VVIP Killing: ఈ దేశంలో వీవీఐపీ కిల్లింగ్స్ కొనసాగుతున్నాయి. బడా బాబుల పిల్లల్లో ఎలాంటి మార్పు రావడం లేదు. కోట్ల రూపాయల విలువైన లగ్జరీ కార్లతో సామాన్యులను గుద్ది చంపేస్తున్నారు. మర్డర్ చేసినా వారిలో ఎలాంటి భయం కనిపించడం లేదు. ఎందుకంటే వారిని కన్న బాబులు బిగ్ షాట్స్, పలుకుబడి ఉన్న రాజకీయ నాయకులు, సంపన్నులు కావడమే. డబ్బున్న వాళ్ల పిల్లలు ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ కారుతో గుద్ది చంపుతున్న ఘటనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. వారి ఖరీదైన కార్ల చక్రాల కింద ఎన్నో ప్రాణాలు నలిగిపోయాయి, ఇంకా నలుగుతూనే ఉన్నాయి. అయినా వీవీఐపీ కిల్లింగ్స్ కు ఎండ్ కార్డ్ పడటం లేదు.
తాజాగా హైదరాబాద్ లో చోటు చేసుకున్న కారు యాక్సిడెంట్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు జాతీయ స్థాయిలోనూ సంచలనంగా మారింది. కారు ఢీకొట్టడంతో ఓ యువతి చనిపోయింది. కారు నడిపింది ఏపీకి చెందిన అధికార పార్టీ కొడుకు. పవన్ కల్యాణ్ కు చెందిన జనసేన ఎంపీ లింగమనేని రమేశ్ కొడుకు లింగమనేని సంజూష్ ర్యాష్ డ్రైవింగ్ కు ఓ యువతి బలైపోయింది. ఇంత జరిగినా.. ఇప్పటివరకు అతడిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం తీవ్ర వివాదాస్పదంగా మారింది. బిగ్ షాట్ కొడుకు కావడం, రాజకీయ ఒత్తిళ్లు రావడంతో పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేకపోతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
తండ్రి పవర్ ఫుల్ పొలిటీషియన్.. కొడుకు సూపర్ కార్ కిల్లర్.. బాధితులకు న్యాయం దక్కేనా?
ఏపీలో అధికారంలో ఉన్న పార్టీ, పవన్ కల్యాణ్ కు చెందిన జనసేన ఎంపీ లింగమనేని రమేశ్ కొడుకు లింగమనేని సంజూష్ కారు ఢీకొని యువతి చనిపోయిన ఘటన ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కారు ప్రమాదంలో యువతి చనిపోయిన రోజులు గడుస్తున్నా ఇంతవరకు సంజూష్ పై ఎలాంటి చర్యలు లేకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. తండ్రి అధికార పార్టీకి చెందిన ఎంపీ, పైగా డబ్బున్న వ్యక్తి కావడంతో కొడుకుపై ఎలాంటి చర్యలు తీసుకోలేకపోతున్నారనే విమర్శలు ఉన్నాయి. పోలీసులపై పైనుంచి తీవ్రమైన రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కోట్ల రూపాయల ఖరీదు చేసే లగ్జరీ కారు (ఆస్టన్ మార్టిన్) ఢీకొట్టడంతో 26ఏళ్ల యువతి భారతి చనిపోయింది. కారుతో ఢీకొట్టి ఒక యువతి ప్రాణం తీస్తే.. పోలీసులు నిందితుడికి ఇచ్చింది కేవలం ఒక నోటీసు మాత్రమే. పైగా స్టేషన్ బెయిల్ కూడా ఇచ్చారు. ఈ మర్డర్ కేసులో జీరో అరెస్ట్, జీరో కస్టడీ, తండ్రి నుంచి జీరో పబ్లిక్ స్టేట్ మెంట్, తండ్రి ఇంతవరకు బహిరంగ ప్రకటన చేయలేదు. ఇక, రాజకీయ భాగస్వామ్య పార్టీల నుంచి ఎలాంటి స్పందనా లేదు. ఎందుకు అంటే.. అతడు ఎంపీ కొడుకు కాబట్టి. ఇక చనిపోయిన యువతి రాజకీయ నేత కాదు, బ్యూరోక్రాట్ కాదు, పారిశ్రామికవేత్త కూడా కాదు. ఓ సామాన్య కుటుంబానికి చెందిన అమ్మాయి.

ర్యాష్ డ్రైవింగ్‌కు యువతి బలి
ఒడిశాకు చెందిన 26ఏళ్ల భారతి సేల్స్ గర్ల్ గా హైదరాబాద్ లో పని చేస్తోంది. తన కుటుంబానికి భారతి జీవనాధారం. ఇనార్బిట్ మాల్ వద్ద రోడ్డు క్రాస్ చేస్తుండగా వేగంగా దూసుకొచ్చిన లగ్జరీ కారు (టీజీ 09 జీ 0666) భారతిని ఢీకొట్టింది. 21ఏళ్ల లింగమనేని సంజూష్ కారుని ర్యాష్ డ్రైవింగ్ చేశాడు. నిర్లక్ష్యంగా నడిపాడు. ఈ ప్రమాదంలో భారతి తలకు బలమైన గాయమైంది. తీవ్ర రక్తస్రావమైంది. అదే కారులో భారతిని ఆసుపత్రికి తీసుకెళ్లాడు. కానీ అప్పటికే ఆమె చనిపోయింది.
కేసుని నీరుగార్చే ప్రయత్నం..
ఇంత జరిగినా.. పోలీసులు సంజూష్ ని వదిలేశారు. పోలీసులు సెక్షన్ 106(1) కింద కేసు నమోదు చేశారు. ఇందులో గరిష్టంగా ఐదేళ్ల వరకు శిక్ష పడుతుంది. ఇది బెయిలబుల్ కేసు. బాగా గమనిస్తే.. పోలీసులు చట్టాన్ని ఉల్లంఘించారు అనేది స్పష్టమవుతోంది. బిజీగా ఉండే పబ్లిక్ రోడ్లపై ఖరీదైన లగ్జరీ కారుని అత్యంత వేగంగా, నిర్లక్ష్యంగా వాహనం నడిపి ఒకరి చావుకి కారణం అయితే.. అప్పుడు అది సాధారణ నిర్లక్ష్యం కిందకు రాదు. బీఎన్ఎస్ (భారతీయ న్యాయ సంహిత) 105 ప్రకారం శిక్షించదగిన హత్యానేరం అవుతుంది. నాన్ బెయిలబుల్ కేసు అవుతుంది. సంజూష్ కేసులో ఇందుకు భిన్నంగా జరిగింది. ఎందుకంటే అతడు వీవీఐపీ పుత్రరత్నం కాబట్టి.
ఒకరి చావుకి కారణమైన వ్యక్తికి స్టేషన్ బెయిల్
ఈ కేసులో పోలీసుల వైఫల్యం స్పష్టం కనిపిస్తోంది. నిర్లక్ష్యంగా కారు నడిపి ఒక ప్రాణం తీశాడు. అయినా కనీసం ఎలాంటి విచారణ జరగలేదు. రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయి. సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉంది. దర్యాఫ్తు అసంపూర్తిగా ఉంది. ఈ ఘటనలో ఒకరు చనిపోయినా.. రొటీన్ కేసుల్లో ఇచ్చినట్లుగా స్టేషన్ బెయిల్ ఇవ్వడం అత్యంత దారుణం. ఇది పూర్తిగా అన్యాయం. ఇది ఒక వీవీఐపీ కిల్లింగ్, లగ్జరీ కిల్లింగ్, ఒక రాజకీయ నాయకుడి కొడుకు చేసిన హత్య. అయినా శిక్షపడకపోవటం బాధాకరం, అత్యంత దురదృష్టకరం.

మన దేశంలో గతంలోనూ ఇలాంటి వీవీఐపీ కిల్లింగ్స్ అనేకం జరిగాయి. 2024లో పుణె పోర్షే కారు కేసు ఒకటి. ఒక బిల్డర్ మైనర్ కొడుకు మద్యం సేవించి ర్యాష్ డ్రైవింగ్ చేసి ఇద్దరు యువ ఇంజినీర్లను కారుతో ఢీకొట్టి చంపాడు. అయితే గంటల వ్యవధిలోనే అతడికి బెయిల్ వచ్చింది. రాజకీయ ఒత్తిళ్లు పని చేశాయి. సాక్ష్యాలను ట్యాంపర్ చేశారు. డ్రైవర్ నే మార్చేశారు. మన దేశంలో సంపన్నుల పిల్లలు ఎన్ని తప్పులు చేసినా వారికి శిక్షలు పడవు.

2024 ముంబై వర్లి బీఎండబ్ల్యూ కేసు..
శివసేనకు చెందిన వ్యక్తి కొడుకు ర్యాష్ డ్రైవింగ్ చేశాడు. ఓ మహిళను 2 కిలోమీటర్ల ఈడ్చుకెళ్లాడు. ఆ వెంటనే అతడు పారిపోయాడు. పోలీసులు మౌనంగా ఉండిపోయారు. అయితే, ప్రజాగ్రహం వెల్లువెత్తడంతో పోలీసులు స్పందించాల్సి వచ్చింది. ఘటన జరిగిన 2 రోజుల తర్వాత అతడిని అరెస్ట్ చేయాల్సి వచ్చింది.

ద్వారకా కేసు..
డ్రైవింగ్ లైసెన్స్ లేని 17ఏళ్ల మైనర్ బాలుడు రీల్స్ చేసేందుకు స్కార్పియో నడిపాడు. అదుపుతప్పి బైకర్ ను గుద్ది చంపాడు. ఈ ఘటనలో యూకేలో ఉన్నత చదువులు చదవాలని కలలు కన్న 23ఏళ్ల యువకుడు బలైపోయాడు.

కాన్పూర్ లంబోర్గిని కేసు..
పొగాకు వ్యాపారి కొడుకు ర్యాష్ డ్రైవింగ్ చేశాడు. ప్రమాదానికి కారణం అయ్యాడు. అయినా బుకాయించాడు. కారు నేను నడపలేదని చెప్పాడు. కానీ, సీసీ కెమెరాలో అడ్డంగా దొరికిపోయాడు.
ఈ వరుస ఘటనలు చూస్తే.. ఈ దేశంలో ఏం జరుగుతోంది అనే బాధ కలగక మానదు. ప్రభుత్వం యొక్క అతి పెద్ద వైఫల్యానికి ఈ ఘటనలు నిలువెత్తు నిదర్శనం. ఈ దేశంలో రాజకీయ నాయకులు, సంపన్నుల పిల్లలు తమ లగ్జరీ కార్లతో ఎవరినైనా చంపే హక్కు ఉందా? అనే ప్రశ్న ఉత్పన్నం అవుతుంది.
హైదరాబాద్ లో కారు ఢీకొని యువతి చనిపోయి రోజులు అవుతున్నా.. కనీసం ఒక్క రాజకీయ పార్టీ నుంచి కూడా స్టేట్ మెంట్ లేకపోవడం బాధాకరం. బీజేపీ, టీడీపీ, జనసేన మౌనంగా ఉన్నాయి. ఒకవేళ కారుతో ఢీకొట్టి చంపిన నిందితుడు తమ ప్రత్యర్థి పార్టీలకు చెందిన వ్యక్తి అయితేనే వీళ్లు నోరు విప్పి మాట్లాడతారా? అని జనాలు అడుగుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలని, నిందితుడు తప్పించుకోకుండా చూడాలని, అతడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు బలంగా వినిపిస్తున్నాయి.
బీజేపీ, టీడీపీ, జనసేన మౌనం వీడాలి..
అసలు ఏపీలోని రూలింగ్ పార్టీకి మనస్సాక్షి ఉందా? అని జనాలు నిలదీస్తున్నారు. చూసీ చూడనట్లు ఉండటం కరెక్ట్ కాదంటున్నారు. కేంద్రంలోని బీజేపీ, ఎన్డీయే కూటమిలో టీడీపీ అతి పెద్ద భాగస్వామి. అందువల్ల బీజేపీ, టీడీపీ నేతలు దీనిపై మాట్లాడటం తప్పనిసరి అంటున్నారు. మీరు మౌనంగా ఉండి సభ్య సమాజానికి ఏం సందేశం ఇద్దామని అనుకుంటున్నారు? అని కామన్ మ్యాన్ ప్రశ్నిస్తున్నాడు. మీరు మౌనం వీడి, ఇప్పటికైనా మాట్లాడాలి అని జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ కు ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. తప్పు జరిగినప్పుడు మాట్లాడితేనే, నిలదీస్తేనే.. రాజకీయ నాయకులు తమ పక్షాన ఉన్నారనే నమ్మకం ప్రజలకు కలుగుతుంది. కానీ ఈ లగ్జరీ హత్యలో ప్రతి ఒక్కరు మౌనంగా ఉన్నారు. అణిచిపెట్టే ప్రయత్నంలో ఉన్నారు. ఒక నిశ్శబ్ద కుట్రలో అంతా ఏకమయ్యారు.
తప్పు చేస్తే శిక్ష పడుతుందనే భయం పుట్టాలి
ఈ దేశంలో పార్లమెంట్ మెంబర్స్ పిల్లలు, బిగ్ షాట్స్ పిల్లలు తమ లగ్జరీ కార్లతో ఎవరినైనా చంపే హక్కు ఉందా? అనే ప్రశ్న సామాన్యుడి నుంచి ఉత్పన్నమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ఈ వీవీఐపీ హత్యలను ఆపలేకపోతున్నాయి. ఎందుకంటే.. తప్పు చేస్తే శిక్ష పడుతుంది అనే భయం రాజకీయ నాయకులు, సంపన్నుల పిల్లలకు లేకుండా పోయింది. అలాంటి భయాన్ని వారిలో ఈ ప్రభుత్వాలు నింపలేకపోయాయి. ఇప్పటికైనా వ్యవస్థలో మార్పు రావాలి. ప్రభుత్వాలు కఠినంగా ఉండాలి. అధికార, డబ్బు పలుకుబడి ఉన్న వ్యక్తి కొడుకు అయినంత మాత్రాన తప్పు చేస్తే తప్పించుకోలేడు అనే స్ట్రాంగ్ మేసేజ్ పంపాలి. అప్పుడే ఈ వీవీఐపీ హత్యలకు అడ్డుకట్ట పడగలదు.


