Alleti Maheshwar Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ లండన్ పర్యటనపై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. లండన్ టూర్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రహస్య సమావేశం జరిగిందన్నారు. ఎంఐఎం మధ్యవర్తిత్వంతో ఈ భేటీ జరిగిందని ఆయన ఆరోపించారు. బెంగళూరు సమావేశానికి కొనసాగింపుగానే ఈ సీక్రెట్ మీటింగ్ జరిగిందన్నారు.
అవినీతి, కేసులు, ఆస్తుల బదలాయింపుపై చర్చలు
గతంలో జరిగిన సమావేశంతో ఫినిక్స్ భూమి బదలాయింపు జరిగిందన్నారు. తాజాగా జరిగిన సమావేశంలో బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతి, కేసుల అంశాలపై రేవంత్, కేటీఆర్ మధ్య చర్చ జరిగిందన్నారు. గత ప్రభుత్వ హయాంలో అవినీతితో సంపాదించిన ఆస్తుల బదలాయింపుపైనా వారిద్దరి భేటీలో డిస్కషన్ జరిగిందన్నారు.
40 మంది ఎమ్మెల్యేలని రమ్మంటే 16మందే వచ్చారు
ఇటీవల కాంగ్రెస్ లో చోటు చేసుకున్న కీలక పరిణామాలపైనా మహేశ్వర్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. సీఎం రేవంత్ ఎమ్మెల్యేల మద్దతు కోల్పోయారని చెప్పారు. మూడింట ఒక వంతు మద్దతు కూడా ఆయనకు లేదని వ్యాఖ్యానించారు. మంత్రి కొండా సురేఖకు వ్యతిరేకంగా 40 మందిని మాట్లాడమని చెప్తే 16మంది మాత్రమే నిన్న సమావేశం అయ్యారని, వారిలోనూ అనేకమంది కొండా సురేఖతో ఉన్న వ్యక్తిగత వైరంతోనే మీటింగ్ కు వచ్చారని మహేశ్వర్ రెడ్డి చెప్పారు.
రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేల మద్దతు కోల్పోయారని చెప్పడానికి ఇదే నిదర్శనం అని అన్నారు. మీడియాతో చిట్ చాట్ లో మహేశ్వర్ రెడ్డి ఈ హాట్ కామెంట్స్ చేశారు. సీఎం రేవంత్, కేటీఆర్ మధ్య రహస్య సమావేశం జరిగిందని, సీఎం రేవంత్ ఎమ్మెల్యేల మద్దతు కోల్పోయారని బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ సర్కిల్స్ లో హీట్ పెంచాయి.


