క్రైమ్

Crime News: మంటల్లో మానవత్వం.. వెనక్కి వెళుతున్న సమాజం!..

రచన: Venu••6 నిమిషాల పఠనం

సమాజంలో దారుణాలు పెరుగుతున్నాయంటే.. కేవలం నేరస్తుల సంఖ్య పెరుగుతోందని కాదు. ఎక్కడో మన విలువలు బలహీనపడుతున్నాయని కూడా అర్థం. అందుకే ఈ రోజు సమాజం ఎంత అభివృద్ధి చెందింది? అనేది కాదు. మనిషిలోని మానవత్వం ఇంకా ఎంత మిగిలి ఉంది? అనేదే సమాధానం లేని ప్రశ్నలా మారింది.

ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న దారుణాలు.. జీవిత విలువలను ప్రశ్నిస్తున్నాయి. మనిషి ఎంతగా అభివృద్ధి చెందుతున్నా.. అతనిలోని మానవత్వం మాత్రం ఎందుకు తగ్గిపోతోందనే ప్రశ్న ఇప్పుడు ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తోంది. ఒకప్పుడు కుటుంబం, బంధాలు, ఆప్యాయతలు, పరస్పర గౌరవం మనిషి జీవితానికి పునాదులుగా ఉండేవి. కానీ నేడు చిన్నచిన్న విభేదాలకే హత్యలు, దాడులు, ప్రతీకారాలతో మనుషులు రగిలిపోతున్నారు.

ఆవేశాన్ని, కోపాన్ని అదుపు చేసుకోలేక ప్రాణాలు తీయడమో, లేక ప్రాణాలు తీసుకోవడమో చేస్తున్నారు.. ఈ లోకంలో మనిషి ప్రాణం విలువ కంటే క్షణికావేశం, అహంకారం, డబ్బు, ఆధిపత్యం ముఖ్యమైపోతున్నాయా అనే సందేహం కలుగుతోంది. ఒకవైపు మహిళలు, చిన్నారులపై జరుగుతున్న లైంగిక దాడులు.. మరో వైపు బాల్యం, యవ్వనం అనే తేడా లేకుండా విచక్షణ కోల్పోతున్న ఘటనలు సమాజంలోని భద్రతను ప్రశ్నిస్తున్నాయి..

సమాజంలో దారుణాలు పెరుగుతున్నాయంటే.. కేవలం నేరస్తుల సంఖ్య పెరుగుతోందని కాదు. ఎక్కడో మన విలువలు బలహీనపడుతున్నాయని కూడా అర్థం. అందుకే ఈ రోజు సమాజం ఎంత అభివృద్ధి చెందింది? అనేది కాదు. మనిషిలోని మానవత్వం ఇంకా ఎంత మిగిలి ఉంది? అనేదే సమాధానం లేని ప్రశ్నలా మారింది. ఇక దేశంలో ప్రస్తుతం జరుగుతున్న దారుణాలు మనిషి జంతువు నుండి రూపాంతరం చెంది.. ఇప్పుడు మనిషి జంతువుగా మళ్ళీ మారుతున్నాడా? అనే ప్రశ్నలు సంధిస్తున్నాయి.

ఇక సమాజంలో మనుషులకంటే మృగాలే ఎక్కువగా ముసుగు వేసుకుని సంచరిస్తున్నాయి అని తెలిపే ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 5న చెన్నై నుండి ఢిల్లీ బయలుదేరిన తమిళనాడు ఎక్స్‌ప్రెస్ జనరల్ కంపార్ట్ మెంట్ లోని ఎరుపు రంగు బ్యాగ్ నుండి దుర్వాసన రావడంతో ప్రయాణికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. ఈ క్రమంలో రైలు యూపీలోని ఆగ్రా రైల్వే స్టేషన్ చేరుకోగానే పోలీసులు బ్యాగును స్వాధీనం చేసుకుని పరిశీలించగా అందులో మానవ శరీర భాగాలు ఉన్నట్టు గుర్తించారు.

కేసు నమోదు చేసుకుని విచారణ జరగా సూట్ కేస్ చెన్నై నుండి వచ్చినట్టు తేలింది. దీంతో యూపీ పోలీసులు తమిళనాడు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు చెన్నై సెంట్రల్ రైల్వే‌స్టేషన్, ఇతర ప్రాంతాల్లో దాదాపు 350 సీసీ టీవీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించి ఇద్దరు వ్యక్తులు ఈ ఘాతుకానికి పాల్పడినట్టు గమనించారు. వాళ్ళు ఒడిశాకు చెందిన మాణిక్ ఉత్తిన్ లస్కర్, అతడి భార్య భాగమి మాజిక్ గా గుర్తించారు.

ఈ క్రమలో వాళ్ళ ఇంటికి వెళ్ళిన పోలీసులకు షాకిచ్చే దృశ్యం కనబడింది. వారితో ఉంటున్న నిషా అనే మహిళను చంపి ముక్కలుగా చేసి కొన్ని భాగాలు రైల్లో వదిలిన వారు మిగతా భాగాలతో బిర్యానీ చేసుకోవడం కనిపించింది. ఈ దారుణ ఘ‌ట‌న అటు త‌మిళ‌నాడులో, ఇటు ఒడిశాలో సంచ‌ల‌నంగా మారింది. కాగా విచార‌ణలో అస‌లు నిజాలు బ‌య‌ట‌పడే అవ‌కాశం ఉంది.

ఈ సంఘటన సమాజంలో ప్రస్తుతం నెలకొన్న రాక్షసతత్వానికి అద్దం పడుతుంది. ఇలాంటి నేరస్తులను చట్టం శిక్షించగలదు. కానీ మానవత్వాన్ని మాత్రం చట్టం వారి మనసులో నింపలేదు. అది కుటుంబం నేర్పాలి.. విద్యా వ్యవస్థ పెంపొందించాలి.. కానీ ఇలా జరగడం లేదు.. స్వార్థం కోసం బ్రతికే ఈ లోకంలో రానున్న కాలంలో మనిషి ముసుగు వేసుకున్న తోడేళ్ళే ఎక్కువయ్యే ప్రమాదం ఉందనే ఆందోళనలు నెలకొంటున్నాయి.

జీవిత విలువలను కాపాడుకోవడం ఒక్కరి బాధ్యత కాదు. ప్రతి కుటుంబం, ప్రతి పాఠశాల, ప్రతి పౌరుడు, ప్రతి వ్యవస్థ కలసి తీసుకోవాల్సిన బాధ్యత. లేకపోతే మనం నిర్మిస్తున్న ఆధునిక సమాజం.. సాంకేతికంగా ముందుకు వెళ్లినా, మానవత్వంలో మాత్రం వెనక్కి వెళ్లే ప్రమాదం ఉంది.

#Crime News#Humanity#fading away#people#society#tamilanadu#odisa#delhi
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి