మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన ఐఏఎస్ ఆఫీసర్ తుకారాం ముండే.. మరోసారి వార్తల్లో నిలిచారు. 2026 మేలో FDA కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కేవలం 3 నెలల్లోనే ఆయన తీసుకున్న వేగవంతమైన చర్యల వలన పెద్ద హోటళ్లు, రెస్టారెంట్ల నుంచి చిన్న దుకాణాలు, వీధి వ్యాపారుల వరకు ప్రభావం చూపుతున్నాయి.
FDA కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆహార భద్రత, పరిశుభ్రతపై ముండే దృష్టి పెట్టారు. హోటళ్లు, రెస్టారెంట్లు, ఆహార తయారీ కేంద్రాలు, పాఠశాల క్యాంటీన్లు, ఇతర ఆహార వ్యాపార సంస్థల్లో తనిఖీలను ముమ్మరం చేశారు. నిబంధనల ఉల్లంఘనలు గుర్తించిన చోట నోటీసులు ఇవ్వడంతో పాటు లైసెన్సుల సస్పెన్షన్ వంటి చర్యలు చేపట్టారు.
దీంతో క్షేత్రస్థాయిలోనూ మార్పులు కనిపించసాగాయి. పెద్ద హోటళ్లు, రెస్టారెంట్లు పరిశుభ్రత విషయంలో మరింత అప్రమత్తమయ్యాయి. ఆహార పదార్థాల్లో ఉపయోగించే రంగులు, ముడిసరుకుల నాణ్యతపై తనిఖీలు పెరిగాయి. పాఠశాల క్యాంటీన్లలో జంక్ ఫుడ్ విషయంలోనూ అధికారులు దృష్టి సారించారు.మరోవైపు రోడ్డు పక్కన ఆహార పదార్థాలు విక్రయించే వ్యాపారులు కూడా పరిశుభ్రత, ప్యాకేజింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
2005 బ్యాచ్ ఐఏఎస్ అధికారి..
తుకారాం ముండే.. 2005 బ్యాచ్‌కు చెందిన మహారాష్ట్ర కేడర్ ఐఏఎస్ అధికారి. నిబంధనల అమలు, అధికారుల జవాబుదారీతనం విషయంలో అస్సలు రాజీపడని అధికారిగా ఆయనకు పేరుంది.దాదాపు రెండు దశాబ్దాల సర్వీస్‌లో అనేక బదిలీలు ఎదురైనా తన పని తీరులో మాత్రం వెనక్కి తగ్గలేదు. హోటల్, రెస్టారెంట్ రంగం కూడా FDA చర్యల తీవ్రతను గుర్తించింది. ఇండియన్ హోటల్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ (AHAR) అధ్యక్షుడు విజయ్ శెట్టి వివరాల ప్రకారం.. గత మూడు నెలల్లో మహారాష్ట్రవ్యాప్తంగా తనిఖీల అనంతరం కనీసం 10 హోటళ్ల లైసెన్సులను ముండే సస్పెండ్ చేశారు.
ఆయన చేపడుతున్న కఠిన చర్యలపై కొన్ని వర్గాల నుంచి అభ్యంతరాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కొంతమంది వ్యాపారులు లైసెన్సుల సస్పెన్షన్ విధానం, తనిఖీల ప్రక్రియపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. కొన్ని కేసుల్లో FDA చర్యలను కోర్టుల్లో సవాలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ, తుకారాం ముండే వెనక్కి తగ్గడం లేదు. గతంలో సాధారణ ప్రజలకు పెద్దగా కనిపించని FDA చర్యలు ఇప్పుడు హోటళ్ల వంటగదుల నుంచి రోడ్డు పక్కన ఉన్న ఫుడ్ స్టాల్స్ వరకు చర్చనీయాంశంగా మారాయి. తుకారాం ముండే.. నిబంధనలను కాగితాలకే పరిమితం చేయకుండా క్షేత్రస్థాయిలో అమలు కావాలనే పరిపాలనా విధానానికి నాంది పలికిన నిజమైన అధికారి అని పలువురు కొనియాడుతున్నారు.


