రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ విధానాలు, సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాలు, చెబుతున్న మాటలపై మాజీ మంత్రి, శాసనసభలో బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ఘాటుగా స్పందించారు.మాట్లాడితే అంతర్జాతీయ ప్రమాణాలతో రాష్ట్రంలో విద్యావ్యవస్థను అభివృద్ధి చేస్తున్నానని చెప్పే రేవంత్ రెడ్డి.. విద్యార్థులకు అందించే యూనిఫామ్స్ ఇవేనా? అని ప్రశ్నించారు.చాలా చోట్ల ఒక జత యూనిఫామ్స్ కూడా అందలేదని, అందిన చోట క్వాలిటీ బాలేదని, నాసిరకంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ మేరకు హరీశ్ రావు ఆదివారం ఉదయం ఎక్స్ వేదికగా రాష్ట్రంలోని విద్యార్థులకు అందించిన యూనిఫామ్స్‌కు సంబంధించి క్లిప్స్‌ను సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
‘ఇదేనా మీరు చెప్పే అంతర్జాతీయ ప్రమాణాలు రేవంత్ రెడ్డి?.. మాట్లాడితే ప్రపంచ స్థాయి విద్యా వ్యవస్థ అనే మీరు.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు కనీసం నాణ్యమైన యూనిఫారాలు ఇవ్వలేని దుస్థితిలో ఉన్నారా? ఒకచోట యూనిఫారాలు అందలేదు.. అందిన చోట కొలతలు సరిగ్గా లేవు. కుట్లు ఊడిపోతున్నాయి..ఉతికితే రంగులు వెలిసిపోతున్నాయి. రెండు జతలు ఇవ్వాల్సి ఉండగా, చాలా చోట్ల ఒక్క జత కూడా పూర్తిగా అందలేదు.
https://x.com/BRSHarish/status/2091375524438478867?s=20
రేవంత్ రెడ్డికి గుజరాత్ దళారులపై ఉన్న ప్రేమ.. తెలంగాణ చేనేత కార్మికులపై లేదు.చేనేత కార్మికులకు ఉపాధి కల్పించేలా స్థానికంగా యూనిఫారాల తయారీకి ప్రాధాన్యత ఇవ్వాల్సింది పోయి.. కమీషన్ల కోసం బడా కార్పొరేట్ల నుంచి నాసిరకం యూనిఫారాలు తెప్పించి విద్యార్థులకు, చేనేత కార్మికులకు అన్యాయం చేశారు. “మఫత్‌లాల్ ముద్దు.. చేనేత వద్దు” అన్నదే ప్రభుత్వ వైఖరిగా మారిందా?
ఒకవైపు చేనేత కార్మికుల ఉపాధికి గండి.. మరోవైపు విద్యార్థులకు నాసిరకం యూనిఫారాలు.దీంతో విద్యార్థులకు కష్టం.. చేనేత కార్మికులకు ఉపాధి నష్టం..నాసీరకం యూనిఫామ్‌లపై ప్రభుత్వం వెంటనే విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నాం’ అని హరీశ్ రావు వెల్లడించారు. ఇదిలాఉండగా, రాష్ట్రంలోని చాలా వరకు ప్రభుత్వ పాఠశాలల్లో నేటివరకు యూనిఫామ్స్ అందలేదని, పుస్తకాలు కూడా సరిగా పంపిణీ చేయలేదని ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నట్టు సమాచారం.దీనికి తోడు గురుకుల పాఠశాలల్లో వరుసగా ఫుడ్ పాయిజన్ ఘటనలు, సీనియర్ల ర్యాగింగ్ వంటి ఘటనలు వెలుగుచూస్తున్నా విద్యాశాఖను తన వద్దే పెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్టి పట్టించుకోవడం లేదని పెద్దఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి.


