రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్‌ఎస్) స్థానంలో కొత్తగా తీసుకొచ్చిన 'న్యూ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్' (NEHS) మార్గదర్శకాలను ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసింది. పథకం ప్రారంభమైన జులై 17నుంచే ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చినట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని వైద్య చికిత్స పరిమితిని పెంచడంతో పాటు పలు కీలక వెసులుబాట్లను కల్పించింది.
ఈ కొత్త విధానం ప్రకారం, ఒకసారి పొందే వైద్య చికిత్స పరిమితిని రూ.2లక్షల నుంచి రూ.3లక్షలకు పెంచారు. ఈ పరిమితి వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈహెచ్‌ఎస్ కార్డుతో నేరుగా నగదు రహిత వైద్యం పొందవచ్చు. ఏడాదిలో ఎన్నిసార్లయినా ఈ సేవలను వినియోగించుకునే అవకాశం కల్పించారు. చికిత్స వ్యయం రూ.3లక్షలు దాటితే ట్రస్టు సీఈఓతో పాటు రొటేషన్ పద్ధతిలో మూడేళ్ల ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో కూడిన సబ్ కమిటీ పరిశీలన ఉంటుంది. ఒకవేళ వైద్య ఖర్చులు రూ.10లక్షలు దాటితే మాత్రం ట్రస్టు బోర్డు అత్యవసర సమావేశంలో చర్చించి ఆమోదం తెలపాల్సి ఉంటుంది.
చికిత్స వ్యయం ఎంతైనా సరే ఏ ఆసుపత్రి కూడా వైద్య సేవలను నిరాకరించకూడదని ప్రభుత్వం గట్టిగా హెచ్చరించింది. ఈ పథకం కింద 2025 అక్టోబరు నాటి కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం (సీజీహెచ్‌ఎస్) ప్యాకేజీ రేట్లను వర్తింపజేయనున్నారు. అత్యవసర పరిస్థితుల్లో వెల్‌నెస్ సెంటర్ సిఫారసు లేకుండానే నేరుగా నెట్‌వర్క్ ఆసుపత్రిలో చేరవచ్చు. అయితే ఈ విషయాన్ని 48గంటల్లోగా ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్టుకు తెలపాలి. కొత్త ఈహెచ్‌ఎస్ కార్డులు అందే వరకు ప్రస్తుత ఎంప్లాయీ లేదా పెన్షనర్ ఐడీ నంబర్ ఆధారంగానే వైద్య సేవలు అందించాలని, కార్డు లేదనే కారణంతో ట్రీట్‌మెంట్ ఆపకూడదని ఆదేశించారు.
అదేవిధంగా ఎంప్యానెల్డ్ ఆసుపత్రులు రోగుల నుంచి ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయరాదని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ వైద్య సేవలను విస్తరించేందుకు ప్రస్తుతం ఉన్న 12 వెల్‌నెస్ కేంద్రాలకు అదనంగా మరో 25 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. తద్వారా మొత్తం 33 జిల్లాల్లో జిల్లా, ఏరియా, టీచింగ్ ఆసుపత్రుల పరిధిలో ఈ సేవలు అందుబాటులోకి వస్తాయి. అంతేకాకుండా, సేవలపై వచ్చే ఫిర్యాదులను పరిష్కరించేందుకు రాష్ట్ర, జిల్లా, ఆసుపత్రి స్థాయిలో ప్రత్యేక ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను కూడా ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.


