తెలంగాణ

Tummala Nageswara Rao: ఎల్‌నినో సవాళ్లను విపత్తుగా కాకుండా అవకాశంగా మార్చుకోవాలి- మంత్రి తుమ్మల

రచన: NK••10 నిమిషాల పఠనం

ఎల్‌నినో ప్రభావంతో రానున్న సవాళ్లను ముందుగానే గుర్తించి తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా సన్నద్ధం చేయాలని పలువురు మంత్రులు అధికారులకు సూచించారు. ఎల్‌నినో సాధారణ పరిస్థితి కాదని ముఖ్యంగా అక్టోబర్‌, నవంబర్‌ నెలల్లో పంటలు చేతికొచ్చే సమయంలో నీటి లభ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు.

Tummala Nageswara Rao: ఎల్‌నినో ప్రభావంతో రానున్న సవాళ్లను ముందుగానే గుర్తించి తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా సన్నద్ధం చేయాలని పలువురు మంత్రులు అధికారులకు సూచించారు. ఎల్‌నినో సాధారణ పరిస్థితి కాదని ముఖ్యంగా అక్టోబర్‌, నవంబర్‌ నెలల్లో పంటలు చేతికొచ్చే సమయంలో నీటి లభ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. శుక్రవారం రాజేంద్రనగర్‌లోని TGIRDలో ఎల్‌నినోను ఎదుర్కొనేందుకు VB-G RAM-G, సమీకృత వ్యవసాయ కుంటల పాత్రపై నిర్వహించిన వర్క్‌షాప్‌లో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు.. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క.. పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి, సీఎస్ సంజయ్ జాజు.. వ్యవసాయం, పశుసంవర్ధక, పంచాయతీరాజ్‌ శాఖల సెక్రటరీలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

రేయింబవళ్లు మోటార్లు నడిపొద్దు

అన్ని శాఖల అధికారులు సమన్వయంతో సమావేశం ఏర్పటు చేయడం హర్షనీయమని మంత్రి తుమ్మల అన్నారు. ప్రస్తుతం భూగర్భ జలాలు పెరిగే స్థాయిలో వర్షపాతం నమోదు కాలేదని, ప్రధాన జలాశయాల్లోకి కూడా ఆశించిన స్థాయిలో నీరు చేరలేదని మంత్రి తెలిపారు. రాబోయే రోజుల్లో అందుబాటులో ఉండే భూగర్భ జలాలపై రోజువారీగా అంచనాలు రూపొందించి, వాటిని జాగ్రత్తగా వినియోగించేలా అధికారులు రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఆటో స్టార్టర్లతో రేయింబవళ్లు మోటార్లు నడిపి భూగర్భ జలాలను వృథా చేయకుండా, పంటకు అవసరమైన మేరకే నీటిని వినియోగించేలా చర్యలు తీసుకోవాలన్నారు.

చెరువుల్లోకి వర్షపు నీటిని మళ్లించేలా చర్యలు

వర్షపు నీటిని గరిష్ఠంగా నిల్వ చేసుకునేలా రాష్ట్రంలోని 44 వేల చెరువులను సంరక్షించాల్సిన అవసరం ఉందని మంత్రి పేర్కొన్నారు. చెరువుల్లోకి వర్షపు నీటిని మళ్లించేలా చర్యలు చేపట్టి, వాటిలో నీటిని నిల్వ చేస్తే చుట్టుపక్కల ప్రాంతాల్లో భూగర్భ జలాలు పెరిగి బోర్లు పనిచేసే అవకాశం ఉంటుందన్నారు. వాగులు, నదుల్లో అవసరమైన ప్రాంతాల్లో ట్రెంచ్‌లు, రాక్‌ఫిల్‌ డ్యామ్‌లు ఏర్పాటు చేయడం ద్వారా నీటిని భూగర్భంలోకి ఇంకేలా చేసి భూగర్భ జలాల నిల్వ సామర్థ్యాన్ని పెంచవచ్చన్నారు.

సవాలుగా కాకుండా అవకాశంగా మలుచుకోవాలి

ఎల్‌నినో వంటి ప్రకృతి వైపరీత్యాలను సవాలుగా కాకుండా అవకాశంగా మలుచుకోవాలని మంత్రి అన్నారు. కొత్త సాంకేతికత కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేదని, గతంలో మన తాతలు, తండ్రులు అనుసరించిన నీటి సంరక్షణ పద్ధతులను తిరిగి ఆచరణలోకి తీసుకురావాలని సూచించారు. వ్యవసాయం, పశుసంవర్ధక, మత్స్య, అటవీ, పంచాయతీరాజ్‌, నీటిపారుదల తదితర శాఖలు సమన్వయంతో పని చేస్తే ఎలాంటి విపత్కర పరిస్థితినైనా సమర్థంగా ఎదుర్కోవచ్చన్నారు.

నిజాయితీ, నిబద్ధతతో పని చేయాలి

జిల్లా స్థాయిలో అధికారులు ప్రతిరోజూ సమన్వయ సమావేశాలు నిర్వహించి తమ జిల్లాలో చేపట్టాల్సిన చర్యలపై స్పష్టమైన ప్రణాళిక రూపొందించుకోవాలని మంత్రి సూచించారు. మండల స్థాయిలో మండల అధికారులు, జిల్లా స్థాయిలో జిల్లా అధికారులు సమన్వయంతో పనిచేయాలని, రైతులు, ప్రజలకు అధికారులు నమ్మకమైన మార్గదర్శకత్వం అందించాలని కోరారు. నిజాయితీగా, నిబద్ధతతో పనిచేసే అధికారుల మాటను రైతులు, ప్రజలు విశ్వసిస్తారని, అధికారులు ప్రజలతో మానవీయ కోణంలో వ్యవహరించాలని అన్నారు.

అంతర పంటలతో ఆదాయ అవకాశాలు

రైతులను ఒకే పంటపై ఆధారపడే పరిస్థితి నుంచి బయటకు తీసుకురావాల్సిన అవసరం ఉందని మంత్రి తుమ్మల తెలిపారు. పంటల వైవిధ్యాన్ని ప్రోత్సహిస్తూ ధరల్లో హెచ్చుతగ్గులు వచ్చినా రైతుకు నష్టం రాకుండా చూడాలన్నారు. ముఖ్యంగా ఉద్యాన పంటలకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు ఆయిల్‌ పామ్‌ సాగును విస్తరించాలని సూచించారు. ఆయిల్‌పామ్‌తో పాటు కోకో, వక్క, మిరియాలు వంటి అంతర పంటలను ప్రోత్సహించడం ద్వారా రైతులకు అదనపు ఆదాయ అవకాశాలు కల్పించవచ్చన్నారు.

లాభదాయక వ్యవసాయం ప్రభుత్వం లక్ష్యం

తెలంగాణను దేశంలోనే ఆయిల్‌పామ్‌ సాగులో అగ్రగామి రాష్ట్రంగా నిలిపేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి తుమ్మల తెలిపారు. అన్ని జిల్లాల్లో ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేసే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని, రైతులకు లాభదాయకమైన వ్యవసాయాన్ని అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఉద్యాన రంగాన్ని కూడా సమగ్రంగా అభివృద్ధి చేసి తెలంగాణను పొరుగు రాష్ట్రాలకు దీటుగా ముందుకు తీసుకెళ్లాలని అధికారులకు సూచించారు.

రైతుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ముందుగానే కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసిందని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎల్‌నినో పరిస్థితులను ఎదుర్కోవడం, పంటల వైవిధ్యాన్ని పెంచడం తదితర అంశాలపై నిరంతరం అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారని చెప్పారు. గత 6 నెలలుగా వ్యవసాయ శాఖతో పాటు ఇతర శాఖల అధికారులు రైతాంగ సమస్యలపై నిరంతరం చర్చిస్తూ ముందస్తు ప్రణాళికలు రూపొందిస్తున్నారని పేర్కొన్నారు.

పశువులు, అటవీ జంతువులకు కూడా నీటి లభ్యత

ప్రకృతి వైపరీత్యాల సమయంలో పశువులు, అటవీ జంతువులకు కూడా నీటి లభ్యత ఉండేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. గతంలో కరవు పరిస్థితుల్లో గ్రామాల వెలుపల పశువుల కోసం నీటి తొట్లు ఏర్పాటు చేసినట్లుగానే, అవసరమైతే అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణులకు కూడా నీటి సదుపాయం కల్పించాలని అన్నారు. జీవ వైవిధ్యాన్ని కాపాడుతూ అన్ని జీవులు సమానంగా జీవించే వాతావరణాన్ని కల్పించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు.

“ఎల్‌నినో కాదు.. ఎల్‌నినో తాత వచ్చినా తెలంగాణ రైతులను నిలబెట్టగలిగే శక్తి రాష్ట్రానికి ఉండాలి” అనే లక్ష్యంతో అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు కలిసి పనిచేయాలని మంత్రి తుమ్మల పిలుపునిచ్చారు. “ప్రతి గ్రామానికి నీటి బడ్జెట్-ప్రతి రైతుకు నీటి భద్రత-ప్రతి ఎకరానికి వాతావరణ మార్పులను తట్టుకునే సామర్థ్యం” అనే లక్ష్యంతో అన్ని శాఖలు సమన్వయంతో ముందుకు సాగాలని ఆయన కోరారు.

ముందస్తు కార్యాచరణతో ఎల్ నినోను అధిగమించొచ్చు-మంత్రి శ్రీహరి

''గతంలో కూడా దేశంలో ఎల్ నినో ప్రభావాలు వచ్చాయి. 1951 నుంచి నేటి వరకు 12సార్లు ఎల్ నినోను భారత దేశం ఎదుర్కొంది. కరవును ఎలా ఎదుర్కోవాలనే అవగాహన రైతులకు ఉంటుంది. కానీ ఆ అవగాహనను ఆచరించేలా చేసే బాధ్యత మనది. పంటల మార్పిడి ద్వారా వ్యవసాయ రంగంలో మార్పులు తీసుకురావచ్చనే విషయంలో రైతులకు సలహాలు ఇవ్వాలి. ఆస్ట్రేలియా వంటి దేశాలు ముందస్తు కార్యాచరణ ద్వారా ఎల్ నినోను సమర్థవంతంగా అధిగమించాయి. కరవు పరిస్థితుల్లో పశువుల పెంపకం, సంరక్షణ వంటి వాటిపై అన్నదాతలకు అవగాహన కల్పించాలి''.

#Tummala Nageswara Rao#Elnino#Telangana#Farmers#Agriculture#Drought#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి