దేశంలో మరో రివాల్యూషన్ రాబోతున్నదా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 70 ఏళ్లు పూర్తయింది. వెనకబడిన వర్గాలకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కల్పించిన రిజర్వేషన్లు నేటికీ కొనసాగుతున్నాయి. అయితే, ఈ రిజర్వేషన్ల కారణంగా తాము నష్టపోతున్నామని కొందరు విద్యార్థులు, అగ్రవర్ణాల వారు ఆందోళన చెందుతున్నారు.అగ్రవర్ణాల్లోనూ పేదలు ఉన్నారని, మధ్యతరగతి వారు ఉన్నారని, కులాల ఆధారంగా రిజర్వేషన్ ఇవ్వడం వలన తాము పేదరికంలో ఉన్నా తమకు రిజర్వేషన్లు వర్తించడం లేదని, తీరా కష్టపడి చదివి జాతీయ స్థాయిల్లో ర్యాంకులు సాధిస్తే రిజర్వేషన్ల కారణంగా అనుకున్న కాలేజీ,వర్సిటీల్లో సీట్లు రావడం లేదని వాపోతున్నారు.
అందుకే కులం ఆధారిత రిజర్వేషన్లు తొలగించి కేవలం ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రస్తుతం డిమాండ్లు వినిపిస్తున్నాయి..ఈ క్రమంలోనే ‘రిజర్వేషన్ హటావో ఆందోళన్’పేరిట ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా పెద్దఎత్తున క్యాంపెనింగ్ నడుస్తోంది.నిన్న ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా పెద్దఎత్తున నిరసన ప్రదర్శన జరిగింది. ఈ ఆందోళన దేశం దృష్టిని ఆకర్షించింది.
విద్యార్థుల్లో రిజర్వేషన్ల అంశం హాట్ టాపిక్ అయ్యింది. తాము ఏండ్లుగా కోచింగ్ తీసుకుని, కఠోర శ్రమ చేసి ర్యాంకులు సాధిస్తే.. రిజర్వేషన్లను అడ్డంపెట్టుకుని కొందరు సీట్లు, ఉద్యోగాలు కొల్లగొడుతున్నారని నెట్టింట చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే దేశ యువత మరో ఉద్యమానికి సిద్ధం అయినట్టు కథనాలు వస్తున్నాయి. కుల ఆధారిత రిజర్వేషన్లకు స్వస్తి చెప్పాలని, కేవలం ఆర్థిక ప్రాతిపదికన మాత్రమే విద్యా, ఉద్యోగాల్లో సదుపాయాలు కల్పించాలని, క్రిమీలేయర్‌ను పటిష్టంగా అమలు చేయాలని ‘రిజర్వేషన్ హటావో ఆందోళన్’ప్రతినిధులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు.
https://x.com/Telugu360/status/2090980432607343084?s=20
డిజిటల్ నుంచి మొదలైన ఈ పోరాటం త్వరలోనే దేశవ్యాప్తంగా విస్తరించే అవకాశం లేకపోలేదని తెలుస్తోంది. అయితే, రిజర్వేషన్లు తొలగించే ముందు కులవ్యవస్థను రద్దుచేయాలని, అందరినీ సమానంగా చూడాలని, వెనుకబడిన వర్గాల వారికి చదువు, సమానత్వం కల్పిస్తే అప్పుడు రిజర్వేషన్లతో పని ఉండదని మరికొందరు అభిప్రాయాలు పంచుకుంటున్నారు. కులం తొలగిపోతే .. ‘నువ్వు పెద్దా? నేను చిన్నా?’ అంటరానితనం వంటి వివక్షలు పోయినప్పుడు రిజర్వేషన్లతో పనిలేదని.. కానీ,నేటికీ సమాజంలో కులవివక్ష కొనసాగుతోందని కొందరు తమ వాయిస్ వినిపిస్తున్నారు.కాగా, ఇది ఎక్కడికి దారితీస్తుందో వేచి చూడాల్సిందే.


