ఏదో ఒక వివాదాస్పద అంశంలో నిలిచే మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో మరో సంఘటన చోటు చేసుకుంది. మల్లారెడ్డి యూనివర్సిటీ గ్రౌండ్‌లో నిర్వహించిన టాక్సిక్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అపశృతి చోటుచేసుకుంది. హీరో యశ్‌ను చూసేందుకు విద్యార్థులు, అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ క్రమంలో ఈవెంట్‌ను చూసేందుకు కొందరు యువకులు గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన ఫ్లడ్‌లైట్ స్టాండ్‌పైకి ఎక్కినట్లు తెలుస్తుంది.
అదే సమయంలో హీరో యశ్ వేదికపై మాట్లాడుతున్నారు.. ఆ సమయంలో ఒక్కసారిగా భారీ ఫ్లడ్‌లైట్ స్టాండ్ కుప్పకూలింది. స్టాండ్ కింద ఉన్న పలువురు విద్యార్థులు, యువకులపై అది పడటంతో కొందరికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. ఈ ఘటనతో అక్కడ ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి. వెంటనే స్పందించిన ఈవెంట్ నిర్వాహకులు క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించే ఏర్పాట్లు చేశారు.
మరోవైపు ఈ ఘటనతో భారీ ఈవెంట్ నిర్వహణలో భద్రతా చర్యలు, ప్రేక్షకుల నియంత్రణపై తగిన జాగ్రత్తలు తీసుకున్నారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అదేవిధంగా కాలేజీ ప్రాంగణంలో వేలాది మంది పాల్గొనే కార్యక్రమాన్ని నిర్వహించే సమయంలో భద్రతా ప్రమాణాల అమలు, తాత్కాలిక నిర్మాణాల పటిష్టత, ప్రేక్షకుల భద్రతపై ముందస్తు చర్యలు ఎందుకు తీసుకోలేదన్న దానిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
అయితే మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి ఈ కార్యక్రమంపై చేసిన వ్యాఖ్యలుసోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.. ఈ కార్యక్రమంలో మాట్లాడిన ప్రీతి రెడ్డి.. మల్లారెడ్డి పేరు నిలబెట్టేలా విద్యార్థులు ప్రవర్తించాలని, భవిష్యత్‌లో ఇలాంటి కార్యక్రమాలు క్యాంపస్‌లో నిర్వహించాలంటే విద్యార్థులు క్రమశిక్షణ పాటించాలని సూచించారు. ఏదైనా పొరపాటు జరిగితే మళ్లీ క్యాంపస్‌లో ఇలాంటి ఈవెంట్స్ నిర్వహించే అవకాశం ఉండదని హెచ్చరించారు.
ఇలాంటి కార్యక్రమాలు ఇక ముందు కొనసాగాలంటే ముందుగా విద్యార్థులు బాధ్యతగా, క్రమశిక్షణతో వ్యవహరించాలని ఆమె పేర్కొన్నారు. అయితే ప్రీతి రెడ్డి వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు. అసలు కాలేజీ క్యాంపస్‌లో సినిమా ఈవెంట్ నిర్వహించడమే తప్పు.. అలాంటింది విద్యార్థులకు డిసిప్లిన్ గురించి చెప్పడం ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు. కొందరు నెటిజన్లు అయితే ప్రీతి రెడ్డిపై విమర్శలు చేస్తూ.. టాక్సిక్ బిహేవియర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇప్పటికే ఈవెంట్ నిర్వహణపై పలు విమర్శలు వ్యక్తమవుతున్న సమయంలోనే ఫ్లడ్‌లైట్ స్టాండ్ కూలి విద్యార్థులు గాయపడిన ఘటన మరింత చర్చకు దారితీసింది. దీనికి తోడు ప్రీతి రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కాలేజీలో నిర్వహించి తప్పుచేయడమే కాకుండా.. అందుకు విద్యార్థులను బాధ్యులు చేస్తూ.. మాట్లాడటం సరికాదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి..


