తెలంగాణ

Telangana: ఆటోల బంద్‌ కు సిద్దమైన డ్రైవర్లు.. నేటి అర్ధరాత్రి నుంచి అమలు!..

రచన: Venu••4 నిమిషాల పఠనం

రాష్ట్రంలో వేలాది మంది ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌ డ్రైవర్ల జీవనోపాధి ఆగమ్యగోచరంగా మారిందని.. ఇప్పటికే ఇంధన ధరలు, వాహన నిర్వహణ ఖర్చులు, రుణ భారం వంటి సమస్యలతో సతమతమవుతున్న డ్రైవర్లకు కొత్త రవాణా విధానాలు మరింత ఒత్తిడిని పెంచుతాయన్న ఆందోళన కార్మిక సంఘాల్లో నెలకొన్నట్టు యూనియన్ సభ్యులు చెబుతున్నారు..

సమస్యలకు నిలయంగా మారుతున్న తెలంగాణలో ఆటో, క్యాబ్, పాఠశాల వ్యాన్‌ డ్రైవర్ల సమస్యలు మరోసారి తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలో తమ దీర్ఘకాలిక డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కార్మిక సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం అర్ధరాత్రి నుంచి డ్రైవర్ల నిరవధిక బంద్‌కు కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి..

మరోవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచేందుకు కార్మిక సంఘాల ఐకాస ఆధ్వర్యంలో ఈ బంద్‌ నిర్వహిస్తున్నట్లు టీఎన్టీయూసీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఎంకె. బోసు తెలిపారు. బంద్‌ను విజయవంతం చేసేందుకు కార్మికులు పెద్ద సంఖ్యలో కదలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. సికింద్రాబాద్‌ టీడీపీ పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త నల్లెల కిశోర్‌ ఆధ్వర్యంలో దోమలగూడలో బంద్‌కు సంబంధించిన గోడపత్రికను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా డ్రైవర్ల సమస్యలపై నేతలు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ముఖ్యంగా ఆర్టీసీ ద్వారా ఈవీ ఆటోలను ప్రవేశపెట్టాలనే ప్రతిపాదనలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. అలాగే ప్రైవేటు రవాణా రంగంలో పనిచేస్తున్న డ్రైవర్ల కోసం ప్రత్యేకంగా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. ఇప్పటికే మహాలక్ష్మి ప్రయాణం ద్వారా చాలా మంది ఆటో డ్రైవర్లు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారని.. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల వల్ల నిరుద్యోగం పెరుగుతుందని ఆరోపించారు.

మరోవైపు రాష్ట్రంలో వేలాది మంది ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌ డ్రైవర్ల జీవనోపాధి ఆగమ్యగోచరంగా మారిందని.. ఇప్పటికే ఇంధన ధరలు, వాహన నిర్వహణ ఖర్చులు, రుణ భారం వంటి సమస్యలతో సతమతమవుతున్న డ్రైవర్లకు కొత్త రవాణా విధానాలు మరింత ఒత్తిడిని పెంచుతాయన్న ఆందోళన కార్మిక సంఘాల్లో నెలకొన్నట్టు యూనియన్ సభ్యులు చెబుతున్నారు..

ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణంతో ఆర్టీసీ బస్సులన్నీ ఫుల్ రష్ తో ప్రయాణిస్తుండగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ బంద్‌ ప్రభావం సాధారణ ప్రయాణికులపైనా పడే అవకాశం ఉందని.. ముఖ్యంగా పాఠశాలలు, కార్యాలయాలు, అత్యవసర ప్రయాణాలపై ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉండటంతో ప్రభుత్వం ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.

#Telangana#Hyderabad#Auto-rickshaw#drivers#strike#midnight tonight
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి