తమిళ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన సీఎం విజయ్.. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ ఆసుపత్రుల్లో జన్మించిన శిశువులకు ‘బంగారు’ ఉంగరం అందించే కార్యక్రమాన్ని రెడీ చేయాలని అధికారులను ఆదేశించినట్టు తెలుస్తోంది.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో జన్మించిన అర్హులైన శిశువులందరికీ "తాయిమామన్ తంగ మోతిర తిట్టం" పేరిట ఒక్క గ్రాము బంగారు ఉంగరం అందించాలని టీవీకే ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా.. మాజీ ముఖ్యమంత్రి సి.ఎన్.అన్నాదురై జయంతి సందర్భంగా ఈ పథకాన్ని ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది. అయితే, బంగారం ధర మినహా తయారీ, రవాణా, ఇన్సూరెన్స్ అన్నింటికీ కేవలం ఒక్క పైసా మాత్రమే కోట్ చేసి జోస్ అలుక్కాస్ జువెలరీ సంస్థ టెండర్ దక్కించుకున్నట్టు సమాచారం.
విజయ్ సర్కార్ తీసుకున్న నిర్ణయంతో తమిళ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తుండగా.. ఎన్నికల ముందు ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే తమిళనాడు బడ్జెట్ కూడా సరిపోదని కొందరు అంటున్నారు. అమలుకు సాధ్యం హామీలు ఇచ్చారని, రాష్ట్ర బడ్జెట్‌లో మూడో వంతు సంక్షేమానికే వెళితే.. ఉద్యోగాల జీతాలు, మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి, కొత్త ప్రాజెక్టులకు నిధులు ఎక్కడి నుంచి తెస్తారని ప్రతిపక్ష డీఎంకే పార్టీ ఆరోపిస్తున్నది.
గత ఎన్నికల్లో టీవీకే పార్టీ ఎవరూ ఊహించని విధంగా సింగిల్ లార్జెట్ పార్టీగా అవతరించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్, ఇతర చిన్న పార్టీల మద్దతుతో మైనార్టీలో ఉన్న టీవీకే ప్రభుత్వం తమిళనాడులో కొలువుదీరింది. ఇప్పటివరకు బాగానే ఉన్నా మున్ముందు విజయ్‌కు సవాళ్లు తప్పవని పొలిటికల్ విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే చదువుకుని ఉద్యోగం రాని వారికి నిరుద్యోగ భృతి రూ.4వేలు, మహిళలకు నెల నెలా రూ.2500 ఆర్థిక సాయం, పేదింటి యువతుల పెళ్లిళ్లకు సవర (8 గ్రాములు) బంగారం, నాణ్యమైన కంచిపట్టు చీర, రూ.5 లక్షల వరకు వడ్డీలేని రుణాలు, ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూళ్లలో విద్యార్థుల డ్రాప్‌ఔట్‌లను తగ్గించేలా వారి తల్లులకు ఏటా రూ.15000 ఆర్థిక సాయం, రైతులకు రుణ మాఫీ, నేత కార్మికులకు రూ.10 లక్షల బీమా వంటివి కూడా ఇస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. ఇప్పటికే చాలా రాష్ట్రాలు నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటించి అమలు చేయలేదు. ఫలితంగా ప్రభుత్వాలు మారిన ఘటనలు అనేకం ఉన్నాయి.


