ఏపీ

21 సీట్ల ఫార్ములాకు పవన్ నో.. టీడీపీతో జనసేన దూరం పెరుగుతోందా?

రచన: Kashi••9 నిమిషాల పఠనం

2024లో జనసేన టీడీపీ, బీజేపీతో కలిసి పోటీ చేసింది. కూటమి అధికారంలోకి వచ్చింది. పవన్ డిప్యూటీ సీఎంగా కీలక పాత్రలో ఉన్నారు. కానీ ఇప్పుడు జనసేనను కేవలం కూటమిలోని చిన్న భాగస్వామిగా కాకుండా.. సొంతంగా బలమైన రాజకీయ శక్తిగా తీర్చిదిద్దాలనే ప్రయత్నం మొదలైందా? అనే వాద‌న తెర‌పైకి వ‌స్తోంది.

ఏపీలో కూట‌మి సేఫేనా..?

ప‌వ‌న్ క‌ళ్యాణ్ తీరులో ఏదో తేడా..

స్థానిక ఎన్నిక‌లు రెండు పార్టీల‌కూ ప‌రీక్షే!

ఆంధ్రప్రదేశ్ కూటమి రాజకీయాల్లో ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది. టీడీపీ, జనసేన మధ్య అంతా సవ్యంగానే ఉందా? లేక బయటకు కనిపించని రాజకీయ గ్యాప్ పెరుగుతోందా? ముఖ్యంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల సీట్ల పంపకంపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఈ చర్చకు మరింత బలం చేకూరుస్తున్నాయి.

2024 అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన కేవలం 21 స్థానాల్లో పోటీ చేసింది. ఆ 21 స్థానాల్లోనూ గెలిచి 100 శాతం స్ట్రైక్‌రేట్ సాధించింది. అప్పట్లో జగన్ ప్రభుత్వాన్ని ఓడించడమే ప్రధాన లక్ష్యంగా.. జనసేన తక్కువ సీట్లకు అంగీకరించిందని పవన్ కల్యాణ్ ఎన్నోసార్లు చెప్పారు. అందుకే ఆ 21 సీట్ల ఫార్ములాను స్థానిక ఎన్నికలకు వర్తింపజేయబోమని ఆయన తేల్చి చెప్పడం ఆసక్తికరంగా మారింది.

2024లో చేసిన సీట్ల త్యాగం ఇకపై కొనసాగదా?

ఇదే అసలు ప్రశ్న. ఎందుకంటే స్థానిక ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే పూర్తిగా భిన్నమైన రాజకీయ పరీక్ష. ఇక్కడ పార్టీ బలం కేవలం ఎమ్మెల్యే సీట్లతో కొలవలేం. గ్రామాల్లో ఎవరి క్యాడర్ బలంగా ఉంది? ఏ మండలంలో ఎవరి నాయకత్వం ఉంది? ఏ జిల్లాలో ఎవరి ప్రభావం ఎక్కువ? స్థానికంగా ఎవరికి గెలిచే అవకాశాలున్నాయి? ఇలాంటి అంశాలే కీలకం. అన్నింటికీ మించి కులాల లెక్క‌లు కూడా. ఏపీలో కుల రాజ‌కీయాల‌కు ఉన్న ప్రాధాన్య‌త అలాంటిది మ‌రి.

అందుకే పవన్ కల్యాణ్ ఇప్పుడు సంస్థాగత బలం ఉన్న చోట జనసేన పోటీ చేస్తుంది అనే లైన్ తీసుకోవడం వెనుక చాలా స్పష్టమైన రాజకీయ వ్యూహం కనిపిస్తోంది. జనసేనకు 2024లో వచ్చిన విజయాన్ని కేవలం కూటమి విజయంగా కాకుండా.. తమ పార్టీకి వచ్చిన రాజకీయ బలంగా చూపించుకోవాలనే ప్రయత్నం కూడా ఇందులో కనిపిస్తోంది.

ఇక్కడే టీడీపీతో అసలు సమస్య మొదలయ్యే అవకాశం ఉంది. టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేశ్.. 2024లో ఉన్న సీట్ల నిష్పత్తి ప్రకారమే కూటమి స్థానిక ఎన్నికల్లో కూడా సీట్లు పంచుకునే అవకాశం ఉందనే సంకేతాలు ఇచ్చారు. మరోవైపు జనసేన మాత్రం ఆ ఫార్ములాను అంగీకరించడం లేదు. అంటే రెండు పార్టీల నుంచి వస్తున్న సంకేతాలు ప్రస్తుతం ఒకేలా లేవు. ఒక్క మాట‌లో చెప్పాలంటే ప‌ర‌స్ప‌ర విరుద్ధంగా ఉన్నాయి.

టీడీపీ లెక్క ఒకటి.. జనసేన లెక్క మరొకటి!

ఇది కేవలం సీట్ల పంపకం విషయంలో చిన్న తేడాగా చూడాలా? లేక భవిష్యత్ రాజకీయాలకు ఇది పెద్ద సంకేతమా? ఇక్కడ పవన్ కల్యాణ్ రాజకీయంగా మరో అడుగు ముందుకు వేయాలని చూస్తున్నారనే విశ్లేషణ కూడా వినిపిస్తోంది.

2024లో జనసేన టీడీపీ, బీజేపీతో కలిసి పోటీ చేసింది. కూటమి అధికారంలోకి వచ్చింది. పవన్ డిప్యూటీ సీఎంగా కీలక పాత్రలో ఉన్నారు. కానీ ఇప్పుడు జనసేనను కేవలం కూటమిలోని చిన్న భాగస్వామిగా కాకుండా.. సొంతంగా బలమైన రాజకీయ శక్తిగా తీర్చిదిద్దాలనే ప్రయత్నం మొదలైందా? అనే వాద‌న తెర‌పైకి వ‌స్తోంది.

ప‌వ‌న్ వ్యూహం ఇదేనా..?

ప‌వ‌న్ మాట‌ల వెనుక వ్యూహం ఏమై ఉంటుండొచ్చు అనేది కూడా ఆస‌క్తి క‌లిగిస్తోంది. కూటమి ఉండాలి.. కానీ జనసేన బలహీనంగా ఉండకూడదనేది జ‌న‌సేనాని ఉద్దేశం కావ‌చ్చు. ఇదే అసలు పాయింట్.

ఎందుకంటే 2024లో జనసేన 21 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసి అన్నింటినీ గెలిచింది. రెండు లోక్‌సభ స్థానాల్లో కూడా పోటీ చేసి రెండింటినీ గెలుచుకుంది. ఈ విజయాన్ని దృష్టిలో పెట్టుకుని.. ఇప్పుడు పార్టీకి ఉన్న గ్రౌండ్ బలాన్ని విస్తరించుకోవాలని జనసేన భావిస్తోంది.

అయితే టీడీపీకి కూడా తన సొంత లెక్కలు ఉంటాయి. రాష్ట్రవ్యాప్తంగా అత్యంత పెద్ద క్యాడర్ బేస్ ఉన్న పార్టీ టీడీపీ. 2024లో 144 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసి 135 గెలిచింది. కాబట్టి స్థానిక ఎన్నికల్లో కూడా తన బలాన్ని తగ్గించుకోవడానికి టీడీపీ సిద్ధపడుతుందా? అన్నది చూడాలి.

ఇక బీజేపీ కూడా కూటమిలో భాగస్వామే. కాబట్టి టీడీపీ-జనసేన మధ్య సీట్ల పంపకం చర్చలో బీజేపీ వాటా కూడా మరో అంశంగా మారొచ్చు. అయితే అసలు టెన్షన్ ఎక్కడ వస్తుంది అంటే.. టికెట్ ఆశించే నాయకుల దగ్గర నుంచే.

ఒక నియోజకవర్గంలో టీడీపీ నాయకుడు బలంగా ఉంటే.. అదే ప్రాంతంలో జనసేన కూడా తమకు బలం ఉందని చెబితే? ఇద్దరికీ టికెట్ కావాలంటే? అక్కడ ఎవరి మాట వినాలి? అక్కడే కూటమికి అసలు పరీక్ష మొదలవుతుంది.

ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల పంపకం ఒక స్థాయి చర్చ. కానీ స్థానిక ఎన్నికల్లో ప్రతి గ్రామం, ప్రతి మండలం, ప్రతి మున్సిపాలిటీకి ప్రత్యేక లెక్క ఉంటుంది. అందుకే సీట్ల పంపకం కేవలం పైస్థాయి నాయకుల నిర్ణయంగా కాకుండా.. స్థానిక నేతల మధ్య పోటీగా మారే ప్రమాదం ఉంది.

ఈ క్ర‌మంలోనే స్థానిక ఎన్నికలు కూటమిని బలోపేతం చేస్తాయా? లేక టీడీపీ-జనసేన మధ్య అసలు చిచ్చు పెడతాయా? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. ఏపీ రాజ‌కీయాల‌ను విశ్లేషిస్తే.. ప్ర‌స్తుతానికి ఇద్దరికీ కూటమి అవసరమే. టీడీపీకి ప్రభుత్వాన్ని స్థిరంగా కొనసాగించేందుకు జనసేన బలం అవసరం. జనసేనకు రాష్ట్రవ్యాప్తంగా సంస్థాగతంగా విస్తరించేందుకు టీడీపీతో ఉన్న కూటమి ఉపయోగపడుతుంది.

కానీ.. కూటమి కొనసాగడం ఒకటి.. రెండు పార్టీల మధ్య రాజకీయ దూరం పెరగడం మరోటి! ఈ రెండింటినీ ఒకటిగా చూడకూడదు.

పవన్ కల్యాణ్ ఇప్పుడు జనసేనకు ఎక్కువ పొలిటిక‌ల్ స్పేస్ కావాలని కోరుకుంటున్నారు. టీడీపీ మాత్రం తన ఆధిపత్యాన్ని కొనసాగించాలనుకుంటుంది. ఈ రెండు లక్ష్యాలు ఢీకొంటే.. స్థానిక ఎన్నికలు ఇద్దరి మధ్య చిన్నపాటి ఘర్షణలకు కారణమయ్యే అవకాశం ఉంది.

అదే సమయంలో పవన్ కల్యాణ్ తన పార్టీని వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి మరింత బలంగా నిలబెట్టుకోవాలనుకుంటే.. ఇప్పటి నుంచే స్థానిక స్థాయిలో జనసేన క్యాడర్‌ను పెంచుకోవాల్సిందే. అందుకే ఈ ఎన్నికలు పవన్‌కు కేవలం స్థానిక ఎన్నికలు కాదు. జనసేన భవిష్యత్ విస్తరణకు ఇది మొదటి పెద్ద పరీక్ష!

మరి చంద్రబాబు ఈ డిమాండ్‌ను ఎలా బ్యాలెన్స్ చేస్తారు? జనసేనకు ఎక్కువ సీట్లు ఇస్తారా? లేక స్థానిక బలాబలాల ఆధారంగా కొత్త ఫార్ములా తీసుకొస్తారా? ఇదే ఇప్పుడు ఏపీ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్.

#Pawan Kalyan#Chandrababu Naidu#Nara Lokesh#TDP#Janasena#TDP Janasena Alliance#Andhra Pradesh Politics#AP Local Elections#AP Politics#NDA Alliance#Pawan Kalyan News#Telugu Desam Party
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి