అమెరికా, ఇరాన్ దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉన్న ప్రచ్ఛన్న యుద్ధం మరోసారి తారాస్థాయికి చేరింది. ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిని ఏకంగా 'అమెరికా కొత్త భూభాగం' అంటూ అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఈ మేరకు హర్మూజ్ జలసంధి ప్రాంతాన్ని అమెరికా భూభాగంగా స్పష్టంగా హైలైట్ చేస్తున్న ఒక సరికొత్త మ్యాప్‌ను ట్రూత్ సోషల్ వేదికగా ఆదివారం(నేడు) ఆయన పోస్ట్ చేయడం అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతోంది. ట్రంప్ ఇలా హర్మూజ్ తమ భూభాగమంటూ మ్యాప్ విడుదల చేయడం ఇది రెండోసారి.

ఇరాన్‌పై ఇప్పట్లో ఎన్నడూ లేనివిధంగా అత్యంత కఠినమైన ఆర్థిక ఆంక్షలను అమలు చేసేందుకు అమెరికా సిద్ధమవుతున్న తరుణంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం. ఇప్పటికే సౌత్ కరోలినాలో జరిగిన ఒక బహిరంగ ర్యాలీలోనూ ఆయన ఇదే తరహా ప్రకటన చేశారు. ప్రపంచవ్యాప్తంగా జరిగే సముద్ర చమురు రవాణాలో దాదాపు ఐదో వంతు భాగం కేవలం ఈ జలమార్గం గుండానే సాగుతుంది. అలాంటి అత్యంత కీలకమైన మార్గాన్ని అమెరికా నావికాదళం పూర్తిగా తన దిగ్బంధనంలోకి తీసుకుని నియంత్రిస్తోందని, దీనిని అధికారిక భూభాగంగా మార్చే ఆలోచన ఉందని ఆయన పరోక్షంగా స్పష్టం చేశారు.
ట్రంప్ చేసిన ఈ ప్రకటనలను ఇరాన్ ప్రభుత్వం అత్యంత తీవ్రంగా ఖండించింది. అమెరికా అధినేత వ్యాఖ్యలు కేవలం పగటి కలలు, భ్రమలు మాత్రమేనని ఇరాన్ ఉప విదేశాంగ మంత్రి కజెం ఘరిబబాది కొట్టిపారేశారు. మరోవైపు, అమెరికా తన దూకుడు వైఖరిని మార్చుకుని, ఇచ్చిన హామీలను అమలు చేసేవరకు హర్మూజ్ జలసంధిని పూర్తిగా మూసే ఉంచుతామని ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి మొహసెన్ రెజాయీ హెచ్చరించారు. టెహ్రాన్ ఆర్థిక మూలాలను దెబ్బతీసేలా అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ త్వరలోనే సరికొత్త కఠిన ఆంక్షలను ప్రకటించనున్నట్లు సమాచారం.
ఇరాన్ చమురు వాణిజ్యాన్ని పూర్తిగా అణచివేయడమే లక్ష్యంగా అగ్రరాజ్యం పావులు కదుపుతుండటంతో ఈ ప్రాంతంలో నౌకా రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. కొన్ని నౌకలు అమెరికన్ బలగాల కట్టుదిట్టమైన భద్రత నడుమ ప్రయాణిస్తున్నప్పటికీ, భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయనే దానిపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. అంతర్జాతీయ సముద్ర చట్టాల ప్రకారం ఏ ఒక్క దేశం కూడా ఇలాంటి జలసంధులపై ఏకపక్షంగా పూర్తి ఆధిపత్యం చెలాయించడానికి వీలులేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.












