నేటి సమాజంలో భక్తి అనేది చాలా వరకు ఒక అవసరంగా మారిందే తప్ప ఆథ్యాత్మిక ప్రయాణంగా భావించలేకపోతున్నారనే భావన ఉంది. నుదుట బొట్టు,మెడలో రుద్రాక్షలు.. పుణ్య తిథులు, పండగలు, వ్రతాలు ఉన్నప్పుడు ఆడంబరమైన పూజలు.. హంగామా.. కానీ మనస్సులో ప్రేమ, దయ, సానుభూతి.. సాటి మనషులపట్ల గౌరవ భావం కనిపించడం లేదు. భగవంతుడు ఉన్నాడని నమ్మి పూజలు చేస్తూ, ఆలయాలకు వెళ్ళే వాళ్ళు నిత్యం తమ జీవితంలో ఆ సర్వాంతర్యామి నియమాలను పాటిస్తూ జీవనాన్ని సాగిస్తున్నారా అంటే.. చాలా వరకు లేరనే సమాధానం వస్తుంది.
ఆలయానికి వెళ్ళిన ఆ నిమిషం భక్తి పొంగి పోరలుతుంది. కానీ ఆలయం దాటి బయటికి వచ్చాడా అప్పటి వరకు ఉన్న భక్తిపరుడు వ్యాపారుడు అవుతాడు. మళ్ళీ మామూలు మనిషిలా జంతువు కంటే హీనంగా ప్రవర్తిస్తాడు. మరి అప్పటి వరకు ఉన్న భక్తి ఎక్కడ పోయింది? అందుకే భగవంతుడికి కావలసింది బాహ్య ఆడంబరాలు, కోట్ల కొద్దీ ధనం ఖర్చు పెట్టి చేసే గొప్ప పూజలు, నోళ్లు తిరగని మంత్రోచ్ఛారణలు కావని పురాణాలు చెబుతున్నాయి.
స్వచ్ఛమైన మానవత్వంతో కూడిన పవిత్రమైన మనస్సు మాత్రమే. ధర్మం, నీతిని వదిలేసి, తోటి మనుషుల మనస్సులను బాధకు గురి చేస్తూ.. దయాదాక్షిణ్యాలు లేకుండా స్వార్థంతో బతుకుతూ ఎంత గొప్ప పూజలు చేసినా ఆ భగవంతుడు ఏమాత్రం సంతోషించడు. పైగా అటువంటి పూజలను ఆయన తిరస్కరిస్తాడని మన సనాతన ధర్మం, వేదాలు, పురాణాలు స్పష్టంగా హెచ్చరిస్తున్నాయి.
భగవద్గీత 9వ అధ్యాయం, 26వ శ్లోకంలో పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్ఛతి తదహం భక్త్యుపహృతమశ్నామి ప్రయతాత్మనః అని శ్రీకృష్ణ పరమాత్మ చెబుతారు. ఎవరైనా భక్తితో నాకు ఒక ఆకును, ఒక పుష్పాన్ని, ఒక ఫలాన్ని లేదా కొద్దిగా నీటిని సమర్పించినా, ఆ శుద్ధమైన భక్తితో సమర్పించిన దానిని నేను స్వీకరిస్తాను అని అర్థం.. ఇక్కడ ముఖ్యం భక్తి, హృదయశుద్ధి మాత్రమే తప్ప పూజా వస్తువుల విలువ కాదని తెలుస్తుంది.
అలాగే, భగవద్గీతలోని పదిహేడో అధ్యాయంలో అహంకారంతో, ఇతరులకు కీడు చేస్తూ లేదా గొప్పల కోసం చేసే పూజలను, తపస్సులను "రాజస", "తామస" పూజలుగా వర్గీకరించారు. ఇవి భగవంతుని చేరువ చేయవు సరికదా, వ్యర్థమవుతాయని అన్నారు. ఇక భగవంతుడు సర్వాంతర్యామి. ప్రతి జీవిలోనూ ఆ పరమాత్మ నివసిస్తున్నాడు. జీవుడే దేవుడు అని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి.
కానీ తోటి మనుషులను బాధిస్తూ, జాలి దయ లేకుండా ప్రవర్తించే వ్యక్తి, ఒక చేత్తో దేవుడికి నమస్కరిస్తూ, మరో చేత్తో ఆ దేవుడి ప్రతిరూపమైన తోటి మనిషిని హింసిస్తున్నాడు... యోగవాసిష్టం, ఉపనిషత్తుల ప్రకారం ఆత్మజ్ఞానం, భూతదయ అంటే సమస్త ప్రాణుల పట్ల కరుణ కలిగి ఉండటమే నిజమైన ఆధ్యాత్మికత.. పురాణాలలో ప్రహ్లాదుడు, కన్నప్ప, సిరియాలుడు వంటి భక్తుల కథలు చూస్తే, దేవుడు ఎప్పుడూ నిష్కల్మషమైన ప్రేమకు, నిస్వార్థ సేవకే బానిసయ్యాడు తప్ప ఇతర ఆడంబరాలకు కాదని తెలుస్తుంది.
ఇక కన్నప్ప ఎంగిలి మాంసాన్ని అర్పించినా ఆయన నిశ్చలమైన భక్తికే పరమేశ్వరుడు పరవశించి మోక్షాన్ని ఇచ్చాడు. అదే సమయంలో అహంకారంతో యజ్ఞాలు చేసిన ఎందరో రాక్షసులను భగవంతుడు సంహరించినట్టు పురాణాలు చెబుతున్నాయి. దేవుడు విధించిన నియమాలు చాలా స్పష్టమైనవి. సత్యం మాట్లాడటం, అహింసను పాటించడం, పరోపకారం చేయడం, ఇతరుల పట్ల దయ కలిగి ఉండటం, కోపం, స్వార్థాన్ని విడనాడటమే భగవంతుడికి అత్యంత ప్రీతిపాత్రమైన మార్గాలు.
మన పెద్దలు "పరోపకారార్థం ఇదం శరీరం" అన్నారు . తోటివారి ఆకలి తీర్చడంలో, కష్టంలో ఉన్నవారికి అండగా నిలవడంలో ఉన్న భగవత్ తత్త్వం ఏ గుడిలోనూ, ఏ పూజలోనూ దొరకదని చెప్పారు. కాబట్టి ఆడంబరాల కోసం ఖర్చు పెట్టే ధనాన్ని, సమయాన్ని తోటి మనుషుల సేవకు, మంచి ప్రవర్తనకు ఉపయోగిస్తూ, హృదయాన్ని దయతో నింపుకోవడమే మానవుడు దేవుడిని మెప్పించడానికి చేయవలసిన అసలైన పూజ అని పేర్కొంటున్నారు.
గమనిక: ఇక్కడ అందించిన వివరాలు కేవలం సాంప్రదాయ పురాణ విశ్వాసాలు మరియు ఆధ్యాత్మిక భావనల ఆధారంగా ఇవ్వబడ్డాయి. వీటిని కేవలం మతపరమైన విశ్వాసాల కోణంలోనే చూడాలి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత రంగ నిపుణులను సంప్రదించడం మంచిది.


