రిజర్వేషన్లు రద్దు చేయాలని ప్రస్తుతం దేశంలో కొత్త ఉద్యమం పుట్టుకొచ్చిన విషయం తెలిసిందే. ‘రిజర్వేషన్ హటావో ఆందోళన్’ పేరిట సోషల్ మీడియా వేదికగా ప్రారంభమైన ఈ ఉద్యమం.. శుక్రవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా భారీ ఎత్తున నిరసన ప్రదర్శన చేపట్టింది. కులాల వారీగా రిజర్వేషన్లు రద్దు చేసి కేవలం ఆర్థిక ప్రాతిపదికన అమలు చేయాలని రిజర్వేషన్ హటావో ఆందోళన్ ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. వీరికి దేశవ్యాప్తంగా సామాజిక మాద్యమాల్లో మద్దతు పెరుగుతున్నట్టు తెలుస్తోంది.
రిజర్వేషన్స్ కారణంగా కొందరు విద్యార్థులకు ప్రతిభ ఉన్నా జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచినా న్యాయం జరగడం లేదని రిజర్వేషన్ హటావో ఆందోళన్ ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. ఫలితంగా కొందరు జాతీయ స్థాయిలో ర్యాంకులు సాధించినా కోరుకున్న కాలేజీలో సీట్లు రాక, ఒకటి రెండు మార్కుల తేడాతో ప్రభుత్వ ఉద్యోగాలు కోల్పోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలను ప్రత్యేకంగా ఉటంకించారు. అందుకే ఉద్యోగాలు, విద్యారంగంలో షెడ్యూల్ కాస్ట్‌ల వారీగా రిజర్వేషన్స్ తొలగించాలని,కేవలం కుటుంబాల ఆర్థిక స్థోమత ఆధారంగా అమలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కాగా, వీరి నిరసన ఒక్కసారిగా దేశవ్యాప్తంగా వైరల్ అయ్యింది.
ఇదిలాఉండగా, జంతర్‌మంతర్ 'రిజర్వేషన్ హఠావో' పేరిట ఆందోళనలు చేస్తున్న వారిపట్ల కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘రిజర్వేషన్లు ఏమీ దానం కాదని, అవి ఎవరి డిమాండ్ మేరకో రద్దు చేసేది కాదని’ పేర్కొన్నారు. నిన్న పాట్నాలో మీడియాతో మాట్లాడిన ఆయన.. తరతరాలుగా సామాజిక వివక్షను ఎదుర్కొంటున్న వర్గాలకు అండగా నిలిచేందుకే రాజ్యాంగం కల్పించిన హక్కు రిజర్వేషన్ అని గుర్తుచేశారు.
రిజర్వేషన్స్ ఏదో ఒక ప్రభుత్వం ఇష్టపూర్వకంగా ఇచ్చే రాయితీ కాదని, సామాజిక న్యాయం కోసం రాజ్యాంగం అందించిన ముఖ్యమైన సాధనమని వెల్లడించారు. షెడ్యూల్డ్ కులాలు (SC), షెడ్యూల్డ్ తెగలు (ST) సమాజంలో దీర్ఘకాలంగా వివక్షకు గురయ్యాయని, వారిని ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడానికి, సమాన హక్కులు కల్పించడానికే ఈ వ్యవస్థను రూపొందించారన్నారు.రిజర్వేషన్లు రద్దు చేయాలంటూ ఆందోళన బాట పట్టిన వారితో చర్చలు జరిపి రిజర్వేషన్ల ప్రాముఖ్యతను, దాని అవసరాన్ని వారికి వివరించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. దేశంలో సామాజిక వివక్ష ఇంకా ఉందని, ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్ చీఫ్ ఖర్గేకు ఎదురైన ఒక ఘటనను ఈ సందర్భంగా ప్రస్తావించారు.


