International

Japan Earthquake: జపాన్‌లో భారీ భూకంపం.. వణికిపోయిన టోక్యో నగరం!

రచన: Mamatha puppala••4 నిమిషాల పఠనం

జపాన్ తూర్పు ప్రాంతాన్ని ఆదివారం తెల్లవారుజామున పెను భూకంపం కుదిపేసింది. రాజధాని టోక్యోతో పాటు పలు ప్రాంతాల్లో బలమైన ప్రకంపనలు నమోదయ్యాయి. దక్షిణ ఇబరాకి ప్రిఫెక్చర్ కేంద్రంగా, భూమికి సుమారు 70 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం సంభవించినట్లు జపాన్ వాతావరణ సంస్థ వెల్లడించింది.

జపాన్ తూర్పు ప్రాంతాన్ని ఆదివారం తెల్లవారుజామున పెను భూకంపం కుదిపేసింది. రాజధాని టోక్యోతో పాటు పలు ప్రాంతాల్లో బలమైన ప్రకంపనలు నమోదయ్యాయి. దక్షిణ ఇబరాకి ప్రిఫెక్చర్ కేంద్రంగా, భూమికి సుమారు 70 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం సంభవించినట్లు జపాన్ వాతావరణ సంస్థ వెల్లడించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.9గా నమోదైందని అధికారులు తెలిపారు. కాగా, అమెరికా జియోలాజికల్ సర్వే (USGS) దీనిని 5.8గా నమోదు చేసింది. ఈ ఘటనలో 23 మంది గాయపడగా, వారిలో ఎక్కువ మందికి స్వల్ప గాయాలైనట్లు అధికారులు స్పష్టం చేశారు.

అయితే, ఈ భూకంపం కారణంగా ఎలాంటి సునామీ ముప్పు లేదని తేల్చిచెప్పడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ప్రకంపనలు వచ్చిన సమయంలో ప్రజలు నిద్రలో ఉండటంతో ఒక్కసారిగా ఉలిక్కిపడి బయటకు పరుగులు తీశారు. మంచం నుంచి లేవడానికి ప్రయత్నించే సమయంలో కిందపడటం లేదా ఫర్నిచర్‌ను ఢీకొనడంతో కొందరు గాయపడ్డారు. సైతామా, కనగావా, చిబా, ఇబరాకి ప్రిఫెక్చర్లలోనూ ఈ ప్రభావం గట్టిగానే కనిపించింది. భూకంప ప్రభావం వల్ల రవాణా వ్యవస్థకు కొంత అంతరాయం ఏర్పడింది.

టోక్యో-నరిటా విమానాశ్రయాన్ని కలిపే ఎక్స్‌ప్రెస్ రైళ్లతో పాటు కొన్ని స్థానిక రైళ్ల రాకపోకలు ఆలస్యమయ్యాయి. అయితే షింకాన్సెన్ బుల్లెట్ రైళ్ల సర్వీసులు మాత్రం యథావిధిగా కొనసాగాయి. కొటో ప్రాంతంలో భూగర్భ నీటి పైప్‌లైన్ దెబ్బతినడంతో రోడ్డుపైకి నీరు చేరింది. అధికారులు వెంటనే స్పందించి మరమ్మతులు చేపట్టి లీకేజీని అరికట్టారు. టోక్యోలో సుమారు 460 ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోగా, టెప్కో (TEPCO) పవర్ గ్రిడ్ సిబ్బంది వెంటనే స్పందించి ఉదయం నాటికి పునరుద్ధరించారు.

ఇక దేశంలోని డజనుకు పైగా అణు విద్యుత్ కేంద్రాల్లో ఎలాంటి అసాధారణ పరిస్థితులు లేవని, అన్నీ సురక్షితంగా ఉన్నాయని న్యూక్లియర్ రెగ్యులేషన్ అథారిటీ ప్రకటించింది. నష్టాన్ని అంచనా వేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసిందని ప్రధాని సనాయే టకాయిచి తెలిపారు. ఇటీవలే క్యూషూ ప్రాంతంలో సంభవించిన భారీ భూకంపం (7.1 తీవ్రత) తాలూకు విషాదం నుంచి కోలుకోకముందే, తాజా ప్రకంపనలు జపాన్ ప్రజలను మరోసారి ఆందోళనకు గురిచేశాయి.

#Japan Earthquake August 2026#Tokyo Earthquake 5.9 Magnitude#Ibaraki Prefecture Japan Quake#Sanae Takaichi Japan PM#International News Telugu#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి