National

స్ట్రీట్ ఫైట్‌లో రాహుల్.. యూత్ కోసం కాంగ్రెస్ కొత్త గేమ్ ప్లాన్

రచన: Kashi••7 నిమిషాల పఠనం

రాహుల్ గాంధీ ఎందుకు పదేపదే స్ట్రీట్ పాలిటిక్స్ వైపు వెళ్తున్నారు? లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా పార్లమెంట్‌లో ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ఒక మార్గం. కానీ పోలీస్ స్టేషన్ ముందు కూర్చోవడం, విద్యార్థుల వెంట నిలబడటం, నిరసనల్లో నేరుగా పాల్గొనడం మరో రకమైన రాజకీయ యుద్ధం. కాంగ్రెస్ ఇప్పుడు ఈ రెండో మార్గానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్టుగా కనిపిస్తోంది.

మ‌రోసారి రోడ్డెక్కిన రాహుల్

మాస్ ధ‌ర్నాల‌కే ప్రాధాన్యత‌

విజ‌యం ద‌క్కాలంటే రోడ్డెక్కాలంతే..!

ఇదే కాంగ్రెస్ కొత్త స్ట్రాట‌జీ

ఢిల్లీలో మరోసారి రోడ్డెక్కారు రాహుల్ గాంధీ. పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ ముందు గంటల తరబడి ధర్నా చేశారు. జులై 20న విద్యార్థుల ఆందోళన సమయంలో పెల్లెట్ గన్ వాడారన్న ఆరోపణలపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ ఆందోళన చేపట్టారు. 19 ఏళ్ల విద్యార్థి సాహిల్ లోచబ్ తనకు పెల్లెట్ గాయాలయ్యాయని ఆరోపిస్తున్నాడు. రాహుల్ గాంధీ ధర్నా కొనసాగుతున్న సమయంలో ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

ఎందుకీ స్ట్రీట్ ఫైట్స్

ఇక్కడ అసలు ప్రశ్న వేరే. రాహుల్ గాంధీ ఎందుకు పదేపదే స్ట్రీట్ పాలిటిక్స్ వైపు వెళ్తున్నారు? లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా పార్లమెంట్‌లో ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ఒక మార్గం. కానీ పోలీస్ స్టేషన్ ముందు కూర్చోవడం, విద్యార్థుల వెంట నిలబడటం, నిరసనల్లో నేరుగా పాల్గొనడం మరో రకమైన రాజకీయ యుద్ధం. కాంగ్రెస్ ఇప్పుడు ఈ రెండో మార్గానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్టుగా కనిపిస్తోంది.

యూత్‌ను టార్గెట్ చేస్తున్న రాహుల్?

ఇటీవలి కాలంలో రాహుల్ గాంధీ రాజకీయాల్లో యువత, విద్యార్థులు, ఉద్యోగాలు, పరీక్షలు, పేపర్ లీకులు వంటి అంశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా Gen Zని రాజకీయ చర్చలోకి తీసుకురావడంపై కాంగ్రెస్ ఫోకస్ పెంచుతున్నట్టు తాజా ప‌రిణామాలు చూస్తే అర్థ‌మ‌వుతోంది. విద్యార్థుల రోజువారీ సమస్యల దగ్గరకు వెళ్లడం, వారి ఆందోళనల్లో ప్రత్యక్షంగా కనిపించడం ఈ వ్యూహంలో భాగంగానే చూడొచ్చు.

యువ ఓటర్లు రాజకీయ పార్టీలకు అత్యంత కీలకంగా మారుతున్నారు. సోషల్ మీడియా కాలంలో కేవలం సభలు, ర్యాలీలు, భారీ ప్రసంగాలతో యువతను ఆకర్షించడం కష్టమవుతోంది. సమస్యపై మనతో ఎవరు నిలబడుతున్నారు? అన్నదే యువ‌త‌కు ముఖ్యంగా మారుతోంది. అందుకే రాహుల్ ఇప్పుడు పార్లమెంట్‌లో మాట్లాడే నాయకుడిగా మాత్రమే కాకుండా.. రోడ్డుపై నిరసన చేసే నాయకుడిగా కూడా తన ఇమేజ్‌ను నిర్మించుకునే ప్రయత్నం చేస్తున్నారు.

ఇది కేవలం పెల్లెట్ గన్ వ్యవహారమేనా?

కాంగ్రెస్‌కు ఈ అంశంలో రెండు లాభాలు కనిపిస్తున్నాయి. మొదటిది.. విద్యార్థులపై పోలీసు చర్య జరిగిందన్న ఆరోపణను జాతీయ రాజకీయ అంశంగా మార్చడం. రెండోది.. కేంద్ర ప్రభుత్వాన్ని యూత్ వాయిస్‌ను అణచివేస్తున్న ప్రభుత్వంగా చూపించే అవకాశం.

అదే సమయంలో రాహుల్ గాంధీతో పాటు ప్రియాంక గాంధీ, పార్టీ సీనియర్ నేతలు కూడా ధర్నాలో పాల్గొనడం ద్వారా ఇది వ్యక్తిగత నిరసన కాకుండా కాంగ్రెస్ మొత్తం యంత్రాంగం తీసుకున్న రాజకీయ స్టాండ్ అనే సందేశాన్ని పార్టీ ఇచ్చింది.

మరి స్ట్రీట్ ఫైట్ ఒక్కటే దారా?

ఇక్కడే కాంగ్రెస్ ముందు అసలు సవాల్‌ ఉంది. యువతను ఆకర్షించడానికి కేవలం ధర్నాలు, అరెస్టులు, పోలీస్ స్టేషన్లు, రోడ్డు నిరసనలు సరిపోతాయా? అసలు యువత కోరుకునేది ఉద్యోగాలు, నాణ్యమైన విద్య, పరీక్షల్లో పారదర్శకత, స్కిల్ డెవలప్‌మెంట్, స్టార్టప్ అవకాశాలు, భవిష్యత్తుపై భరోసా.

అందుకే రాహుల్ గాంధీ స్ట్రీట్ ఫైట్‌తో యువత దృష్టిని ఆకర్షించగలిగినా.. ఆ దృష్టిని ఓటుగా మార్చాలంటే దానికి మించి ఒక స్పష్టమైన యూత్ పాలసీ కావాలి. కాంగ్రెస్‌కు ఇదే పెద్ద టెస్ట్. ఒకవైపు రాహుల్‌ను యూత్‌కు దగ్గర చేయాలి. మరోవైపు రాష్ట్రాల్లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాల పనితీరును కూడా అదే యువతకు సమాధానం చెప్పగలిగే స్థాయిలో ఉంచాలి.

కాంగ్రెస్ అసలు వ్యూహం ఇదేనా?

చూస్తుంటే కాంగ్రెస్ వ్యూహం మూడు దశల్లో ఉన్నట్టుగా కనిపిస్తోంది. విద్యార్థుల సమస్యల‌ను గుర్తించ‌డం.. దాన్ని జాతీయ రాజకీయ అంశంగా మార్చడం.. ఆ తర్వాత రాహుల్‌ను యువత తరఫున పోరాడే నాయకుడిగా ప్రొజెక్ట్ చేయడం.

2029 ఎన్నికలకు ఇప్పటి నుంచే ఒక పొలిటికల్ బిల్డప్‌గా కూడా దీన్ని చూడొచ్చు. అయితే యువతను ఆకర్షించడం కేవలం ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలతో సాధ్యమవుతుందా? లేక మేము అధికారంలోకి వస్తే యువతకు ఏం చేస్తాం? అనే ప్రశ్నకు కూడా కాంగ్రెస్ సమాధానం చెప్పాల్సి ఉంటుందా?

రాహుల్ గాంధీ ప్రస్తుతం రోడ్డుపైకి వచ్చారు. కానీ అసలు గేమ్ మాత్రం రాబోయే రోజుల్లో తెలుస్తుంది. స్ట్రీట్ ఫైట్‌తో యువత మ‌ద్ద‌తు పొంద‌గలరా? లేక యువత కోసం కొత్త రాజకీయ అజెండాను కూడా కాంగ్రెస్ తయారు చేస్తుందా? ఇదే ఇప్పుడు ఆసక్తికరమైన ప్రశ్న.

#Rahul Gandhi#Congress#Indian Politics#Gen Z#Youth Politics#Congress Strategy#Rahul Gandhi Protest#Youth Vote#2029 Elections#Delhi Protest#Student Protest#Political Strategy
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి