- కుప్పకూలిన 50 గజాల్లో నిర్మిస్తున్న 7 అంతస్తుల భవనం
- మీ సొంత శాఖలోనే ఇలా జరుగుతుంటే బాధ్యులెవరు సీఎం గారూ?
- ఇద్దరి మరణం.. కొనసాగుతున్న సహాయక చర్యలు
- ఈ అక్రమ నిర్మాణాలపై హైడ్రా, స్థానిక ఇన్‌స్పెక్టర్స్ ఏం చేస్తున్నారు?
- మాదాపూర్‌లో బద్రర్స్ గ్యాంగ్ అక్రమ నిర్మాణాలపై చర్యలేవి?
- హైటెక్ సిటీలోనే ఇవ్వలేని భరోసా రైజింగ్ పెట్టుబడులకు ఇవ్వగలరా?
- అయ్యప్ప సొసైటీలో ప్రభుత్వ వాదన.. ఆఫీసర్స్ లంచాలకు కౌంటర్లు ఏంటి?
- బ్రదర్స్ పేరుతో వెయ్యి ఫ్లాట్ల నిర్మాణాలకు జీరో పర్మిషన్స్‌తోనే నడుస్తున్నాయి?
- చర్చకు మీరు సిద్ధమా?
- కూకట్‌పల్లి వెళ్లే రూట్‌లో బిల్డింగ్‌కు సెట్ బ్యాక్స్ ఎక్కడో చూపిస్తారా?
- హైటెక్ సిటీ సాక్షిగా సాగుతున్న హై రైజ్ బిల్డింగ్స్‌పై రైజింగ్ డ్రైనేజ్ వ్యవస్థ ఇదే?
దేవేందర్ రెడ్డి చింతకుంట్ల
స్వేచ్ఛ చైర్మన్
9848070809
మూడో సిటీ అయిన సైబరాబాద్‌లో అక్రమ నిర్మాణాలకు కొదవలేదు. మాదాపూర్, కొండాపూర్ లాంటి ఏరియాలకు రాజకీయ అండదండలు ఉంటే చాలు 50 గజాల్లో కూడా 8 అంతస్తులు కట్టొచ్చు. ఇవన్నీ సీఎం అనుచరుల అండదండలతో కొనసాగుతున్నాయని అనడానికి ఆశ్చర్యపోనవసరం లేదు.
ఈ కబ్జాలపై వార్తలు రాస్తే బెదిరించారు. జరుగుతున్న నిర్మాణాలను ఒక్కసారి చూస్తే తెలంగాణ రైజింగ్ స్టేట్‌ను డ్రైనేజీగా మార్చుతోంది ఎవరని అర్థమవుతుంది. స్వేచ్ఛ చెబుతున్న సత్యాలు కూడా అర్థం అవుతాయి. గచ్చిబౌలిలో 50 గజాల భూమిలో 7 అంతస్థుల భవనం తాజాగా కూలింది కాబట్టి వార్తగా బయటకు వచ్చింది. లేకపోతే గుట్టుచప్పుడు కాకుండా ఇలాంటి అక్రమ నిర్మాణాలు ఎన్నో జరుగుతూనే ఉంటాయి. వాళ్లు కోట్లకు కోట్లు సంపాదిస్తూనే ఉంటారు.
అయ్యప్ప సొసైటీలో కాలేజీల భవిష్యత్తు చూసుకోండి?
అయ్యప్ప సొసైటీ అక్రమ నిర్మాణాలకు అడ్డాగా మారింది. ఇందులో నారాయణ కాలేజీ వాటన్నింటినీ గంపగుత్తగా పట్టేసింది. నారాయణ ఇంటర్ ఏసీ క్యాంపస్ అంటూ ఒక్క బ్రాంచ్ పేరుతో 20 వేర్వేరు భవంతుల్లో కాలేజీలు నడిపిస్తున్నారు.
ఇవన్నీ అనుమతులు లేని జీరో భవంతులే. వాటి భద్రత దేవుడికే ఎరుక. కానీ, ప్రభుత్వం ప్రమాదాలు జరిగితే కానీ రైజింగ్ స్టేట్‌లో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. కోటికో రెండు కోట్లకో ఆశపడి మాదాపూర్‌ను మరో బస్తీగా మార్చేస్తున్నారు. క్రమంగా అక్రమాలన్నింటికీ నిలయంగా మారుతోంది.
అధికారుల పోస్టింగ్స్‌కు బాధ్యత ఎవరిది?
రంగారెడ్డి అంతా మాదే, మేము చెబితే ఎవరూ రారు అన్నట్లుగా వ్యాపారం నడిపిస్తున్న అనుచరులకు అధికారుల పోస్టింగ్స్‌తో తలా కొంత పంచుకుతింటున్నారు. అందుకే ఎలాంటి అక్రమ నిర్మాణాలు జరిగినా, కోర్టుకు చిన్న లిటిగేషన్ చూపించి ఓ ఆర్డర్‌తో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అయినా పట్టించుకునే నాథుడే లేడు. వీరికి పోస్టింగ్ ఇప్పిస్తున్న వారే నైతిక బాధ్యత వహించాలి. అందుకు సీఎం వద్ద ఉన్న మున్సిపాలిటీ శాఖనే సమాధానం ఇవ్వాలి.


