిపోర్ట్ ఇస్తామని చెప్పారన్న మల్లు రవి.. అందరూ ఇచ్చిన ఫిర్యాదులను పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
రాజగోపాల్ రెడ్డి విషయంలో ప్రొసీజర్ ప్రకారం వెళ్తాం
''కుమార్తె వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖ ఇచ్చిన వివరణ చూశాము. మంత్రి సురేఖ ఇచ్చిన వివరణపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కుమార్తె మాటలను మంత్రిగా సురేఖ ఖండించాలి. సహజ న్యాయ సూత్రాల ప్రకారం తనకు సంబంధం లేదని సురేఖ చెబుతున్నారు. సురేఖ వివరణపై చర్యలు ఎప్పుడు తీసుకుంటామో చెప్పలేము. అందరూ ఇచ్చిన ఫిర్యాదులు పరిశీలించి నిర్ణయం తీసుకుంటాం. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విషయంలో ప్రొసీజర్ ప్రకారం వెళ్తాం. రాజగోపాల్ రెడ్డిపై ఎలాంటి ఫిర్యాదు రాలేదు. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై సుమోటోగా తీసుకోవాలా లేదా అనేది పరిశీలిస్తున్నాం'' అని మల్లు రవి చెప్పారు.
మేఘారెడ్డి నుంచి మళ్లీ వివరణ
ఇక మాజీ ఎమ్మెల్యే చెన్నారెడ్డి మాటలకు సంబంధించిన వీడియోలు పరిశీలించినట్లు ఆయన వెల్లడించారు. చెన్నారెడ్డి మీద మేఘారెడ్డి ఫిర్యాదు చేశారని తెలిపారు. చెన్నారెడ్డి ఇచ్చిన వివరణ కూడా కమిటీ పరిశీలించిందన్నారు. చెన్నారెడ్డి మీద ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే మేఘారెడ్డిని మళ్లీ పిలిచి వివరణ తీసుకుంటామన్నారు. ఆదిలాబాద్ లో పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశంలో శ్రీనివాస్ రెడ్డి, సంజీవ రెడ్డికి జరిగిన వివాదంపై ఇప్పటికే షోకాజ్ నోటీసులు ఇచ్చామని మల్లు రవి చెప్పారు. ఇంచార్జ్ మంత్రి జూపల్లి ముందే మాట్లాడారని, జూపల్లి దగ్గర వివరణ తీసుకున్నామని పేర్కొన్నారు. ఈ కేసులో కూడా త్వరలో నిర్ణయం తీసుకోవడం జరుగుతుందన్నారు.
అందుకే..జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
జక్కిడి ప్రభాకర్ రెడ్డి ఇష్యూపైనా మల్లు రవి స్పందించారు. ప్రభాకర్ ను పార్టీ నుండి సస్పెండ్ చేశామన్నారు. ఎల్బీనగర్ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసిన మధుయాష్కి మీద అనుచిత వాఖ్యలు చేశారని, గాంధీ భవన్ వేదికగా అనుచరులతో గొడవకు దిగారని, అందుకే జక్కిడి ప్రభాకర్ రెడ్డిని సస్పెండ్ చేశామని మల్లు రవి తెలిపారు. ఇక సిద్ధిపేట, గజ్వేల్ లో జరిగిన వివాదాలపైనా వివరణ కోరామని మల్లు రవి వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని మల్లు రవి అన్నారు. స్వాతంత్య్రం తీసుకొచ్చిన పార్టీ కూడా కాంగ్రెస్ అని పేర్కొన్నారు.












