Eatala Rajendar: పద్మవిభూషణ్, మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా హైదరాబాద్ కూకట్ పల్లిలో రక్తదాన, అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీనికి మల్కాజ్ గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ హాజరయ్యారు. కేక్ కట్ చేసి వేడుకల్లో పాల్గొన్నారు. కాపు సంఘం ఆధ్వర్యంలో చిరంజీవి పుట్టినరోజు వేడుకలు నిర్వహించిన వారిని, రక్తదానం చేసిన వారిని ఆయన అభినందించారు.

మెగాస్టార్ చిరంజీవి సినీ రంగంలోనే కాకుండా రాజకీయ రంగంలోనూ చరిత్ర సృష్టించారని ఎంపీ ఈటల రాజేందర్ ప్రశంసించారు. చిరంజీవి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అసెంబ్లీలో నా బెంచ్ మేట్ అని గుర్తు చేసుకున్నారు. సమాజంలో తనకంటూ ఒక స్థానాన్ని సుస్థిరపరచుకున్న వ్యక్తి చిరంజీవి అని కితాబిచ్చారు.

ఆయన ఆరోగ్యంగా ఉండి సమాజానికి, సినీ రంగానికి, సినిమాలో నటించాలనుకునే వారికి స్ఫూర్తి ప్రదాతగా ఉండాలని కోరుకుంటున్నానని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన సందీప్, అరవింద్.. వారికి సహకరించి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు ఈటల రాజేందర్. రక్తదానం కార్యక్రమంలో యువకులు, మెగాస్టార్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వందల యూనిట్ల రక్తాన్ని దానం చేశారు. వేలాది మందికి అన్నదానం కూడా చేశారు.



